ఉపోద్ఘాతము:

పేరు: హీబ్రూ పేరు ”షిర్‌ హష్షిరిమ్‌”ను పరమగీతముగా అనువదించిరి. దీనిని ఇతర పేరులతో కూడా పిలుచుదురు. అవి: సొలోమోను గీతములు (1:1), సుందర గీతములు, శృంగార గీతములు. ఈ గ్రంథములోని అంశముల మీద పండితుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. యూదులలోను, క్రైస్తవులలోను ఈ గ్రంథమును బైబులు గ్రంథములలో చేర్చడముపై భిన్నభావములు వ్యక్తమయినవి.

కాలము: కొన్ని శతాబ్ధములనుండి సేకరించబడిన గీతములను క్రీ.పూ 5-4  శతాబ్దములలో  ‘పరమగీతము’గా కూర్పబడినదని పండితుల అభిప్రాయము.

రచయిత: సొలోమోను (1:1), అని ప్రస్తావించబడినను, ఖచ్చితముగా తెలియదు.

చారిత్రక నేపథ్యము: ఈ గ్రంథములో దేవుని ప్రస్తావనగాని, యిస్రాయేలీయుల చారిత్రక వృత్తాంతముల ప్రస్తావనలుగాని కనిపించవు. ఈ గ్రంథము ఒక ప్రణయకావ్యముగా కన్పించును. దీనిలోని గీతాలు ఒక రూపకముగా, పెండ్లిపాటల గీతమాలికగా కన్పిస్తాయి. ఇవి మెసపొతోమియ, ఐగుప్తు కావ్యాలకు సమాంతరాలుగా ఉన్నాయి. వీనిలో విస్తారమైన అలంకార ప్రయోగాలున్నాయి. ఈ గ్రంథము నేపథ్యము సొలోమోను రాజునకు,  ఒక యువతికిని మధ్యగల ప్రేమను, వివాహబంధమును వివరిస్తుంది.

ముఖ్యాంశములు: స్త్రీ, పురుషుల మధ్యగల ప్రణయము ఈ కావ్యములోని ప్రధానాంశము. వరుడు సొలోమోను, వధువు షూలాము యువతి మధ్యగల మానవప్రేమ పరమకావ్యముగా నిలిచెను. వివాహ బంధానికి ఆదర్శప్రాయముగా చూడగలము. ఇద్దరు గాఢ ప్రేమికులమధ్య శారీరకసంబంధాన్ని తెలిపేదిగా వుండును.  ఈ నేపథ్యములో ఈ గ్రంథము శారీరకప్రేమ, లైంగికఆకర్షణ, నిజమైనప్రేమ, అంకితజీవితం, సౌందర్యము, ప్రేమ, జీవిత సమస్యలు మొదలగు వాిని గూర్చి చర్చించును. మానవుల మధ్య కలిగే ప్రేమను యావేదేవునికి, తన ప్రజలకు మధ్యనున్న నిబంధన సంబంధముతో గూడ పోల్చవచ్చును.

కీస్తుకు అన్వయము: పూర్వనిబంధనలో యిస్రాయేలీయులు యావే దేవునికి వధువుగా వర్ణించబడినారు (యెషయా 54:5-6; యిర్మీ 2:2; యెహెజ్కే. 16:8-14; హోషె 2:16-20). నూతన నిబంధనలో శ్రీ సభను క్రీస్తు పత్నిగా చిత్రీకరించబడినది (2 కొరి 11:2; ఎఫెసి 5:23-25; దర్శన. 19:7-9; 21:9).  ప్రేయసి, ప్రియుడి మధ్య ప్రేమను నిబంధనప్రేమగా చూడవచ్చును.