ఉపోద్ఘాతము:

పేరు: బైబులులో చివరి గ్రంథానికి దర్శన గ్రంథం అని పేరుపెట్టారు. ఇతర బైబులు ప్రతులలో దీనిని ప్రకటన గ్రంథం అనికూడా పిలిచారు. ‘ప్రకటన’ పదాన్ని ‘ప్రత్యక్షం’ అని కూడా పేర్కొంటాం. ఈ  గ్రంథంలోనున్న దర్శనాలు, సంకేతాల ఆధారంగా దీనికి దర్శన గ్రంథం అని నిర్ణయించారు. గ్రీకు భాషలో దీన్ని అపొకలిప్సిస్‌ అని, ఆంగ్లంలో రెవలేషన్‌ అనీ అంటారు.

కాలము: క్రీ.శ. 95. పత్మోసు దీవి నుండి రాశాడు. 

రచయిత: యోహాను సువార్తీకుడు.

చారిత్రక నేపథ్యము: డొమీషన్‌ చక్రవర్తి పాలన సమయానికి (క్రీ.శ 90-95) ఆసియాలో ఏడు క్రైస్తవ సంఘాలు వెలిశాయి. చక్రవర్తిని ఆరాధించని వారు హింసలకు గురైనారు. క్రీస్తును ఆరాధించేవారికి చక్రవర్తి ఆరాధన సమ్మతమనిపించ లేదు. అన్య దేవతల విందుల్లో పాల్గొనలేకపోయారు. తత్ఫలితంగ శ్రమలు, హింసలు అనుభవించారు. ఈ పరిస్థితులు విశ్వాసులలో అనైక్యతను, అశాంతిని సృష్టించాయి. ఈ నేపథ్యంలో యోహాను ఈ ఏడు సంఘాలనుద్దేశించి రాశాడు. క్రైస్తవ విశ్వాస ఆచరణలో ఉన్న లోపాలను ఎత్తి చూపుచు, విశ్వాసమును పరిరక్షించు కొని, మొదటిలో ఉన్న విశ్వాస స్థాయికి ఎదగమని ఉద్బోధించాడు.

ముఖ్యాంశములు: క్రైస్తవ జీవన విధానంలో వ్యతిరేకతలు, హింసలు అనివార్యం. దుష్టశక్తులు పనిచేస్తూ వుంటాయి. ఎంతటి శక్తియైనా క్రీస్తు శక్తికి లొంగిపోవలసిందే. అంతిమ విజయం క్రీస్తుదే అని సూచించడం గ్రంథం ప్రధానోద్దేశ్యం. దేవుడే సర్వాధికారి యని నిరీక్షించాలని రచయిత బోధించాడు. దేవుని పట్ల విశ్వాసం చూపినవారు ప్రాణాలు పోగొట్టుకున్నను అద్భుత ఫలితాలను పొందుతారని తెలిపాడు, ఆశా దృక్పథాన్ని వ్యక్తం చేశాడు, ఆత్మ ప్రేరణతో రచనకు సంకల్పించాడు. అలాగే విశ్వాసులకు క్రీస్తు వ్యక్తిత్వ మహత్వాన్ని తెలిపాడు రచయిత. క్రీస్తుని దర్శించినవారు భవిష్యత్తులో కీడు నుండి రక్షణ తీర్పును పొందుతారు.

క్రీస్తు చిత్రీకరణ: దర్శన గ్రంథం క్రీస్తును గూర్చి ప్రత్యక్ష సాక్ష్యమిస్తుంది. క్రీస్తు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, రారాజు (1:5), ఆద్యంతములు (1:17), జీవించువాడు (1:18), దేవుని కుమారుడు (2:18), సత్యస్వరూపి, పరిశుద్ధుడు (3:7), నమ్మకమైన సత్యసాక్షి, ఆమెన్‌ (3:14), యూదా గోత్రపు సింహము (5:5), వధించబడిన గొఱ్ఱెపిల్ల (5:6), సత్యవంతుడు (19:11), దేవుని వాక్కు (19:13), రారాజు, ప్రభువులకు ప్రభువు (19:16), ఆల్ఫా, ఒమేగా (22:13), ప్రకాశమానమైన వేగుచుక్క (22:16), త్వరగా వచ్చుచున్న వాడు (22:20), ప్రభువైన క్రీస్తు (22:21).