ఉపోద్ఘాతము:

పేరు: నూతన నిబంధనలోని కతోలిక లేఖల విభాగం, యాకోబు లేఖతో మొదలవుతుంది. ‘యాకోబు’ అనే పేరు గల ప్రస్తావనలు నాలుగున్నాయి. అవి: యోహాను సోదరుడు, అల్ఫయి కుమారుడు, క్రీస్తు 12 మంది శిష్యులలో నొకడు (మత్త. 4:21; 10:2-3; లూకా 6:15; మార్కు, 6:3).  క్రీస్తు పునరుత్థాన సమయంలో ఉన్నవారు (1 కొరి. 15:7). ప్రస్తుత రచయిత శ్రీసభ స్తంభంగా గుర్తింపు పొందాడు (గలతీ 2:9). పేతురు చెర వార్తను విన్నాడు (అ.కా. 12:17). యెరూషలేము సభలో సభ్యుడు (అ.కా. 15:13). యాకోబు క్రీ.శ. 62 లో వేదసాక్షిగా మరణించాడని యూదుల చరిత్రకారుడు యోసేఫుస్‌ ఫ్లావియుస్‌ తెలుపుతాడు.

కాలము: క్రీ.శ. 62. 

రచయిత: యాకోబు.

చారిత్రక నేపథ్యము:హింసల వల్ల క్రైస్తవులు రోమా సామ్రాజ్యమంతా చెల్లాచెదరైపోయారు. వారు విశ్వాసానికి వ్యతిరేకంగా అనేక బాధలు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో వారు సహనం, సహృదయం గలవారుగా వుండాలని బోధిస్తూ ఈ లేఖను రాసి ఉంటాడని తెలుసుకుంటాం.

ముఖ్యాంశములు: దేవుని ప్రజలు ఎలా జీవించాలో, అన్యుల పట్ల ఎలా మెలగాలో సూచిస్తాడు యాకోబు. విశ్వాస పరీక్షకు గురైనప్పుడు, పేదవాడుగా మిగిలిపోయినప్పుడు, నిరుత్సాహపడకూడదని హితవు పలుకుతాడు. యాకోబు దైనందిన క్రైస్తవ జీవన శైలికి సంబంధించిన బోధలు చేశాడు.

క్రీస్తు చిత్రీకరణ: క్రీస్తును యూద మత దృక్పథంలో చూపెడుతుంది (1:1). క్రీస్తు రెండవ రాకడ ప్రస్తావన చూస్తాం (5:7-8). క్రీస్తు కొండమీద ప్రసంగాల ఛాయలు ఈ లేఖలో పుష్కలంగా కనబడతాయి (1:2 = మత్త. 5:10-12; 1:4 = మత్త. 5:48; 2:13 = మత్త. 6:14; 4:11 = మత్త. 7:1-2; 5:2 = మత్త. 6:19). వీటిని ఆధారం చేసికొని యాకోబు క్రీస్తును యూదుల మెస్సయగా ఆవిష్కరిస్తాడు.