1 1. యేసుక్రీస్తు సేవకుడును, అపోస్తలుడుగా ఉండుటకును
పిలువబడినవాడును, దేవునిసువార్త నిమిత్తము
ప్రత్యేకింపబడినవాడును అయిన
పౌలు వ్రాయునది:
2. తన కుమారుని గూర్చిన ఈ సువార్తను దేవుడు ముందుగా తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనము లందు వాగ్ధానము చేసెను.
3. మన ప్రభువైన యేసు క్రీస్తు మానవుడుగా, దావీదు సంతతియై జన్మించెను.
4. కాని, ఆయన మృతులలో నుండి పునరుత్థాను డైనందున పవిత్రపరచు ఆత్మశక్తితో దేవుని కుమారు డుగా నియమింపబడెను.
5. అన్ని జాతుల ప్రజలును ఆయన నామమున విశ్వాసమునకు విధేయులగునట్లు చేయుటకై దేవుడు నాకు ఆయన ద్వారా తన అను గ్రహమును అపోస్తలత్వమును ఒసగెను.
6. మీరును వారిలోని వారే. యేసుక్రీస్తు ప్రజలుగా ఉండుటకు దేవుడు మిమ్ము పిలిచెను.
7. రోము నగరమందలి పరిశుద్ధులుగా ఉండు టకు పిలువబడిన దేవుని ప్రియులందరికి శుభమును కోరుచు వ్రాయునది.
మన తండ్రి దేవుని నుండి, ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపను, సమాధానమును కలుగునుగాక!
కృతజ్ఞతా స్తుతి
8. మొదట మీ అందరికొరకై యేసుక్రీస్తు ద్వారా నా దేవునకు కృతజ్ఞతలు చెప్పుకొందును. ఏలయన మీ విశ్వాసమును ప్రపంచమంతయు పొగడుచున్నది.
9. తన కుమారుని గురించి సువార్తా ప్రచారముచేయుచు, హృదయపూర్వకముగా నేను సేవించుచున్న దేవుడు నేను చెప్పునది నిజమని నిరూపింపగలడు. మిమ్ము ఎల్లవేళల నా ప్రార్థనల యందు జ్ఞాపకముంచుకొనుచున్నానని ఆయనకు తెలియును.
10. ఆయన సంకల్పము వలన, ఎటుల యినను చివరకు మిమ్ము చేరుకొనగలుగుటకై సర్వదా ప్రార్థించుచున్నాను.
11. ఏలయన, మిమ్ము చూడవ లెనని ఎంతగానో కోరుచున్నాను. మిమ్ము బల పరచుటకు ఆధ్యాత్మికమైన కృపావరమును మీకు ఈయగోరుచున్నాను.
12. అనగా నేను మీ మధ్య ఉండి, నేను మీ విశ్వాసము వలనను, మీరు నా విశ్వాసము వలనను ప్రోత్సాహము పొందగలమని ఆశించు చున్నాను.
13. నేను మిమ్ము కలిసికొనవలెనని అనేక మార్లు ఉద్దేశించితిని. కాని, ఇప్పటివరకు ఏదియో ఒక ఆటంకము కలుగుచునేయున్నది. సోదరులారా! అన్యులను ఎట్లు విశ్వాసులుగ మార్చితినో అట్లే మీ యందును మార్పు తీసికొనిరావలెనని నా కోరిక.
14. ఏలయన, గ్రీకులు, అనాగరికులు, జ్ఞానులు, అజ్ఞానులు అగు అందరిపట్ల నాకు ఒక బాధ్యత ఉన్నది.
15. కనుకనే రోమీయులగు మీకును తక్కిన వారికి వలె సువార్తను బోధింపవలెనని నేను ఆశపడు చున్నాను.
సువార్త శక్తి
16. నేను సువార్తను గూర్చి సిగ్గుపడుటలేదు. ఏలయన, అది విశ్వసించువారందరకు, మొదట యూదులకు, తరువాత గ్రీకులకు కూడ రక్షణ నొసగు దేవునిశక్తి.
17. ఏలయన ”విశ్వాసము ద్వారా నీతి మంతుడు జీవించును” అని వ్రాయబడియున్నట్లు విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయల్పరచబడుచున్నది.
