మోషే కంటెను క్రీస్తు శ్రేష్ఠుడు

3 1. దేవుని పిలుపునందుకొనినపవిత్రులైనసోదరులారా! మనము ప్రచారముచేయు విశ్వాసమునకు ప్రధానయాజకుడుగా దేవునిచే పంపబడిన యేసును చూడుడు.

2. దేవుని గృహకృత్యములందుమోషే విశ్వసనీయుడుగా ప్రవర్తించినట్లే, తనను ఈ పనికి ఎన్నుకొనిన దేవునికి ఆయన విశ్వసనీయుడై ఉండెను.

3. గృహనిర్మాణమొనర్చిన వ్యక్తి, గృహముకంటెను ఎక్కువ ప్రతిష్ఠను పొందును. అట్లే యేసు, మోషే పొందినదానికంటె ఎక్కువ కీర్తిని పొందుటకు యోగ్యుడు.

4. ప్రతిగృహమును ఎవరో ఒకరు నిర్మింతురు. కాని దేవుడు విశ్వనిర్మాత.

5. మోషే దేవుడు చెప్పబోవు విషయములకు సాక్షిగ దేవునిఇంటియందంతట నమ్మకముగ ఒక పరిచారకుని వలెయున్నాడు.

6. కాని క్రీస్తు దేవుని ఇంటిలో నమ్మకముగా ఒక కుమారునివలె ఉన్నాడు. మన నిరీక్షణయందు విశ్వాసము కలవారమై ధైర్యమును వహించినచో మనమే ఆయన గృహముగా నిలిచెదము.

దేవుని ప్రజలకు విశ్రాంతి

7.            ఎట్లన, పవిత్రాత్మ చెప్పిన విధమున:

               ”ఈనాడు మీరు దేవుని వాణిని వినినచో,

8.           దేవునిపై తిరుగుబాటుచేసిన నాటివలె,

               ఎడారియందు ఆయనను పరీక్షించిన నాటివలె,

మీ హృదయములను కఠినపరచుకొనకుడు.

9.           నేను వారికి నలువది సంవత్సరములపాటు

చేసినది చూచియు, ఆనాడు మీ పూర్వులు

నన్ను శోధించి పరీక్షించిరి.

అని దేవుడు పలికెను.

10.         ఆ కారణముననే

               నాకు వారిపై ఆగ్రహము కలిగి,

               ‘వారి ఆలోచనయందు

               వారు ఎప్పుడును తప్పిపోవుదురు.

               నా మార్గములను వారు ఎన్నడును గ్రహింపలేరు’

అని పలికితిని.

11.           నేను కోపించి ఇట్లొక శపథమొనర్చితిని:

               ‘వారు ఎన్నడును లోపల ప్రవేశించి

               నాతో విశ్రమింపకుందురుగాక’.”

12. నా సోదరులారా! సజీవదేవునినుండి విముఖుని చేయునంతటి విశ్వాసహీనమగు దుష్ట హృదయము మీలో ఎవ్వరికిని లేకుండునట్లు అప్రమత్తులై ఉండుడు.

13. కానిచో, మీలో ఏ ఒక్కరును పాపముచే మోసగింపబడి మొండిపట్టుదలకు పోకుండునట్లు,  ‘ఈదినము’ అనునది ఉన్నంతకాలము, మీరు ప్రతిదినము పరస్పరము సాయపడవలెను.

14. మొదట ఉన్న విశ్వాసమును చివరివరకు మనము దృఢముగ నిలిపి ఉంచుకొనగలిగినచో మన మందరము క్రీస్తులో భాగస్వాములమే.

15.          ”ఈనాడు మీరు దేవుని మాట వినినచో,

               దేవునిపై తిరుగుబాటుచేసిన నాటివలె,

               మీ హృదయములను కఠినపరచుకొనకుడు”

అని చెప్పినప్పుడు,

16. దేవుని వాక్కును విని, ఆయనపై తిరుగుబాటొనర్చినది ఎవరు? నిజమునకు వారందరు మోషే నాయకత్వమున ఐగుప్తులోనుండి వెడలివచ్చిన వారే కదా!

17. దేవుడు నలువది సంవత్సరములు కోపించినది ఎవరిపైన? పాపములు చేసి ఎడారియందు ప్రాణములు కోల్పోయిన వ్యక్తులపైన ఆయన కోపించెను గదా!

18. ”వారు ఎన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకుందురుగాక!” అని దేవుడు ఎవరిని గూర్చి శపథము చేసెను? అవిధేయులైనవారిని గూర్చియే ఆయన పలికెను గదా!

19. కాన అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని మనము గ్రహింతుము.