శిష్యులకు ఆహ్వానము

(మత్తయి 4:18-22; మార్కు 1:16-20)

5 1. యేసు ఒక పర్యాయము గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయనయొద్దకు నెట్టు కొనుచు వచ్చిరి.

2. ఆయన అచట రెండు పడవలను చూచెను. జాలరులు వానినుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి.

3. అందులోఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డుననుండి లోనికి త్రోయుమని, అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను.

4. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో ”మీరు పడవను ఇంకను లోతునకు తీసికొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు” అనెను 5. అందుకు సీమోను ”బోధకుడా! మేము రాత్రి అంతయు శ్రమించితిమి. కాని ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము” అని ప్రత్యుత్తరము ఇచ్చెను.

6. వల వేయగనే, వల చినుగు నన్ని చేపలు పడెను.

7. అంతట జాలరులు రెండవ పడవలోనున్న తమ తోటివారికి, వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా, వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండెను.

8. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి ”ప్రభూ! నేను పాపాత్ముడను. నన్ను విడిచిపొండు” అని పలికెను.

9. ఇన్ని చేపలుపడుట చూచి సీమోను, అతని తోటివారు ఆశ్చర్యపడిరి.

10. సీమోనుతో ఉన్న జెబదాయి కుమారులు యాకోబు, యోహానులును అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అపుడు సీమోనుతో”భయపడవలదు.ఇక నుండి నీవు మనుష్యు లను పట్టువాడవై ఉందువు” అనెను.

11. ఆ జాలరులు పడవలను ఒడ్డునకుచేర్చి తమ సమస్తమును విడిచి పెట్టియేసును అనుసరించిరి.

కుష్ఠ రోగికి స్వస్థత

(మత్తయి 8:1-4; మార్కు 1:40-45)

12. యేసు ఒకానొక పట్టణమున ఉండగా కుష్ఠ రోగి ఒకడు ఆయనయొద్దకు వచ్చి సాగిలపడి, ”ప్రభూ! తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు” అని ప్రార్థించెను.

13. యేసు తన చేయి చాపి, అతనిని తాకి, ”అది నాకు ఇష్టమే. నీవు స్వస్థుడవు కమ్ము” అని పలికెను. వెంటనే అతని కుష్ఠముపోయి స్వస్థత కలిగెను.

14. యేసు అపుడు ”ఎవరితోను నీవు ఈ విషయమును చెప్పరాదు” అని ఆజ్ఞాపించి ”నీవు వెళ్ళి యాజకునకు కనిపింపుము. నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపుము” అని వానిని పంపివేసెను.

15. అయినను ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. ఆయన ఉపదేశములను వినుటకు, రోగవిముక్తులగుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి.

16. కాని యేసు నిర్జనస్థలములకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసికొనెను.

పక్షవాత రోగికి స్వస్థత

(మత్తయి 9:1-8; మార్కు 2:1-12)

17. ఒకనాడు ఆయన బోధించుచుండగా యెరూషలేము, గలిలీయ, యూదయాలోనిగ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులును, ధర్మశాస్త్ర బోధకులును ఆయన ఎదుట కూర్చుండియుండిరి. స్వస్థతనిచ్చు ప్రభుశక్తి ఆయనయందుండెను.

18. అపుడు కొందరు పక్షవాత రోగినొకనిని పడకపై మోసికొని వచ్చి, ఇంటిలోపల బోధించుచున్న ఆయనచెంతకు చేర్చ ప్రయత్నించిరి.

19. ఆ ఇల్లు జనసమూహముచే క్రిక్కిరిసిఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అపుడు వారు ఇంటిపైకి ఎక్కి,కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయనముందట దించిరి.

20. యేసు వారి విశ్వాసమును చూచి, ”ఓయీ! నీ పాపములు క్షమింపబడినవి” అని అతనితో చెప్పెను.

21. అందుకు పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు ”దైవ దూషణములు పలికెడి ఇతడెవరు? దేవుడుతప్ప మరెవ్వరు పాపములు క్షమింపగలరు?” అని లోలోన తర్కించుకొనసాగిరి.  

22. యేసు వారి ఆలోచనలను గ్రహించి ”మీ హృదయములలో ఏల తర్కించుకొనెదరు?

23. ఏది సులభతరము? నీ పాపములు క్షమింపబడినవి అనుటయా? లేక లేచి నడువుము అనుటయా?

24. కాని, భూలోక మున మనుష్యకుమారునకు పాపములు క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును” అని చెప్పి, పక్షవాత రోగితో ”నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నాను” అని పలికెను.

25. ఆ పక్ష వాత రోగి తక్షణమే లేచి, పడకను తీసికొని దేవుని స్తుతించుచు తనఇంటికి వెళ్ళెను.

26. వారందరు ఆశ్చర్యచకితులై భయపడుచు ”నేడు మనమెట్టివింతలను చూచితిమి” అని దేవుని పొగడిరి.

సుంకరికి శిష్యస్థానము

(మత్తయి 9:9-13; మార్కు 2:13-17)

27. అటుపిమ్మట యేసు అచటనుండి వెడలి సుంకపు మెట్టు కడ కూర్చుండియున్న ‘లేవి’ అను సుంకరిని చూచి, అతనితో ”నన్ను అనుసరింపుము” అనెను.

28. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను.

29. లేవి తనఇంట ఆయనకుగొప్పవిందుచేసెను. అనేకమంది సుంకరులు,  ఇతరులు ఆయనతోకలిసి విందులో పాల్గొనిరి.      

30. అపుడు పరిసయ్యులును, వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులును, సణగుకొనుచు ”సుంకరులతోను, పాపులతోను, మీరేల తిని త్రాగుచున్నారు?” అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి.

31. అపుడు యేసు ”వ్యాధిగ్రస్తులకే కాని, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదుగదా!

32. హృదయపరివర్తనము పొందుటకై పాపులను పిలువ వచ్చితినికాని, నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు” అని సమాధానమిచ్చెను.

ఉపవాస సమస్య

(మత్తయి 9:14-17; మార్కు 2:18-22)

33. ”యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్థనలు చేసెదరు. అటులే పరిసయ్యుల శిష్యులును చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేల?” అని  కొందరు యేసును ప్రశ్నించిరి.

34. అందుకు యేసు ”పెండ్లి కుమారుడు ఉన్నంతవరకు విందునకు వెళ్ళినవారు ఉపవాసము చేయుదురా? పెండ్లి కుమారుడు తమవెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారిచేత ఉపవాసము చేయింపగలరా?

35. పెండ్లి కుమారుడు వారిని ఎడబాయు కాలము వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు” అని వారితో పలికెను.

36. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పెను: ”ప్రాతగుడ్డకు మాసికవేయుటకు క్రొత్తగుడ్డను ఎవరు చింపుదురు? అట్లు చేసిన యెడల క్రొత్తగుడ్డ చినిగి పోవుటయేకాక, అది ప్రాతగుడ్డకు అతుకు పడదు.

37. అట్లే కొత్త ద్రాక్షరసమును ప్రాతతిత్తులలో ఎవరును పోయరు. అటుల పోసినయెడల ఆ ప్రాత తిత్తులు పిగులును, ఆ రసము నేలపాలగును, తిత్తులు నశించిపోవును. 38. కనుక, క్రొత్త రసమును క్రొత్తతిత్తులలోనే ఉంచవలయును.

39. ప్రాత రసమునకు అల వడినవాడు క్రొత్తరసమును తాగుటకు ఇష్టపడడు. అతడు ప్రాతరసమే మేలు అనును.”