అంత్య దినములు

3 1. అంత్య దినములలో కష్టసమయములు వచ్చునని తెలిసికొనుము.

2. ప్రజలు స్వార్థపరులును, ధనాపేక్ష కలవారును, గర్విష్ఠులును, అహంకారులును అగుదురు. వారు పరులను అవమానింతురు. తల్లిదండ్రులను ధిక్కరింతురు. కృతఘ్నులును, అపవిత్రులును అగుదురు.

3.వారు కృపారహితులును, దయాహీనులును, పరులను దూషించువారును, క్రూరులును, దౌర్జన్యమొనర్చు వారును కాగలరు. సజ్జనులను వారు ద్వేషింతురు.

4. వారు మోస గాండ్రును, నిర్లక్ష్యస్వభావులును, గర్వముచే ఉబ్బిపోయిన వారునై ఉందురు. వారు దేవునికంటె శరీర సౌఖ్యములనే  ఎక్కువగ ప్రేమింతురు.

5. మతము యొక్క కేవల బాహ్యరూపమును మాత్రమే అంగీకరించి, వారు దాని యథార్థ ప్రభావమును తిరస్కరింతురు. ఇట్టి వారికి దూరముగ ఉండుము.

6. వారిలో కొందరు గృహములందు ప్రవేశించి, పలు రకములైన వ్యామోహములచే ప్రేరేపింపబడుచు, తమ పాపభారముచే క్రుంగిపోవు బలహీనురాండ్రగు స్త్రీలను వశపరచుకొందురు.

7. అట్టి స్త్రీలు నేర్చుకొనవలెనని సర్వదా ప్రయత్నించుచున్నప్పటికిని సత్యమును ఎన్నటికి తెలిసికొనలేరు.

8. యన్నే, యంబ్రేలు మోషేను ఎదిరించినట్లే, విశ్వాసభ్రష్టులును, బుద్ధిహీనులును అగు ఈ మనుజులు సత్యమును ఎదిరించుచున్నారు.

9. యన్నే, యంబ్రేల విషయములో జరిగినట్లే వారు ఎంత మూఢులో అందరును గ్రహింతురు. కనుక వారు ఎక్కువగ పురోగమింపజాలరు.

తుది ఉత్తరువులు

10. కాని నీవు నా బోధనను, నా ప్రవర్తనను, నా జీవితధ్యేయమును గమనించితివి. నా విశ్వాసమును, నా సహనమును, నా ప్రేమను, నా ఓపికను, 11. నా బాధలను, నా శ్రమలను తెలిసికొంటివి. అంతియోకు, ఇకోనియ, లిస్త్రాలలో  నాకేమి  సంభవించెనో నీవు ఎరుగుదువు. నేను సహించిన దారుణములగు హింసలు నీకు తెలియును, కాని ప్రభువు వానిని అన్నింటినుండి నన్ను రక్షించెను.

12. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవితమును గడపదలచినవారు అందరును హింసింపబడుదురు.

13. దుర్జనులును, వంచకులును ఇతరులను మోసగించుచు, ఆత్మవంచన మొనర్చుకొనుచు నానాటికి మరింత దుష్టుల గుదురు.

14. నీవు మాత్రము నీకు బోధింపబడిన వియు, నీవు దృఢముగా విశ్వసించునవియు అగు సత్యములయందే సాగిపొమ్ము. నీవు ఎవరినుండి నేర్చుకున్నావో నీకు తెలియును.

15. బాల్యమునుండి నీవు పవిత్రలేఖనములను ఎరిగియుంటివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తుయేసునందు విశ్వాసముద్వారారక్షణకు చేర్చును.

16-17. దైవజనుడు ఎట్టి సత్కార్యమునకైనను సంపూర్తిగ సిద్ధపడి యుండునట్లు దైవప్రేరణ వలననే కలిగిన పవిత్ర గ్రంథమంతయు బోధించుటకును, దోషమును ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకును, నీతియందు నడిపించుటకును తోడ్పడును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము