ఇద్దరు సాకక్షులు

11 1. అంతట నాకు ఒక చేతికఱ్ఱ వంటికొలత బద్ద ఇయ్యబడెను. పిమ్మట నాకు ఇట్లు చెప్పబడినది. ”లేచి, దేవాలయమునకును, బలిపీఠమునకును కొలతలు తీసికొనుము. దేవాలయములో ఎందరు ఆరాధించుచున్నారో లెక్కింపుము.

2. కానిదేవాలయ బాహ్య ప్రాంగణములను కొలతవేయక విడిచిపెట్టుము. అది జాతులకు ఈయబడినవి. వారు పవిత్ర నగరమును నలువదిరెండు నెలలపాటు తమ కాళ్ళతో మట్టగింతురు.

3. నేను నా ఇద్దరు సాకక్షులను పంపెదను. వారు గోనెపట్టలను ధరించి ఈ పండ్రెండు వందల అరువది దినములవరకు ప్రవచించెదరు.

4. ఈ రెండు ఓలీవు చెట్లే ఆ సాకక్షులు: భువికి నాథుడగు వాని ఎదుట నిలుచు దీపములు.

5. వానికి ఎవరైన హాని కలిగింపనెంచినచో వాని నోళ్ళనుండి అగ్నిజ్వాలలు పుట్టి అట్టి శత్రువులను పరిమార్చును. ఈ విధముగ వానికి హాని కలిగింపనెంచువారు అందరును నశింతురు.

6. వారు ప్రవచించునంత కాలమును భువిపై వానలు లేకుండును. అట్లు ఆకాశమును మూసివేయు అధికారము వారికి ఉన్నది. నీటి ఊటలపై కూడ వారికి అధికారము ఉన్నది. ఆ నీటి ఊటలను రక్త ప్రవాహములుగ వారు మార్చగలరు. వారి ఇష్టప్రకారము ఎన్ని మారులైనను, ఏ విధములైన జాడ్యములతోనైనను భువిని బాధించు అధికారము కూడవారికి ఉన్నది.

7. వారు సాక్ష్యము చెప్పుట ముగించిన తరువాత అగాధమునుండి వెలువడిన మృగము వారితో పోరాడును. అది వారిని ఓడించిచంపును.

8. ఆ మహానగరముననే, ప్రభువు సిలువవేయబడిన ఆ వీధియందే వారి దేహములు పడియుండును. ఆ నగరమునకు సాంకేతికనామము సొదొమ మరియు ఐగుప్తు.

9. అన్ని జాతులకును, అన్ని తెగలకును, అన్ని భాషలకును,అన్ని దేశములకును చెందిన ప్రజలు మూడున్నర రోజులపాటు వారి దేహములను దర్శించుచు వానిని సమాధిలో భూస్థాపన మొనర్పనీయరు.

10. ఈ ఇరువురి మరణమును గూర్చి భువియందలి ప్రజలు సంతోషింతురు. వారు పండుగ చేసికొందురు. ఒకరికి ఒకరు బహుమానములను పంపుకొందురు. ఏలయన, ఈ ఇరువురు ప్రవక్తలు భువియందలి ప్రజలకుపెక్కు కష్టములను తీసికొని వచ్చిరిగదా!

11. కాని మూడున్నర దినముల తరువాత దేవునినుండి జీవాత్మ వెలువడి వారి దేహములయందు ప్రవేశించెను. వారు లేచి నిలబడిరి. వారిని చూచిన వారందరును మిగుల భయమునొందిరి.

12. అప్పుడు ఆ ఇరువురు ప్రవక్తలును దివినుండి తమతో సంభాషించుచున్న ఒక గంభీర స్వరమును వినిరి. ”మీరు ఇటకు రండు” అని ఆ స్వరము వారితో పలికెను. వారి శత్రువులు చూచు చుండగనే వారు మేఘమండలము ద్వారా దివిని చేరిరి.

13. ఆ క్షణముననే ఒక భయంకర భూకంపము సంభ వించెను. నగరములో పదియవపాలు నాశనమాయెను. ఆ భూకంపమున మొత్తము ఏడువేల మంది జనులు మరణించిరి. మిగిలిన ప్రజలు భయకంపితులై దివియందలి దేవుని మహిమనుస్తుతించిరి.

14. రెండవ అనర్థము గతించిపోయినది. కాని గమనింపుడు! మూడవ అనర్థము ఆసన్నమైనది.

ఏడవ బాకా

15. అంతట ఏడవ దేవదూత తన బాకాను ఊదెను. తోడనే దివినుండి పెద్దధ్వనులు విననయ్యెను. ”ప్రపంచమును పాలించు అధికారము ఇపుడు మన ప్రభువుది, మెస్సియాది. ఆయన పాలన సదాకొనసాగునుగాక!” అని ఆ స్వరము పలికెను.

16. అంతట దేవునిఎదుట తమ సింహాసనములపై కూర్చుండి యుండెడి ఇరువది నలుగురు పెద్దలు దేవునిఎదుట సాష్టాంగపడి ఆయనను ఆరాధించిరి.

17.          వారు ఇట్లు పలికిరి.

               ”భూత వర్తమానములలో ఉండువాడవును,

               సర్వశక్తిమంతుడవును అగు దేవా!

               ఓ ప్రభూ! నీ మహాశక్తిని ఉపయోగించి

               పరిపాలించుట ప్రారంభించితివి

               నీకు మేము కృతజ్ఞులము!

18.          అన్యజాతులకు క్రోధము ఎక్కువ కాగా

               నీ ఆగ్రహము ప్రదర్శితమాయెను:

               ఏలన, మృతులకు

               తీర్పు చెప్పుదినము సమీపించినది.

               నీ సేవకులగు

               ప్రవక్తలకును, పరిశుద్ధులకును

               నిన్నుచూచి భయమునొందు

               అధికులకు అల్పులకు బహుమానములు

               ఈయదగిన సమయము ఆసన్నమైనది.

               భువికి వినాశకులైనవారిని ధ్వంస

               మొనర్పవలసిన సమయమిదియే!”

19. దివియందలి దేవుని ఆలయము తెరువబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యెను. అంతలో మెరుపులును, గర్జనలును, ఉరుములును,భూకంపములును,  వడగండ్లవానలును ప్రారంభమయ్యెను.