ఉపోద్ఘాతము:
పేరు:క్రీస్తు మరణానంతరం శ్రీసభకు మూలస్తంభాలుగా నిలిచిన ప్రథములలో పేతురు ముఖ్యుడు. పేతురు సిమోనుగా, బెస్తవాడుగా (లూకా 5:2), యోహాను పుత్రుడుగా (యోహాను 1:42; 21:15-17), అంద్రెయ సోదరుడుగా, బెత్సయిదా గ్రామస్తుడుగా (యోహాను 1:43), వివాహితుడుగా (మార్కు 1:29-31), సొంత ఇల్లు ఉన్నవాడుగా కన్పిస్తాడు. ఇతని పేరు గ్రీకు భాష ఆధారంగా పేతురు, అరమయి భాష ఆధారంగా కేఫా (రాయి).
కాలము:క్రీ.శ. 64-67.
రచయిత: పేతురు.
చారిత్రక నేపథ్యము: ఆసియా మైనరు (గలతి, కప్పదొకియ, బితునియ) ప్రాంతాలలోని కొందరు ప్రజలు గ్రీకు జీవన విధానానికి అలవాటు పడ్డారు. మరికొందరు తూర్పు దేశస్థుల జీవన విధానానికి దగ్గరయ్యారు. ఆది క్రైస్తవ సంఘాలలో పేతురు పెద్దనాయకుడుగా పేరు పొందాడు (అ.కా. 2:14; 9:32-12:19; 15:3-21). వివిధప్రాంతాలలో చెల్లాచెదరైపోయిన విశ్వాసులను ఉద్దేశించి ఈ లేఖను రాశాడు.
ముఖ్యాంశములు: పేతురు తన మొదటి లేఖ ద్వారా తెలిపిన ప్రధానాంశాలు: క్రీస్తు ద్వారా దేవుడు నూతన ప్రజను ఏర్పరచుకున్నాడు (1:3-24; 3:4-12). ఈ నూతన ప్రజ పవిత్రంగా జీవనం కొనసాగించాలి (1:13-2:17; 3:1-7; 4:1-11; 5:1-11). పాలకులు, నాయకులకు చూపించే విధేయత కన్నా(2:13-17) దేవునికి విధేయత చూపడం ముఖ్యం (3:15-17). ఇందు నిమిత్తం శ్రమలకైనా సిద్ధపడాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి (4:1-4). బప్తిస్మం పొందిన వారు రక్షణ పొంది నూతన జీవితంలో ఉంటారు (3:21-22).
క్రీస్తు చిత్రీకరణ:పేతురు మొదటి లేఖలో క్రీస్తును అనుసరణీయుడుగా చిత్రిస్తాడు. క్రీస్తు మన కొరకు పొందిన శ్రమలు ముఖ్య ఉదాహరణగా వుంటుంది. వ్యతిరేకతలు, సవాళ్లు ఎదుర్కొని ఈ లోకంలో క్రైస్తవులు క్రీస్తు నిరీక్షణ దారులుగా, విశ్వాసులుగా వుండాలని పేతురు సూచిస్తాడు (1:3,4). క్రీసుకు, విశ్వాసికి మధ్యగల ప్రేమ, బాంధవ్యము క్రీస్తు ఆశ్రయంగా నిలుస్తుంది (1:8).క్రైస్తవులు పాపము విషయంలో చనిపోయి నీతిలో జీవించాల్సిన బాధ్యతను గుర్తుచేశాడు (2:24; 3:18). క్రీస్తు విశ్వాసుల ఆశయం, వారసత్వ సంపద (1:3-4). క్రీస్తు ప్రధాన కాపరి (2:25; 5:4).