అహస్యా పరిపాలన

22 1. అరబ్బీయులను ప్రోగుజేసికొని వచ్చి దాడి చేసిపోయిన దండులు యెహోరాము కుమారులలో కనిష్ఠుని తప్ప అందరిని వధించిరి. కనుక యెరూష లేము పౌరులు యెహోరామునకు బదులుగా అతని కడగొట్టు కుమారుడైన అహస్యాను రాజును చేసిరి.

2. రాజగునప్పికి అహస్యాకి ఇరువది రెండేండ్లు. అతడు యెరూషలేమున ఒక సంవత్సర కాలము రాజ్యము చేసెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తెయైన అతల్యా.

3. అతడుకూడ అహాబు బంధువుల మార్గము ననే నడిచెను. తల్లి సలహాలను పాించి కానిపనులు చేసెను.

4. తండ్రి మరణానంతరము అహాబు బంధువులు అహస్యాకు దురుపదేశముచేయగా అతడు ప్రభువు సహింపని దుష్కార్యములు చేసి వినాశనము తెచ్చుకొనెను.

5. వారి దుర్బోధల వలన అతడు అహాబు కుమారుడును, యిస్రాయేలురాజునైన యెహోరాముతో కలిసి సిరియారాజు హసాయేలు మీదికి యుద్ధమునకు పోయెను. గిలాదులోని రామోతున పోరు జరిగెను. అచట సిరియనులు యెహోరామును గాయపరచిరి.

6. యెహోరాము యెస్రెయేలు నగరమునకు వచ్చి గాయములకు చికిత్స చేయించుకొనుచుండెను. అహస్యా గాయపడియున్న యెహోరామును చూడబోయెను.

7. ఈ రాజసందర్శన సంఘటనద్వారానే ప్రభువు అహస్యాను నాశనము చేసెను. అతడు యెస్రెయేలున నున్న కాలమున యెహోరాముతో కలసి నింషీ కుమారుడైన యెహూ మీదికి పోయెను. ప్రభువు అహాబు కుటుంబమును నాశనము చేయుటకు ఈ యెహూను అభిషేకించెను.

8. యెహూ అహాబు వంశ జులనెల్ల నిర్మూలించుచుండగా కొందరు యూదీయ నాయకులు, అహస్యాతోపాటు వచ్చిన అతని సోదరుల పుత్రులు ఆ వీరుని కంటబడిరి. అతడు వారినందరిని మట్టుపెట్టెను.

9. అటుతరువాత యెహూ అహస్యాను గాలించెను. అతడు సమరియా నగరమున దాగుకొనియుండి శత్రువులకు దొరకి పోయెను. బంటులు అతనిని యెహూ చెంతకు కొని వచ్చి వధించిరి. కాని పూర్ణహృదయముతో ప్రభువును సేవించిన యెహోషాఫాత్తు మనుమడన్న గౌరవముతో వారతనికి అంత్యక్రియలు జరిపిరి. అటు తరువాత అహస్యా కుటుంబమున రాజ్యపదవిని చేపట్టగల దిట్ట ఎవడును లేడయ్యెను.

రాణి అతల్యా దుండగము

10. అతల్యా తనకుమారుడు అహస్యా మర ణించెనని వినగానే యూదా రాజకుటుంబమునకు చెందిన వారినందరిని హత్య చేయించెను.

11. కాని అహస్యాకు యెహోషెబ అను మారుచెల్లెలు కలదు.  ఆమెను యెహోయాదా అను యాజకునకిచ్చి పెండ్లి చేసిరి. ఆమె తన అన్నయగు అహస్యా కుమారులలో  ఒకడగు యోవాషును మృత్యువాతబడనున్న ఇతర రాజకుమారుల నుండి రహస్యముగా తప్పించెను. ఆ పిల్లవానిని, అతని దాదిని ఒక శయన మందిరమున దాచియుంచెను. ఆ రీతిగా దాచియుంచినందున ఆ శిశువు అతల్యా చేతికిచిక్కి ప్రాణములు కోల్పోలేదు.

12. అతడు వారితోకూడా ఆరేండ్లపాటు దేవాలయ ముననే దాగియుంచబడెను. ఆ కాలమున అతల్యా దేశమునేలుచుండెను.