1 1. దేవుని సంకల్పముచే క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, మన సోదరుడగు తిమోతి, కొరింతులోని దైవసంఘమునకును, అకాయియలోని దేవుని పవిత్ర ప్రజలందరికిని వ్రాయునది: 2. మన తండ్రియగు దేవునినుండియు, ప్రభువగు యేసుక్రీస్తునుండియు, మీకు కృపయు, సమాధానము కలుగునుగాక!

పౌలు కృతజ్ఞతలు

3. మన యేసుక్రీస్తు ప్రభువుతండ్రియగు దేవునకు స్తుతులను అర్పించుదము. మన తండ్రి కృపామూర్తి. ఆ దేవుని నుండియే ఆదరణ సర్వదా మనకు లభించును.

4. మన కష్టములన్నిలో ఆయనయే మనలను ఆదుకొనును. అప్పుడు దేవునినుండి మనకు లభించిన ఆదరణతో పలురకములైన కష్టములలో ఉన్న వ్యక్తులను మనమును ఆదుకొనగలము.

5. క్రీస్తు కష్టములలో మనము అధికముగా పాలు పంచుకొనిన విధముననే క్రీస్తుద్వారా మనము ఆయన ఒనర్చు గొప్ప ఆదరణములో భాగము పంచుకొనగలము.

6. మేము కష్టపడుట మీకు ఆదరణను, రక్షణను కలిగించుట కొరకే. ఆదరణ లభించినచో, అది మీ కొరకే కనుక మేము ఓర్పుతో సహించు కష్టములనే మీరును ఓపికతో భరించుటకు శక్తి ఒసగబడినది.

7. మీరు మా కష్టములలో పాల్గొనినట్లే, మాకు లభించు ఆదరణలో కూడ మీరు పాల్గొందురని మాకు తెలియును. కనుకనే మీ యందలి మా నమ్మకము ఎన్నికిని చలింపదు.

8. సోదరులారా! ఆసియా మండలములో మాకు ఎదురైన కష్టమునుగూర్చి మీకు ఎరిగింపకుండుట మాకు ఇష్టము లేదు. మేము మా శక్తికి మించిన కష్టములకు గురియైతిమి. అందుచేత మేము జీవితముపై ఆశ వదలుకొంటిమి.

9. మాపై మరణశిక్ష విధింపబడినట్లుగ భావించితిమి. మేము మాపై ఆధారపడివుండక, మృతులనుగూడ పునరుత్థాన మొనరించు దేవునిపైన ఆధారపడివుండుటకే అది జరిగినది.

10. మృత్యుసంబంధమైన భయంకర ప్రమాదములెన్నింనుండియో ఆయన మమ్ము కాపాడెను. ఇక ముందును కాపాడును. ఆయన తిరిగి మమ్ము కాపాడునని మా నమ్మకమును ఆయన యందు నిలుపుకొంటిమి.

11. మా కొరకై మీరును ప్రార్థనను సలిపి సాయపడుచున్నారు గదా! మాకొరకై చేయబడుచున్న పెక్కుప్రార్థనలు ఫలవంతములగును. దేవుడు మమ్ము దీవించును. మా కొరకై పెక్కుమంది గొంతులెత్తి ఆయనకు కృతజ్ఞతలు అర్పింతురు.

పౌలు ప్రణాళికలో మార్పు

12. మేము ఈ లోకమున విశేషముగా మీ యెడల లౌకికజ్ఞానముతో ప్రవర్తింపక దేవుని దయానుగ్రహము వలన నిష్కపటహృదయముతో వర్తించితిమని మా అంతఃకరణము దృఢముగా చెప్పుచున్నది. ఇది మాకు గర్వింపదగిన విషయము.

13. ఏలయన, మీరు చదివి అర్థము చేసికొనగలిగినంత మాత్రమే మీకు వ్రాయుదుము.

14. ఇప్పుడు మీరు పాక్షికముగ మాత్రమే అర్థము చేసికొనగల విషయమును ముందు కాలమున సంపూర్ణముగ గ్రహింపగలరని నేను ఆశించుచున్నాను. అప్పుడు యేసుప్రభువు దినమున మమ్ము చూచి మీరు ఎంతగా గర్వింతురో, మిమ్ము చూచి మేమును అంతగానే గర్వింతుము.

15. దీనిని గూర్చి నాకు దృఢనిశ్చయము ఉండుటచే, మీకు రెట్టింపు ఆనందమును కలుగ చేయుటకొరకై నేను మిమ్ము చూచుటకు రావలెనని మొదట అనుకొంటిని.

16. ఏలయన, మాసిడోనియాకు నేను వెళ్ళునప్పుడును, తిరిగి వచ్చునప్పుడును, మిమ్ము చూడవలెనని అనుకొంటిని. నా యూదయా ప్రయాణమునకు మీ నుండి సాయము పొందనెంచితిని.

17. ఇట్లు ఆలోచించుటలో నేను చపల చిత్తుడనని మీకు అనిపించుచున్నదా? నేను స్వార్థపరుడనై ఆలోచించువాడనా? అవును అవునని చెప్పుచూ, కాదు కాదని చెప్పువాడనా?

18. దేవుడు నమ్మదగిన వాడైనట్లే మీకు నేను చేసిన వాగ్దానము అవునని చెప్పి కాదనునట్లుగ ఉండలేదు.

19. ఏలయన సిలాసు ద్వారా, తిమోతి ద్వారా, నా ద్వారా మీకు బోధింపబడిన దైవపుత్రుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడు కాడు. కాని ఎల్లపుడు అవుననువాడే.

20. ఏలయన, దేవుని వాగ్దానములన్నిటికి ఆయనయే ”అవును” అను సమాధానము. ఇందువలననే దేవునికి మహిమ కలుగుటకై యేసు క్రీస్తు ద్వారా మనము మన ”ఆమెన్‌” పలుకుదుము.

21. మన క్రీస్తునందలి జీవితమును, మీతో కూడ నిశ్చయమొనర్చువాడు దేవుడేకదా! మమ్ము ప్రత్యేకముగ ఉంచినదియు దేవుడేకదా!

22. ఆయనయే తనముద్రను మనపై వేసి మనలను తన వారిగ ప్రకించెను. ఆయన మనకొనర్చిన వానిని ధ్రువపర్చుటకై మన హృదయములందలి పవిత్రాత్మను అనుగ్రహించెను.

23. దేవుని నా సాక్షిగ పిలిచెదను: ఆయనకు నా హృదయము విదితమేకదా! మిమ్ము బాధపెట్టుటకు ఇష్టములేకయే నేను కొరింతుకు రాకుండుటకు నిర్ణయించుకొంటిని.

24. మీ విశ్వాసము దృఢమైనదే. కనుక మీరు ఫలానిది విశ్వసింపవలెనని మేము ఆజ్ఞాపించుటలేదు. పైగా మేము మీ సంతోషము కొరకే మీతో సహకరించుచున్నాము.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము