యెరూషలేమునకు శిక్ష
9 1. అంతట నేను వినుచుండగా ఆయన ”నగర మును శిక్షించువారలారా! మీరిచికిరండు. మీ శిక్షా యుధములనుకూడ కొనిరండు” అని బిగ్గరగా అరచెను.
2. వెంటనే వెలుపలి వైపుననున్న ఉత్తర ద్వారమునుండి ఆరుగురు మనుష్యులు శిక్షాయుధ ములతో వచ్చిరి, వారిలో ఒకడు నారబట్టలుతాల్చి, వ్రాత పరికరములను నడుమునకు కట్టుకొనిఉండెను. వారెల్లరును లోపలి ఆవరణమునకు వచ్చి ఇత్తడి బలి పీఠమువద్ద నిలుచుండిరి.
3. అంతవరకు కెరూబుదూతల మీద నిలిచి యుండిన యిస్రాయేలు దేవునితేజస్సు పైకిలేచి మందిరద్వారము చెంతకు వచ్చి నిలబడెను. ఆయన నారబట్టలు తాల్చియున్న వ్యక్తితో, 4. ”నీవు యెరూషలేము నగరమంతట సంచరించి పట్టణమున జరుగుచున్న హేయమైన కార్యములకుగాను సంతాపము చెందు వారి నొసిపై గుర్తుపెట్టుము” అని అనెను.
5. నేను వినుచుండగా ఆయన ఇతర మనుష్యు లతో ”మీరును ఇతని వెంట నగరము లోనికిపోయి ఎల్లరిని వధింపుడు. ఎవరిమీద జాలిచూపకుడు. ఎవరిని వదలివేయకుడు.
6. వృద్ధులను, యువతీ యువకులను, తల్లులను, పిల్లలను చంపివేయుడు. కాని నొసిమీద గురుతున్నవారిని మాత్రము ముట్టు కొనకుడు. నా దేవాలయ పవిత్రస్థలమువద్దనే పని మొదలుపెట్టుడు” అని చెప్పెను. కనుక వారు దేవాలయ పవిత్రస్థలము వద్దనున్న నాయకులను చంపుటతో పని ప్రారంభించిరి.
7. ఆయన వారితో ”మీరు దేవాలయమును అపవిత్రముచేయుడు. దాని ఆవరణములను శవము లతో నింపుడు. పని మొదలుపెట్టుడు” అనెను. కనుక వారు బయలుదేరి నగరమున ప్రజలను చంపసాగిరి.
8. అటుల వారు ప్రజలను చంపుచుండగా నేను ఒంటరిగా నిలిచియుింని. అపుడు నేను నేలపై సాష్టాంగపడి ”యావే ప్రభూ! నీవు యెరూషలేముపై ఆగ్రహముచెంది యిస్రాయేలీయులలో మిగిలినవారిని అందరిని వధింతువా?” అని విలపించితిని.
9. ఆయన నాతో ఇట్లు అనెను: ”యూదావాసు లును, యిస్రాయేలీయులును ఘోర పాపములు చేసిరి. వారు దేశమందంతట హత్యలుచేసిరి. యెరూషలేమును పాపముతో నింపిరి. వారు ”ప్రభువు మన దేశమును పరిత్యజించెను. అసలు ఆయన మనలను చూడడు” అని చెప్పుకొనుచున్నారు.
10. నా మట్టుకు నేను వారిని వదలను, వారిపై దయచూపను. వారు ఇతరు లకు చేసిన చెడునే నేను వారికిని చేయుదును.”
11. అపుడు నారబట్టలు తాల్చిన వ్యక్తి తిరిగివచ్చి ”అయ్యా! నేను నీవు ఆజ్ఞాపించినట్లే చేసితిని” అని పలికెను.