చెలికత్తెలు
6 1. స్త్రీలలోకెల్ల సొగసైనదానా!
నీ ప్రియుడు ఎచికి వెళ్ళెను?
అతడేదారిన వెళ్ళెనో చెప్పుము.
అతనిని వెదకుటకు
మేము సాయపడుదుము.
ప్రియురాలు
2. నా ప్రియుడు సుగంధమూలికలు పెరుగు
తన వనమునకు వచ్చెను.
అతడు ఆ తోటలో తన మందను మేపును.
అచట లిల్లీపూలు కోయును.
3. నా ప్రియుడు నావాడు, నేను అతనిదానను.
అతడు లిల్లీపూల నడుమ తన మందను మేపును.
ఐదవ గీతము
ప్రియుడు
4. ప్రియమైన దానా!
నీవు తీర్సాపట్టణమువలె సుందరమైదానవు.
యెరూషలేము నగరమువలె సొగసైనదానవు.
బారులుతీరిన సైన్యమువలె
భయంకరమైనదానవు.
5. నీ నేత్రములు నన్ను బందీని చేయుచున్నవి.
వానిని నానుండి ప్రక్కకు త్రిప్పుకొనుము.
నీ కురులు గిలాదు కొండల మీదినుండి
క్రిందికి దుముకు మేకలమందలవలె ఉన్నవి.
6. నీ దంతములు, ఉన్ని కత్తిరించి కడిగి
శుభ్రము చేసిన గొఱ్ఱెపిల్లలవలెనున్నవి.
అవి అన్ని రెండు రెండుగా వరుసలుతీరి
పొందికగా అమరియున్నవి.
7. మేలిముసుగు మాటున దాగియున్న నీ చెక్కిళ్ళు
దానిమ్మ ఫలముల అర్థభాగములవలె ఉన్నవి.
8. రాణులు అరువదిమంది ఉండవచ్చును.
ఉపపత్నులు ఎనుబదిమంది ఉండవచ్చును.
యువతులు అసంఖ్యాకముగా ఉండవచ్చును.
9. కాని నా పావురము,
నా నిష్కళంక సుందరి, ఒక్కతెయే.
ఆమె తన తల్లికి ఏకైక కుమార్తె, గారాలప్టి.
యువతులెల్లరు ఆమెను చూచి
ధన్యురాలని స్తుతించిరి.
రాణులు, ఉపపత్నులు ఆమెను కీర్తించిరి.
10. ఉషస్సువలె చూపట్టుచు,
చంద్రబింబమువలె సుందరముగాను,
సూర్యబింబమువలె తేజోవంతముగాను
బారులుతీరిన సైన్యములవలె
భీకరముగానున్న ఈమె ఎవరు?
11. నేను బాదము తోటకు వెళ్ళితిని.
లోయలో ఎదుగు లేత మొక్కలను చూడబోతిని.
ద్రాక్షలు చిగురులు వేయుటను,
దానిమ్మలు పూతపట్టుటను చూడబోయితిని.
12. నేను గ్రహించుకొనక మునుపే
సారథి యుద్ధమునకు ఎట్లు ఉత్సహించునో,
నేనును ప్రేమకొరకు అటుల
ఉత్సహించునట్లు చేసితిని.
చెలికత్తెలు
13. షూలాము యువతీ!
వెనుదిరుగుము! వెనుదిరుగుము!
మేము నీ సౌందర్యమును చూడగోరెదము.
ప్రియుడు
షూలాము యువతి రెండు నాట్యబృందముల
మధ్య నాట్యమాడుచుండగా
మీరు ఆమెవైపు చూడనేల?