దేవుడే తన ప్రజకు ఆశ్రయము, బలము

ప్రధానగాయకునికి కోర కుమారులు రచించిన అలమోత్‌ అను రాగముమీద పాడదగిన గీతము

46 1.      ప్రభువే మనకు

                              ఆశ్రయము, బలమునైనవాడు

                              ఆపదలలో అతడు మనలను

                              ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును.

2.           కనుక భూమి కంపించినను,

               పర్వతములు సాగరగర్భమున కూలినను,

3.           సాగరజలములు రేగి ఘోషించి

               నురగలు క్రక్కినను, సముద్రజలములు పొంగి

               కొండలు చలించినను

               మనము భయపడనక్కరలేదు.

4.           మహోన్నతుని పవిత్ర మందిరమును

               దేవుని నగరమును, తన పాయలతో

               ఆనందమున ఓలలాడించు నది ఒకి కలదు.

5.           దేవుడా పట్టణమున వసించును గనుక

               అది నాశనము కాదు.

               వేకువ జాముననే అతడు పురము నాదుకొనును.

6.           అన్యజాతులు ఆర్భాటము చేసిరి,

               రాజ్యములు చలించెను.

               కాని ప్రభువు సింహనాదము చేయగా

               భూమి ద్రవించెను.

7.            సైన్యములకు అధిపతియైన ప్రభువు

               మనకు అండగానున్నాడు.             

               యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా నున్నాడు.

8.           రండు, ప్రభువు కృత్యములను కనుడు.

               భూమి మీద ఆయన చేసిన

               మహాకార్యములను వీక్షింపుడు.

9.           ఆయన నేల నాలుగు చెరగుల

               పోరులు రూపుమాపును.

               విల్లులను విరిచివేసి

               బల్లెములను విరుగగొట్టును.

               రథములను తగులబెట్టును.

10.         ”మీరు నిశ్చలముగానుండి,

               నేను దేవుడనని తెలిసికొనుడు.

               సకల జాతులలోను సర్వభూమి మీదను

               నేనే సార్వభౌముడను”

               అని అతడు వచించుచున్నాడు.

11.           సైన్యములకు అధిపతియైన ప్రభువు

               మనకు అండగా నుండును.

               యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగానుండును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము