ఐహిక స్నేహము

4 1. మీ మధ్య ఇన్ని కలహములు, వివాదములు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగియుండి, సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే గదా!

2. మీరు ఆశించుచున్నారుగాని పొందుటలేదు. కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయపడుదురుగాని పొందలేరు. కనుక మీరు కలహించుదురు. యుద్ధములు చేయుదురు. మీకేమి కావలయునో వాని కొరకై దేవుని అర్థింపక పోవుటచేతనే, మీకు కావలసిన వానిని మీరు పొందలేకున్నారు.

3. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవ మునకై మీరు వానిని కోరుదురుగదా!

4. విశ్వాసరహితులారా! ఐహికమును ప్రియముగ నెంచువాడు దేవునకు విరోధియని మీకు తెలియదా? ఐహిక మైత్రిని సంపాదింపనెంచువాడు దేవునితో విరోధము తెచ్చిపెట్టుకొనుచున్నాడు.

5.”మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో అపేక్షించును” అను పరిశుద్ధ గ్రంథవచనము అర్థరహితము అగునని అనుకొందురా!
6. కాని ఆయన కృపను ఎక్కువగ ఇచ్చును. ఏలయన, ”దేవుడు అహంకారులను ఎదిరించును. వినమ్రులకు కృపను అనుగ్రహించును” అని లేఖనము చెప్పుచున్నది.

7. కావున దేవునకు విధేయులు కండు. సైతానును వ్యతిరేకింపుడు. అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచిపారిపోవును.

8. దేవుని దరికి చేరుకొనుడు. అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును. పాపాత్ములారా! మీ చేతులు శుభ్రము చేసికొనుడు. ద్విమనస్కులారా! హృదయములను శుద్ధి యొనర్చుకొనుడు.

9. విచారింపుడు, మొరపెట్టుకొనుడు, రోదింపుడు, నవ్వుటకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు.

10. దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు; అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును.

సహోదరుని విమర్శింపకుండ హెచ్చరిక

11. సోదరులారా! మీరు పరస్పరము విరుద్ధముగా పలుకరాదు. ఎవడైనను తన తోడివానిని గూర్చి విరుద్ధముగ పలికెననుకొనుడు. లేదా వానిపై తీర్పరి అయ్యెననుకొనుడు. అట్లయినచో అతడు ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా పలికినట్లే. అప్పుడు అతడు ధర్మశాస్త్రమునే విమర్శించువాడగును. నీవుధర్మశాస్త్రమునువిమర్శించినచో  ధర్మశాస్త్రమునకు విధేయుడవు కావు. పైగా ధర్మశాస్త్రముపై తీర్పరివి అగుదువు.

12. ధర్మ శాస్త్రమును విధించువాడు దేవుడొక్కడే. ఆయన ఒక్కడేన్యాయాధికారి. ఆయన మాత్రమే రక్షింపను, శిక్షింపను సమర్థుడు.తోడివారి న్యాయాన్యాయములను ఎంచుటకు నీవు ఎంతటివాడవు?

ఆత్మస్తుతిని గూర్చిన హెచ్చరిక

13. ”నేడో, రేపో, ఏదైన నగరమునకు పోయెదము. అచట ఒక సంవత్సరములో వ్యాపారమున మంచిలాభములు సంపాదించెదము” అని మీరు పలుకుదురా? అయ్యలారా! నా మాట వినుడు.

14. మీ జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడ తెలియదు కదా! ఏలయన, మీరు ఈ క్షణముండి, మరు క్షణములో అదృశ్యమయ్యెడి పొగమంచు వంటివారు.

15. కనుక, ”ప్రభువు అనుగ్రహించినచో ఎట్లో జీవించి, ఏదేని సాధింతుము” అని మీరు పలుకవలెను.

16. కాని, ఇప్పుడు మీరు పొగరుబోతులైడంబములు పలుకుచున్నారు. అటుల చేయుటతగదు.

17. మేలైనది చేయనెరిగియు అటుల చేయనివాడు పాపము చేసినవాడగును.