అననియా, సఫీర

5 1. అక్కడ అననియా అను పేరుగలవాడు ఒకడు గలడు. అతని భార్య పేరు సఫీర. అతడు తమకు చెందిన ఆస్తిని అమ్మెను.

2. తరువాత అతడు తన భార్యతో కూడబలుకుకొని ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంతభాగమును దాచుకొని మిగిలిన పైకమును మాత్రమే అపోస్తలుల పాదములచెంత అర్పించెను.

3. అప్పుడు పేతురు వానితో, ”అననియా! నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకొని పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును ఏల సైతానుకు స్వాధీనపరచితివి?

4. నీవు ఆస్తిని అమ్మక పూర్వము అది నీ సొంతమే గదా! అమ్మిన పిమ్మట వచ్చిన పైకమును నీ అధీనమే గదా! మరి నీవు నీ హృదయమున ఇట్లుచేయ నిర్ణ యించితివేల? నీవు మనుష్యులతో కాదు, దేవునితో అబద్ధమాడియున్నావు” అని పలుకగా, 5. ఇది విన్న అననియా నేలకూలి ప్రాణములు విడిచెను. దీనిని గూర్చి విన్నవారందరు భయముతో నిండిపోయిరి.

6. అంతట యువకులు లోనికివచ్చి, వాని శరీరమును వస్త్రముతో చ్టుట్టివేసి, బయటకు తీసికొనిపోయి సమాధి చేసిరి.

7. రమారమి   మూడుగంటల   సమయము గడిచిన పిదప అతని భార్యలోనికి వచ్చెను. జరిగిన సంగతి ఆమెకు తెలియదు.

8. అప్పుడు పేతురు ”మీరు ఆ భూమిని ఇంత వెలకే అమ్మితిరా? చెప్పుము” అని ఆమెను ప్రశ్నింపగా ఆమె ”అవును, ఇంత వెలకే” అని ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట పేతురు, 9. ”నీవును, నీ భర్తయు ప్రభువుఆత్మను పరీక్షింప పూనుకొ కొంటిరా? నీ భర్తను సమాధిచేసి వచ్చిన మనుష్యులు గుమ్మము వద్దనే ఉన్నారు. నిన్నుకూడ వారు బయటకు మోసికొనిపోవుదురు” అని ఆమెతో పలికిన వెంటనే, 10. ఆమె అతని పాదములముందు పడి మరణించెను. కనుక యువకులు లోనికివచ్చి ఆమె చనిపోయి ఉండుట చూచి ఆమెను మోసికొనిపోయి ఆమె భర్త ప్రక్కనే సమాధిచేసిరి.

11. సంఘమంతయు, దీనిని గూర్చి విన్నవారందరును మహాభయముతో నిండి పోయిరి.  

అద్భుతములు, ఆశ్చర్యకార్యములు

12. ప్రజలమధ్య అపోస్తలులు అనేకమైన అద్భుతములు, సూచకక్రియలు చేయుచుండిరి. వారందరు ఏకమనస్కులై సొలోమోను మంటపములో చేరిరి.

13. వారితో చేరుటకు మరెవ్వరును సాహసించ లేదు. అయితే ప్రజలు వారినిగూర్చి గొప్పగా చెప్పు కొనిరి.

14. పురుషులును, స్త్రీలును అనేకులు మరి ఎక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేరిరి.

15. పేతురు నడచిపోవునపుడు కనీసము అతని నీడ అయినను కొందరిపై పడగలదను ఆశచేత వారు జబ్బుగా ఉన్నవారిని చాపల మీదను, పరుపుల మీదను పెట్టుకొని, మోసికొనివచ్చి వీధులలో ఉంచిరి.

16. మరియు యెరూషలేము చుట్టుపట్టులనున్న పట్టణ ములనుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యము ప్టిన వారిని తీసికొని వచ్చుచుండిరి. అటుల తీసికొని రాబడిన వారందరును స్వస్థతపొందిరి.

అపోస్తలులు – హింసలు

17. అప్పుడు ప్రధానార్చకుడు అతనితో ఉన్న వారందరును అనగా సద్దూకయ్యులవర్గము వారును లేచి అపోస్తలులపై అసూయపడి వారిపై చర్య తీసికొన వలెనని నిశ్చయించిరి.

18. అందుచేత వారు అపోస్తలులను బంధించి పట్టణపు చెరసాలలో వేయించిరి.