మానవుల దోషము
18. మానవుల భక్తిహీనతపై, దౌష్ట్యముపై పరలోకమునుండి దేవుని ఆగ్రహము బహిర్గతమగు చున్నది. వారి దౌష్ట్యము సత్యమును అణచివేయు చున్నది.
19. ఏలయన, దేవుని గూర్చి తెలిసికొన గలిగినది వారికి తేటతెల్లమే. వాస్తవముగ దేవుడే వారికి దానిని ఎరుకపరచెను.
20. దేవుడు ప్రపంచ మును సృష్టించిన నాటినుండి ఆయన యొక్క అగోచర గుణములు అనగా ఆయన శాశ్వతశక్తి, దైవత్వము, సృష్టి వస్తుజాలములో స్పష్టముగ విశదమైనవి. కనుక వారికి ఎట్టి సాకును లేదు.
21. వారు దేవుని ఎరిగి నప్పటకిని ఆయనకు ఈయవలసిన గౌరవమును వారు ఈయలేదు. ఆయనకు కృతజ్ఞతను చూపలేదు. అంతేకాక, వారు తమ, హేతువాదములందు వ్యర్థు లైరి. వారి బుద్ధిహీనహృదయములను చీకటి ఆవరించినది.
22. తాము బుద్ధిమంతులము అని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి.
23. వారు అమరుడైన దేవుని మహిమను మరణమందు మనుష్యుని స్వరూపముగా, పక్షులయొక్క, జంతువులయొక్క, సర్పములయొక్క రూపములుగా మార్చిరి.
24. కనుక దేవుడు వారిని వారి హృదయముల దురాశలకును, పరస్పర జుగుప్సాకర ప్రవర్తనలకును వదలివేసెను.
25. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువును వారు పూజించి సేవించిరి.
ఆయన సర్వదా స్తుతిపాత్రుడు. ఆమెన్.
26. ఈ కారణములవలన, దేవుడు వారిని తుచ్ఛ వ్యామోహముల పాలొనర్చెను. వారి స్త్రీలు కూడ తమ లైంగికకృత్యములను స్వభావవిరుద్ధములగు చేష్టల ద్వారా వక్రమొనర్చిరి.
27. అట్లే పురుషులును స్త్రీలతో సహజమగు లైంగిక సంబంధమును విడనాడి, తమలో తాము అన్యోన్యమగు మోహముచే తపించిరి. వారు ఒకరితో ఒకరు లజ్జాకరముగ ప్రవర్తించిరి. దాని ఫలితముగా వారు తమ తప్పునకు తగిన శిక్షను తమ శరీరములందు అనుభవించిరి.
28. దేవుని గూర్చిన సత్యమగు జ్ఞానమును వారు తమ మనసులలో ఉంచుకొనలేదు. కనుకనే చేయరాని పనులు చేయునట్లుగ దేవుడు వారిని భ్రష్టమనస్సుకు అప్పగించెను.
29. వారు సర్వవిధములగు దుష్టత్వ ముతోను, చెడుగుతోను, అత్యాశతోను, ద్వేషముతోను నిండియుండిరి.అసూయ,హత్య,కలహము,మోసము, దుర్గుణములతోను వారు నిండియుండిరి. వారు కబుర్లతో కాలక్షేపము చేయుచు, 30. ఇతరులను గూర్చి చెడ్డగా మాటలాడుచుందురు. వారు దైవ ద్వేషులు, అహంకారులు, గర్వితులు, డాంబికులు, సదా దుష్టమార్గములనే కనిపెట్టువారు, తల్లిదండ్రు లకు అవిధేయులై ప్రవర్తించువారు, 31. అవివేకులు, ఆడితప్పువారు, పాషాణహృదయులు, నిర్దయులు.
32. ఇట్టి ప్రవర్తన కలవారికి చావే తగినదను దేవుని చట్టము వారికి తెలియును. అయినను, వారు ఈ పనులను చేయుచునే ఉందురు. వారు చేయుట మాత్రమే కాదు. అటుల చేయు తదితరులను కూడ ఆమోదింతురు.