రక్షణము కొరకు ప్రభువుకు మనవి
3 1. హబక్కూకు ప్రవక్త ప్రార్థన:
‘షిగ్యనోతు’ రాగములో పాడదగినది.
2. ప్రభూ!
నేను నీ కార్యములను గూర్చి వినగా
నాకు వెరగు ప్టుినది.
కాలగమనములో నీ కార్యములను
పునరుజ్జీవింపచేయుము
ఆయా కాలగమనములను
(మాకు) తెలియజేయుచూ
కోపించుచూనే నీ కనికరమును
జ్ఞాపకమునకు తెచ్చుకొనుము.
3. దేవుడు తేమానునుండి కదలి వచ్చుచున్నాడు.
పవిత్రుడైన దేవుడు
పారాను కొండలనుండి తరలి వచ్చుచున్నాడు.
ఆయన తేజస్సు
ఆకసమునందంతట కనపడుచున్నది
భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.
4. ఆయన ప్రకాశము సూర్యకాంతివలెనున్నది
ఆయన హస్తమునుండి జ్యోతి వెలువడును. ఆయన బలము ఆ హస్తమున నిక్షిప్తమై ఉన్నది.
5. అంటురోగము ఆయనముందట నడచును.
అగ్నిమెరుపులు ఆయన వెంటవచ్చును.
6. ఆయన నిలుచుండినపుడు భూమి కంపించును.
ఆయన కన్నెత్తిచూడగా
జాతులు గడగడ వణకును
శాశ్వతనగరములు పునాదులనుండి కదలును
ఆయన ప్రాచీనకాలమున నడచిన
సనాతనపర్వతములు నేలలోనికి క్రుంగును.
7. నేను కూషాను గుడారములలో వ్యధనుచూచితిని.
మిద్యాను తెరలు గజగజలాడుటను గాంచితిని.
8. ప్రభూ!
నీ ఉగ్రత ప్రజ్వరిల్లినది నదులపైనా?
నదులపై నీకు ఆగ్రహము కలిగినందులకా?
నీకు సాగరముపై ఉగ్రత కలిగినందులకా
నీవు గుఱ్ఱములను కట్టుకుని రధములనెక్కి
రక్షణార్ధమై వచ్చుచున్నావు?
9. నీవు నీ విల్లును ఒరనుండి బయటకు తీసితివి
నీ వాక్కుతోడని ప్రమాణముచేసి,
బాణమును వింనారిమీద ప్టిెతివి
నీవు భూమిని పగులగ్టొి
నదులను కలుగజేసితివి
10. పర్వతములు నిన్ను చూచి గడగడవణకెను.
ఆకసమునుండి జలములు వర్షించెను.
పాతాళజలములు హోరెత్తెను
వాని అలలు ఉవ్వెత్తుగా లేచెను.
11. వేగముగా పరుగిడు
నీ బాణముల కాంతిని గాంచి,
తళతళ మెరయు నీ బల్లెపు తేజస్సు చూచి
సూర్యచంద్రులు
తమ తావున తాము నిశ్చలముగా నిలిచిరి.
12. నీవు రౌద్రముతో భూమిపై నడచితివి.
ఆగ్రహముతో జాతులను నీ కాలితో త్రొక్కితివి.
13. నీవు నీ ప్రజలను రక్షించుటకు
బయలుదేరి వెళ్ళితివి.
నీవు ఎన్నుకొనిన అభిషిక్తుని
కాపాడుటకు పయనమైపోతివి.
దుష్టుల నాయకుని హతమార్చితివి
అతని అనుచరులను ప్టి నిర్మూలించితివి.
14. పేదలను రహస్యముగ కబళించవలెనని
ఉత్సాహముతో, నన్ను ధూళివలె
చెదరగొట్టుటకు, తుఫానువలె వచ్చు
యోధుల తలలలో ఈటెలను నాటుచున్నావు.
15. నీవు నీ గుఱ్ఱముల కాళ్ళతో
సముద్రమును త్రొక్కింపగా
దాని మహాజలములు నురగలు క్రక్కెను.
16. ఈ ధ్వనులెల్ల విని నేను కంపించుచున్నాను.
నా పెదవులు గడగడ వణకుచున్నవి.
నా మేను సత్తువను కోల్పోయినది.
నా కాళ్ళు కూలబడుచున్నవి.
అయినను దేవుడు మాపై దాడిచేయువారిని
శిక్షించుకాలము వచ్చువరకును
నేను నెమ్మదిగ ఓపికగా వేచియుందును.
17. అంజూరము పూత పట్టకుండినను,
ద్రాక్షతీగ కాయలు కాయకుండినను,
ఓలివుపంట నాశనమైనను,
పొలము పండకపోయినను,
గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను,
కొట్టములోని పశువులు లేకపోయినను,
18. నేను ప్రభువునందు ఆనందించెదను.
నా రక్షకుడైన దేవునియందు సంతసించెదను.
19. సర్వోన్నతుడైన ప్రభువు నాకు బలము నొసగును. నా పాదములకు జింక కాళ్ళకువలె
లాఘవమును ఒసగి
నేను కొండలపై నడయాడునట్లు చేయును.