19. కాగా ఆ రాత్రియందే ప్రభువుదూత ఆ చెరసాల తలుపులను తెరచి అపోస్తలులను బయటకు నడిపించు కొనిపోయి వారితో, 20. ”మీరు దేవాలయములో నిలువబడి ఈ నూతనజీవమును గూర్చినదంతయు ప్రజలకు తెలియచెప్పుడు”అనెను.

21. అది విన్న అపోస్తలులు పోయి తెల్లవారునప్పటికి దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి. అంతట ప్రధానార్చ కుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని, యూదుల పెద్దలనందరిని సమావేశపరచిరి. పిమ్మట అపోస్తలులను వారియొదుటకు తీసికొని రావలెనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి.

22. కాని అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తలులు కనబడకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి, 23. ”మేము చెరసాల వద్దకుపోయి చూడగా దానికి తాళము బిగింపబడియుండెను. ద్వారములవద్ద కావలివారు కాపలా కాయుచుండిరి. మేము చెరసాల తలుపులు తెరచి లోనికిపోయి చూచితిమికాని, లోపల మాకు ఎవరును కనిపింప లేదు” అని తెలియజేసిరి.

 24. దేవాలయపు అధిపతి, ప్రధానార్చకులు దీనిని విని విస్మయముచెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి. 25. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, ”మీరు చెరసాలలో వేసినవారు దేవాలయములో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు” అని వారితో చెప్పెను.

26. అది విని, అధికారి తన పరివారముతో అక్కడకు వెళ్ళి అపోస్తలులను మరల తీసికొనివచ్చెను. ప్రజలు రాళ్ళతో కొట్టుదురేమో అని భయపడి వారు అపోస్తలులకు ఏమాత్రము హింస తలపెట్టలేదు.

27. వారు అపోస్తలులను లోనికి తీసికొనివచ్చి విచారణసభ ఎదుట నిలువబ్టెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, 28. ”మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమునందంతటను మీ బోధనలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు” అని వారితో పలికెను.

29. అందుకు పేతురు, తదితర అపోస్తలులు వారితో, ”మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను.

30. మీరు యేసును మ్రానుపై వ్రేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతులనుండి లేపెను.

31. యిస్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును, వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగ, రక్షకునిగ చేసి తన కుడిప్రక్కన కూర్చుండ బెట్టుకొనెను.

32. దేవుడు తనపట్ల విధేయత చూపువారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును, మేమును ఈ జరిగిన సంఘటన లకు సాకక్షులము” అని బదులు పలికిరి.

33. విచారణసభలోని సభ్యులు ఇది విని, మండిపడి, అపోస్తలులను చంపదలచిరి.

34. అప్పుడు వారిలో ఒకడు, ధర్మశాస్త్ర బోధకుడును, ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడువాడును, గమాలియేలు అను పేరుగల ఒక పరిసయ్యుడు, ఆ సభలో నిలువబడి అపోస్తలులను కొంతసేపు బయటకు తీసికొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణసభను ఉద్దేశించి, 35. ”యిస్రాయేలు ప్రజలారా! మీరు వీరికి చేయబోవు దానినిగురించి జాగ్రత్తగా మెలగుడు.

36. కొంతకాలము క్రిందట ‘తెయోదాస్‌’ అనువాడు కనబడి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొనియుండెను. అది విని రమారమి నాలుగు వందలమంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా, వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. అంతటితో అతని ప్రయత్నము నశించెను.

37. ఇది జరిగిన తరువాత జనాభాలెక్కల కాలములో ‘యూదా’ అను పేరుగల గలిలీయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడునూ చంపబడగా, వాని శిష్యులు చెల్లాచెదరై పోయిరి.

38. కాబట్టి ఇప్పుడు ఈ విషయములో ఈ మనుష్యులను గురించి వ్యతిరేకముగా ఏ చర్యయు తీసికోరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదలివేయుడు. ఏలయన, వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో, అది అంతరించి పోవును.

39. అది దైవప్రయత్నమైనచో, వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతియేకాక, అది దేవునికి వ్యతిరేకమైన పోరాటము కాగలదు” అని చెప్పగా, ఆ న్యాయసభ గమాలియేలు సలహాను పాటించెను.           

40. పిమ్మట వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి, మరల యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదలివేసిరి.

41. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యుల మైతిమి అనివారు సంతోషముతో ఆ విచారణసభ నుండి వెడలిపోయిరి.

42. ప్రతిరోజు వారు దేవాలయములోను, ప్రజల ఇండ్లలోను ప్రబోధించుచు మెస్సయాయైన  యేసును  ప్రకటించుట మానలేదు.