అన్యజాతులకు తీర్పు, శిక్షనెరిగించుట

3 1. ప్రభువిట్లనుచున్నాడు:

               ఆ కాలమున యూదా యెరూషలేములకు

               మరల సౌభాగ్యమును ఒసగుదును.

2.           నేను జాతులన్నిని ప్రోగుచేసి

               యెహోషాఫాత్తులోయకు1 కొనివత్తును.

               వారు నా సొంతప్రజలకు చేసిన కీడునకుగాను

               నేను వారికచట తీర్పుతీర్తును.

               వారు యిస్రాయేలీయులను

               జాతులమధ్య చెల్లాచెదురుచేసి

               నాదేశమును తమలోతాము పంచుకొనిరి.

3.           వారు బందీలైన

               నా ప్రజల కొరకు చీట్లు వేసికొనిరి.

               వేశ్యలపొందు కొరకు బాలకులను అమ్మివేసిరి.

               మద్యమును కొనిత్రాగుటకుగాను

               బాలికలను విక్రయించిరి.

తూరు, సీదోను, ఫిలిస్తీయుల నేరము

4. తూరు, సీదోను, ఫిలిస్తీయా దేశములారా! మీతో నాకు పనియేమి? మీరు  నాకు  ప్రతీకారము చేయనెంచుచున్నారా? నేను చేసినదానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా?

5. మీరు నా వెండి బంగారములను కొనిపోతిరి. అమూల్య మైన నా నిధులను మీ దేవళములలోనికి తీసికొని పోతిరి.

6. యూదా, యెరూషలేముజనులను వారి దేశమునుండి దూరముగా కొనిపోయి గ్రీకువారికి అమ్మివేసితిరి.

7. నేను మీరు అమ్మివేసిన తావులనుండి వారిని మరల కొనివత్తును. మీరు వారికి చేసిన కీడులనే నేను మీకును చేయుదును.

8. నేను మీ కుమారులను, కుమార్తెలను యూదావాసులకు అమ్మింతును. వారు వారిని దూరమున వసించు షెబా జాతికి అమ్మివేయు దురు. ఇది ప్రభుడనైన నా వాక్కు”.

జాతులకు పిలుపు

9.           అన్యజాతులకు ఇట్లు ప్రకటన చేయుడు:

               ”మీరు యుద్ధమునకు సన్నద్ధులు కండు.

               మీ యోధులను పిలువుడు.

               మీసైనికులను ప్రోగుచేసికొని పోరునకు నడువుడు.

10.         మీ నాగి కఱ్ఱులతో కత్తులను చేసికొనుడు.

               మీ కొడవళ్ళతో ఈటెలను చేసికొనుడు.

               దుర్భలుడు కూడ

               ‘నేను యోధుడను’ అనుకొనవలెను

11.           ఇరుగుపొరుగు జాతులప్రజలారా!

               మీరు శీఘ్రమేరండు, లోయలో ప్రోగుకండు.

               ప్రభూ! ఆ ప్రజలమీద పడుటకు

               నీ సైన్యమును పంపుము.

12.          జాతులు సిద్ధమై

               యెహోషాఫాత్తు               లోయకు రావలెను.

               ఇరుగుపొరుగు జాతుల జనులకు తీర్పుచెప్పుటకు

               ప్రభుడనైన నేను ధర్మపీఠమును అధిష్ఠింతును.

13.          ఆ జనులు మిగుల దుష్టులు గాన,

               పండినపంటనువలె వారిని

               కొడవళ్ళతో కోసివేయుడు.

               గాిలోని ద్రాక్షలవలె వారిని త్రొక్కివేయుడు.

               తొట్లు రసముతో నిండిపోవును.

14.          యెహోషాఫాత్తు లోయలో ప్రజలు

               గుంపులుగుంపులుగా ప్రోగైరి.

               అచట తీర్పురోజు ఆసన్నమైనది.

ప్రభుదినము

15.          సూర్యచంద్రులను చీకట్లు క్రమ్మును.

               తారలు కాంతినికోల్పోవును.

16.          ప్రభువు సియోనునుండి గర్జించుచున్నాడు.

               యెరూషలేమునుండి

               ఆయన కంఠధ్వని వినిపించుచున్నది.

               భూమ్యాకాశములు కంపించుచున్నవి.

               కాని ప్రభువు తన ప్రజలకు ఆశ్రయమగును.

               యిస్రాయేలీయులకు రక్షణదుర్గమగును.

17.          యిస్రాయేలీయులారా!  అపుడు

               మీరు నేను మీ దేవుడనని ప్రభుడనని గుర్తింతురు.

               నేను నా పవిత్ర నగరమైన సియోనున వసింతును.

               యెరూషలేము పవిత్రనగరమగును.

               అన్యజాతులు దానిని జయింపజాలవు.

యిస్రాయేలీయులకు బంగారు భవిష్యత్తు

18.          ఆ కాలము వచ్చినపుడు

               పర్వతములు ద్రాక్షతోటలతో నిండియుండును.

               కొండలు పశువులతో నిండియుండును.

               యూదానదులన్నియు నీితో నిండియుండును. దేవుని మందిరమునుండి,

               ఒకయేరు పారి షిత్తీములోయను తడుపును.

19.          ఐగుప్తు పాడువడును. ఎదోము ఎడారి అగును.

               ఆ దేశముల ప్రజలు యూదా మీదికి దాడిచేసి,

               నిర్దోషుల నెత్తురు నొలికించిరి.

20-21. నేను హతులైన వారి తరపున

               పగతీర్చుకొందును.

               దోషులను శిక్షింపకవదలను.

               కాని యూదాలో ప్రజలు సదా వసింతురు.

               యెరూషలేమున తరతరముల వరకు

               నరులు నివసింతురు.

               ప్రభుడనగు నేను సియోనున వాసము చేయుదును”.

Previous