1 1. నీనెవె నగరమును గూర్చిన దైవోక్తి, ఎల్కోషు నివాసియైన నహూము చూచిన దర్శన వృత్తాంతము.

నీనెవెపై ప్రభువు ఆగ్రహము

2.           ప్రభువు రోషము గలవాడై పగతీర్చుకొనువాడు.

               ఆయన ప్రతీకారముచేయువాడు,

               కోపపూరితుడు.

               ఆయన తన శత్రువులను దండించును,

               వారిపై ఆగ్రహము వెళ్ళగ్రక్కును.

3.           ప్రభువు సులభముగా కోపింపడు.

               కాని మహాబలసంపన్నుడు.

               ఆయన దోషులను శిక్షింపక వదలడు.

               ప్రభువు నడచునపుడు తుఫాను చెలరేగును.

               ఆయన నడచునపుడు

               రేగుపాదధూళియే మేఘములు.

4.           ఆయనాజ్ఞ నీయగా సాగరము ఎండిపోవును.

               ఆయన నదులు ఇంకి పోవునట్లుచేయును.

               బాషాను పొలములెండి పోవును.

               కర్మెలుకొండ మాడిపోవును.

               లెబానోను పూవులు వాడిపోవును.

5.           ప్రభువును చూచి పర్వతములు కంపించును.

               కొండలు కరగును.

               ఆయనయెదుట భూమి గడగడవణకును.

               లోకము, దానిలోని ప్రజలును భీతిల్లుదురు.

6.           ఆయన ఆగ్రహమును ఎవడు తట్టుకొనగలడు?

               ఆయన ఉగ్రకోపమునెవడు సహింపగలడు?

               ఆయన తన కోపాగ్నిని క్రుమ్మరించును.

               ఆయన ఎదుట బండలు పొడుమగును.

7.            ప్రభువు మంచివాడు.

               అతడు తన ప్రజలను ఆపదలనుండి కాపాడును. తనను నమ్మువారిని ఆదుకొనును.

8.           ఆయన మహాప్రవాహమువలె

               తన శత్రువులను తుడిచిపెట్టును.

               తననెదిరించువారిని

               మృతలోకమునకు పంపును.

యూదా, నీనెవెలను పురస్కరించుకొని ప్రవచనములు

యూదా

9.           మీరు ప్రభువునకు విరోధముగా

               ఏమి యోచించుచున్నారు?

               ఆయన మిమ్ము సర్వనాశనము చేయును.

               రెండవమారు ఉపద్రవము కలుగకుండ

               ఆయన దానిని పూర్తిగా నివారించగలడు.

10.         శత్రువులు ముండ్లపొదలవలె చ్టుినను,

               ద్రాక్షరసము త్రాగి మత్తులైనను,

               వారు ఎండిన గడ్డివలె భస్మమై పోవుదురు

నీనెవె

11. నీనెవె నగరమా!

               నీ నుండి ప్రభువుపై కుట్రలుపన్ను

               దుష్టుడు బయలుదేరెను.

యూదా

12.          ప్రభువు తన ప్రజలైన

               యిస్రాయేలీయులకు ఇట్లు చెప్పెను:

               ”అస్సిరియనులు అనేకులైనను, బలాఢ్యులైనను

               ఆయన వారిని దాిపోవుచుండగ

               వారు కోతవలె కోయబడి నిర్మూలమగుదురు

               నా ప్రజలారా!

               నేను మిమ్ము  శ్రమలపాలు చేసితిని.

               కాని ఇకమీదట మీకు బాధలు కలుగవు.

13. మీమీదనున్న అస్సిరియనుల

               కాడిమ్రానును విరిచివేసెదను.

               వారి కట్లను తెంపుదును.

నీనెవె

14. ప్రభువు అస్సిరియనులను గూర్చి

               ఈ నిర్ణయము చేసెను: ఆ జాతి పేరు నిలబెట్టు

               సంతానమేమియు వారికి మిగులదు.

               నేను వారి దైవముల మందిరములందలి      పోతవిగ్రహములను చెక్కినబొమ్మలను

               నాశనము చేయుదును.

               నేను వారికి సమాధి సిద్ధము చేయుచున్నాను. ఆ ప్రజలిక బ్రతుకుటకు అర్హులుకారు”.

యూదా

15. అదిగో! శుభవర్తమానము తెచ్చుదూత

               కొండల మీదినుండి పరుగెత్తుకొని వచ్చుచున్నాడు.

               అతడు విజయవార్తల నెరిగించును.

               యూదా ప్రజలారా!

               మీరు ఉత్సవములు చేసికొనుడు.

               మీ మ్రొక్కుబడులు తీర్చుకొనుడు.

               దుష్టులు మీపై మరల దాడిచేయరు.

               వారు అడపొడ కానరాకుండ పోవుదురు.

Previous                                                                                                                                                                                                  Next