12 1. ఎఫ్రాయీమీయులు

               రోజంతా చేయుకార్యములు నిరుపయోగములు,

               వినాశకరములు. వారియందు మోసము,

               హింస పెచ్చుపెరుగుచున్నది.

               వారు అస్సిరియాతో ఒడంబడికలు చేసికొందురు.

               ఐగుప్తునకు తైలమును పంపించెదరు.

2.           ప్రభువు యూదావాసులమీద

               నేరము తెచ్చుచున్నాడు.

               ఆయన యాకోబును కూడ

               వారి క్రియలకు తగినట్లు దండించును.

               వారు తమ దుష్కార్యములకు

               తగిన ప్రతిఫలమును అనుభవింతురు.

3.           వారి పితరుడు యాకోబు

               మాతృగర్భమున ఉండగనే

               తన సోదరునితో కలహించెను.

               పెరిగి పెద్దవాడైన పిదప దేవునితో పోరాడెను.

4. అతడు దేవదూతతో పెనుగులాడి గెలిచెను.

               ఏడ్పులతో దీవెనను అర్థించెను.

               బేతేలువద్ద దేవుడు అతనిని కలిసికొని

               అతనితో మాటలాడెను.

5.           ఆ దేవుడు సైన్యములకు అధిపతి,

               యావే అనునది ఆయనను స్మరించునామము.

6.           కావున యాకోబు వంశజులారా!

               మీరిపుడు మీ దేవునిచెంతకు మరలిరండు.

               అతనిపట్ల నమ్మికను,

               నీతిన్యాయములను ప్రదర్శింపుడు.

               ఆ ప్రభువు దయకొరకు ఓపికతో వేచియుండుడు.

ఇతర శిక్షా వాక్యములు

7. ప్రభువు ఇట్లనుచున్నాడు:

               యిస్రాయేలీయులు

               కనానీయులవలె వంచకులు.

               తప్పుడు త్రాసులతో ప్రజలను మోసగించువారు.

8.           మేము సంపదలు కూడబెట్టుకొని

               ధనికులమైతిమి.

               కాని మేము అక్రమముగా ధనమార్జించితిమని

               ఎవరును మమ్ము నిందింపజాలరు

               అని వారు తలంచుచున్నారు.

9.           కాని ఐగుప్తునుండి మిమ్ము తోడ్కొనివచ్చిన

               మీ దేవుడను ప్రభుడనైన నేను,

               పూర్వము ఎడారిలో

               మిమ్ము కలిసికొనినప్పుడువలె,

               మీరు మరల గుడారములలో

               వసించునట్లు చేయుదును.

10.         నేను ప్రవక్తలతో మ్లాడి

               వారికి పెక్కుదర్శనములు దయచేసితిని.   

               వాని ద్వారా నా ప్రజలను హెచ్చరించితిని.

11. అయినను జనులు

               గిలాదున విగ్రహములను కొలుచుచున్నారు.

               ఆ ప్రతిమలు నిష్ప్రయోజనమైనవి.

               ప్రజలు గిల్గాలున ఎడ్లను బలియిచ్చుచున్నారు.

               అచి బలిపీఠములు

               రాళ్ళకుప్పలవలె పొలమున ప్రోగువడును.

12.          మన పితరుడైన యాకోబు

               ఆరామునకు పారిపోయి

               అచట భార్యను బడయుటకుగాను,

               ఇతరునికి చాకిరిచేసి అతని గొఱ్ఱెలు కాచెను.

13.          కాని ప్రభువు ఐగుప్తులోని

               యిస్రాయేలీయులను దాస్యమునుండి విడిపించి

               వారిని కాపాడుటకుగాను

               ఒక ప్రవక్తను పంపెను.

14.          ఎఫ్రాయీమీయులు

               ప్రభువునకు తీవ్రకోపము రప్పించిరి.

               వారి దోషములకుగాను

               వారు మరణశిక్షను అనుభవింపవలెను.

               వారు ప్రభువును అవమానించిరి కనుక      ఆయన వారిని దండించితీరును.

Previous                                                                                                                                                                                                    Next