ప్రవక్త యెరూషలేము ముట్టడిని

నటించి చూపించుట

4 1. ప్రభువు ఇట్లనెను. ”నరపుత్రుడా! నీవు ఒక ఇటుకను కొనివచ్చి దానిని నీ ముందట ఉంచు కొనుము. దానిపై యెరూషలేము చిత్రమును గీయుము.

2. నగరము ముట్టడిని సూచించుటకుగాను దాని చుట్టును అగడ్తలను త్రవ్వునట్లును, కట్టలు పోయు నట్లును, శిబిరములు పన్నునట్లును, బురుజులు నిర్మించునట్లును, గోడలను కూలద్రోయు యంత్రము లను అమర్చినట్లును నీవు వ్రాయుము.

3. ఇనుప రేకును తీసికొని నీకును, నగరమునకును మధ్య గోడగా నిలబెట్టుము. నీవు నగరమువైపునకు మళ్ళుము. అది ముట్టడికి గురియగుచున్నది. ముట్టడించువాడవు నీవే. ఇదంతయు యిస్రాయేలీయులకు సూచనముగా నుండును.

4. అటుపిమ్మట నీవు ఎడమప్రక్కకు మళ్ళి పడుకొనుము. నేను యిస్రాయేలువారి దోషములను నీపై మోపుదును. నీవు ఎడమప్రక్కన పండుకొని యున్నన్నినాళ్ళును వారి దోషములను భరింతువు.

5. వారి దోషసంవత్సరములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దినము చొప్పున, నీవు మూడువందల తొంబది దిన ములు వారి దోషములను భరింపవలెను.

6. అటు తరువాత నీవు కుడిప్రక్కకు మళ్ళి పడుకొని యూదా వారి దోషములను నలుబది దినములు భరింపుము. ఒక్కొక్కదినము వారి దోష సంవత్సరములలో ఒక్కొక్క దానిని సూచించును.

7. నీవు యెరూషలేము ముట్టడివైపు మొగము త్రిప్పుము. నీ చేతిపై చొక్కాయని వెనుకకుతీసి, దాని వైపు నీ బాహువును ఎత్తి దానిగురించి ప్రవచింపుము.

8. నేను నిన్ను త్రాళ్ళతో బంధించియుంతును. కనుక ముట్టడి ముగియువరకును నీవు ఒక ప్రక్కనుండి మరియొక ప్రక్కకు కదలజాలవు.

9. నీవు గోధుమలు, యవలు, చిక్కుడు గింజలు, పప్పులు, జొన్నలు తీసికొని వానినన్నిని కలిపి రొట్టెలుచేసికొనుము. నీవు ఎడమప్రక్కన పడుకొనియున్న మూడు వందల తొంబది దినములును వానినే భుజింపవలెను.

10. నీవు దినమునకు ఇరువదితులముల రొట్టెను మాత్రమే తినవచ్చును.

11.  ఆ రీతినే రోజునకు రెండు ముంతల నీళ్ళు మాత్రమే త్రాగవచ్చును.

12. నీవు మనుష్య మలముతో మంటజేసి రొట్టెలను కాల్చుకొనుము. ఎల్లరును చూచుచుండగా  వానిని భుజింపుము.

13. నేను యిస్రాయేలీయులను అన్యజాతులమధ్య చెల్లా చెదరుచేసినప్పుడు, వారు ఈ రీతిగనే నిషిద్ధాహారమును భుజింతురని ప్రభుడనైన నా మాటలుగా చెప్పుము.

14. అందులకు నేను ”యావే ప్రభూ! నేనెన్నడును మైలపడ లేదు. బాల్యమునుండియు నేనెన్నడును సహజముగా చచ్చిన జంతువునుగాని, వన్యమృగములు చంపిన జంతువునుగాని భుజింపలేదు. నేను అశుద్ధాహారమును ఎన్నడును ఆరగింపలేదు” అని అంిని.

15. ప్రభువు ”సరే, మనుష్యమలమునకు బదులుగా ఆవుపేడను వాడుకొని రొట్టెలు కాల్చుకొమ్ము” అని చెప్పెను. 16. ప్రభువు ఇంకను ”నరపుత్రుడా! నేను యెరుషలేమున రొట్టెలు దొరకకుండునట్లు చేయుదును. ఆ నగర వాసులు విచారముతో ఆహారమును తూచితిందురు. భయముతో నీళ్ళు కొలిచిత్రాగుదురు.

17. రొట్టెలును, నీళ్ళును తరిగిపోవుటచూచి వారు నిరాశచెందుదురు. తమ పాపములకు గాను కృశించిపోవుదురు” అనెను.