ఉపోద్ఘాతము:

పేరు: మార్కు పేరు ”మార్కుసు” అనే లతీను పదం నుండి వస్తుంది. హీబ్రూ వర్గాలలో ఇతడిని యోహానుగా, యోహాను మార్కు (అ.కా. 12:12,25; 15:37)గా పిలిచారు. మార్కు తల్లి మరియ. వీరికి యెరూషలేములో ఇల్లు వుండేది.  పేతురు వీరికి సుపరిచితుడు (అ.కా. 12:13-16). బర్నబా మార్కుకు మేనమామ (కొలొస్సీ 4:10). పేతురు ఇతనిని ”నా కుమారుడు’ అని సంబోధించాడు (1 పేతురు 5:13). క్రీస్తు గెత్సమని తోటలో నున్నప్పుడు ప్రత్యక్షసాక్షి (14:50-52). పౌలు సహచరుడు (కొలొస్సీ 4:10; 2 తిమో. 4:11), పేతురు సహచరుడు.

కాలము: క్రీ.శ. 55-65.

రచయిత:  పేతురు శిష్యుడుగా మార్కు క్రీస్తు సువార్తకు సంబంధించి అనేక విషయాలను సేకరించాడు. మార్కు క్రీస్తు సువార్తను రోము నగరంలో, రోమీయుల నుద్దేశించి రాశాడు.

చారిత్రక నేపథ్యము: మార్కు రాసిన క్రీస్తు సువార్త ఇతర సువార్త రచనలకు ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. క్రీస్తు కాలం నాటి పాలస్తీనా పరిస్థితులను తెలుసుకోడానికి ఈ గ్రంథం దోహదపడుతుంది. మార్కు క్రీస్తు సువార్త రాసిన నాటికి క్రైస్తవ మతం యెరూషలేము నుండి రోము నగరానికి వ్యాప్తిచెందింది.

ముఖ్యాంశములు: క్రీస్తు ఆహ్వానానికి మన స్పందన ఎలా వుండాలో చూపించాడు (1:14-15). నాటి గ్రీకు హేతువాదులు క్రీస్తు గురించి చేసిన విమర్శలకు సమాధానంగా మార్కు సువార్తలో వాదోపవాదాలు కనపడతాయి (2:7; 2:20; 3:6,21,30; 6:3; 14:60-64).  క్రీస్తు సువార్త ప్రబోధం దేవుని రాజ్యస్థాపనతో ముడిపడి వుంది (4:1-34). భవిష్యత్తును గూర్చి చర్చిస్తుంది (9:1). మనుష్యకుమారుని రెండవ రాకడ ప్రస్తావన వుంది (13:26-27). క్రీస్తు పూర్వ నిబంధన ప్రవచనాలను నెరవేర్చాడు (1:14; యెషయా 52:7; 61:1). క్రీస్తు శాస్త్రాన్ని స్పష్టంగా చిత్రించడం జరిగింది.

క్రీస్తు చిత్రీకరణ: సర్వమానవాళి ఆధ్యాత్మిక, భౌతిక అవసరాలను నిత్యం పరిపూర్తి చేసే దేవుని సేవకుడుగా మార్కు క్రీస్తును చిత్రించాడు. మానవ రక్షణ, దేవుని రాజ్య అవతరణ వెనువెంటనే సంభవిస్తాయి. సువార్తలో దర్శనమిచ్చే క్రీస్తు వర్ణనలు ఏవనగా:  క్రీస్తు దేవుని కుమారుడు (1:1; 15:39). యూదులు నిరీక్షించిన మెస్సయ క్రీస్తు. (1:1; 8:29; 14:61; 15:32). క్రీస్తు మనుష్య కుమారుడు (2:10, 28; 8:31); బోధకుడు (9:5; 10:51; 14:45); రాజు (15:2,9,12,18,26,32); పెండ్లి కుమారుడు (2:19); ప్రవక్త (6:4,15; 8:28); దావీదు కుమారుడు (10:47-48); రాబోయే వాడు (11:9); గొఱ్ఱెల కాపరి (14:27); దేవుని పవిత్రుడు (1:24).