మాల్టా దీవిలో పౌలు

28 1. మేము సురక్షితముగా ఒడ్డుకు చేరినపుడు  అది మాల్టా దీవి అని తెలిసికొంటిమి.

2. ఆ దీవిలో నివసించువారు మా యెడ ప్రత్యేక సానుభూతిని చూపిరి. అప్పుడు వర్షము కురియుచు, చలిగా నుండుటచే వారు చలిమంటలు వేసి, మాకు అచ్చట స్వాగతమిచ్చిరి.

3. పౌలు మోపెడు పుల్లలను ప్రోగు చేసి, వాటిని మంటలో వేయుచుండగా ఆ వేడికి ఒక విషసర్పము బయిటికివచ్చి పౌలు చేతిని చుట్టుకొనెను.

4. పౌలు చేతినుండి ఆ విషసర్పము వ్రేలాడుచుండుట చూచి ఆ దీవి వాసులు, ”ఇతడు నిజముగా నరహంత కుడే; ఇతడు సముద్రము నుండి తప్పించుకొని బ్రతికి బయటపడినను, న్యాయము వీనిని బ్రతుకనీయలేదు” అని తమలో తాము చెప్పుకొనిరి.

5. కాని, పౌలు ఆ విషసర్పమును మంటలోనికి విదిలించి ఏ హాని లేక నిమ్మకు నీరెత్తినట్టు ఉండెను.

6. అతని శరీరము ఉబ్బిపోవునని, లేక వెంటనే అతడు క్రిందబడి మరణించునని వారు వేచియుండిరి. అటుల ఎంత వేచియున్నను అతనికి ఏ హానియు జరుగకుండుట చూచి, వారు తమ అభిప్రాయమును మార్చుకొని అతడు ఒక దేవుడని చెప్పుకొనిరి.

7.  పుబ్లియు అనువాడు ఆ దీవిలో ప్రముఖుడు. అతనికి ఆ ప్రాంతమున కొంత పొలము కలదు. అతడు మాకు స్వాగతమిచ్చి మూడు రోజుల వరకు ఆతిథ్య మొసగెను.

8. అప్పుడు పుబ్లియు తండ్రి జ్వరముతోను, రక్త విరేచనములతోను మంచము పట్టి ఉండెను. పౌలు అతనిని సందర్శించి, ప్రార్థించి, అతనిపై చేతులుంచి వానిని స్వస్థపరచెను.

9. ఇది జరిగిన తరువాత ఆ దీవిలోనున్న వ్యాధిగ్రస్తులందరు వచ్చి పౌలు వలన స్వస్థత పొందిరి.

10. వారు మాకు అనేక బహుమతులను ఇచ్చిరి. మరల మేము ఓడ ప్రయాణమునకు బయలుదేరినప్పుడు  మాకు  కావలసిన వస్తువులను వారు అందించిరి.

మాల్టా నుండి రోమునకు

11. అలెగ్జాండ్రియాకు   చెందిన   ‘అశ్విని చిహ్నము’గా గల ఓడ ఒకి శీతకాలమంతయు ఆ దీవియందే ఉండుటచే మూడునెలల తరువాత మేము దానిపై పయనించితిమి.

12. తరువాత మేము ‘సిరకుసె’ను చేరుకొంటిమి. అక్కడ మూడు రోజు లుంటిమి.

13. అచ్చట నుండి రెజీయుము నగరము నకు వచ్చితిమి. మరుసిదినమున దక్షిణ దిశకు గాలి వీచసాగెను. రెండవదినము మేము పుతెయోలిపురము చేరితిమి.

14. అచ్చట మాకు కొందరు సోదరులు కనబడి ఏడురోజులవరకు వారియొద్ద ఉండుమని కోరిరి. పిదప మేము రోము నగరమునకు వచ్చితిమి.

15. రోములో ఉన్న సోదరులు మేము వచ్చిన సంగతిని విని మమ్ము కలిసికొనుటకై, అప్పియ సంత వరకును, మూడు సత్రములవరకును వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతావందనములు చెల్లించి ధైర్యము వహించెను.

రోములో పౌలు

16. మేము రోము చేరుకొనినప్పుడు, ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అను మతింపబడెను.

17. మూడు రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిపించెను. వారు సమావేశ మైనప్పుడు పౌలు వారితో, ”సోదరులారా! నేను మన జనులకును, మన పూర్వుల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకముగా ఏమియు చేయకపోయినను, యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి, రోమీయులకు అప్పగింపబడితిని.

18. వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయ గోరిరి. ఎందుకన నేను చంపబడుటకు తగిన నేరమేమియు చేసి ఉండలేదని వారు గ్రహించిరి.

19. కాని, యూదులు దీనికి వ్యతిరేకించినపుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసికొందునని చెప్పవలసివచ్చెను కాని, నా సొంత జనముపై నేరము మోపుటకు నేను అటుల చేయలేదు.

20. అందుచే నేను మిమ్ము చూచి, మీతో మ్లాడవలెనని పిలిపించితిని. ఏలయన, యిస్రాయేలు ప్రజలు ఎవరికొరకు నిరీక్షించు చున్నారో, ఆయన నిమిత్తమే నేను ఈ  సంకెళ్లతో బంధింపబడి ఉన్నాను” అని పలికెను. 21. అప్పుడు వారు, ”మాకు నిన్ను గురించి, యూదయానుండి ఎట్టి వర్తమానములు అందలేదు. ఇచ్చటకు వచ్చిన సోదరులలో ఎవరును నిన్ను గురించి ఫిర్యాదులు చేయుటగాని, చెడుగా మ్లాడుటగాని జరుగలేదు.

22. కాని, నీవు ఏ పక్షమునకు చెందియున్నావో ఆ పక్షమునకు వ్యతిరేకముగా ప్రజలందరును చెప్పుకొను చుండుటచే నీ నుండియే నీ అభిప్రాయములను వినగోరుచున్నాము” అని వారు పలికిరి.

23. కావున, పౌలుతో మాట్లాడుటకై వారు ఒక దినమును నిర్ణయించి, వారిలో చాలమంది ఆ దినమున పౌలు నివసించుచున్న ఇంటికి వచ్చిరి. ప్రొద్దు పొడిచినది మొదలుకొని  ప్రొద్దుక్రుంకెడి వరకు పౌలు వారికి వివరించుచు దేవునిరాజ్యమును గూర్చి సందేశమొసగెను. మోషే చట్టమునుండియు, ప్రవక్తల గ్రంథములనుండియు నిదర్శనములు చూపుచు  అతడు యేసును గురించి  వారిని ఒప్పింప ప్రయత్నించెను. 24. వారిలో కొందరు అతడి మాటలను అంగీకరించిరి. మరికొందరు అంగీకరింపకపోయిరి.

25. అందుచే వారిలో వారికి పొత్తు కుదరక, అచ్చటనుండి పోవుచుండ పౌలు ఇట్లు చెప్పెను: ”యెషయా ప్రవక్త ద్వారా పవిత్రాత్మ మీ పూర్వులకు ఎంత చక్కగా చెప్పెనో ఆలకింపుడు.

26. ఎట్లన:

               ‘నీవు పోయి, ఈ ప్రజలతో ఇట్లు చెప్పుము.

               ఎంతగా విన్నను మీరు గ్రహింపరు.

               ఎంతగా  చూచినను మీరు గమనింపరు.

27.         ఈ ప్రజల బుద్ధి మందగించుటచే

               వారు చెవులను మూసికొనిరి.

               కన్నులను కప్పివేసికొనిరి.

               లేకున్నచో వారి కన్నులు చూడగలిగెడివి.

               వారి వీనులు వినగలిగెడివి.

               వారి బుద్ధులు అర్థము చేసికొనగలిగెడివి.

               వారు నా వైపునకు తిరిగి యుండెడివారు.

               అపుడు నేను వారికి

               స్వస్థత కలిగించియుండెడివాడను’.

అని దేవుడు చెప్పెను. దీనిని వారితో చెప్పుము” అని ఆయన పలికెను.

28. ఇట్లు చెప్పి పౌలు మరల, ”దేవుని రక్షణ సందేశము అన్యులకు పంపబడినది కనుక వారు ఆలకించెదరు అని మీరు తెలిసికొనుడు” అని పలికెను.

29. ఇది విన్న పిదప యూదులు వారిలో వారు తీవ్రముగా వాదించుకొనుచు వెళ్ళిపోయిరి.

30. పౌలు తాను అద్దెకు తీసికొనిన ఇంటిలో రెండు సంవత్సరములపాటు ఉండి తనను చూడవచ్చిన వారందరిని స్వీకరించుచుండెను.

31. అతడు బహిరంగముగా, నిరాటంకముగా దేవునిరాజ్యమును గురించి ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను.