దానియేలు, అతని స్నేహితుల కథలు
నెబుకద్నెసరు ఆస్థానమున హీబ్రూ యువకులు
1 1. యెహోయాకీము యూదాను పరిపాలించిన కాలము మూడవయేట బబులోనియారాజగు నెబుకద్నెసరు యెరూషలేము మీదికివచ్చి దానిని ముట్టడించెను.
2. ప్రభువు యూదారాజు యెహో యాకీమును, దేవాలయములోని మిగిలియున్న ఉప కరణములను ఆ రాజు చేతికిఅప్పగించెను. అతడు వానిని బబులోనియాకు కొనిపోయి తాను కొలుచు దేవతల మందిరపు ఖజానాలో ఉంచెను.
3. ప్రవాసులుగా వచ్చిన యిస్రాయేలీయుల నుండి రాజవంశమునకును, ఉన్నత కుటుంబముల కును చెందిన యువకులను కొందరిని ఎన్నుకొమ్మని ఆ రాజు తన ప్రధానాధికారియైన ఆష్పెనసు అను నపుంసకుల అధిపతికి ఆజ్ఞఇచ్చెను.
4. వారికి అందమును, తెలివితేటలును, ప్రావీణ్యమును ఉండవలెను. శారీర కములైన లోపములుండరాదు. వారు మంచి శిక్షణ పొందవలెను. తరువాత వారు రాజునకు కొలువు కాండ్రుగా పనిచేయుదురు. ఆష్పెనసే వారికి బబులోనియా భాష, శాస్త్రములు నేర్పవలెను.
5. మరియు ఆ యువకులకు రాజ భవనమునుండియే భోజనము, ద్రాక్షసారాయము పంపవలెనని రాజు ఆజ్ఞాపించెను. ఈ రీతిగా వారు మూడేండ్లు తర్ఫీదు పొందిన పిమ్మట రాజునకు కొలువు చేయవలెను.
6. అట్లు ఎన్నికయిన యువకులలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజరయా అను వారుండిరి. వారెల్లరును యూదాతెగకు చెందినవారు.
7. ఆష్పెనసు దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షడ్రకు అనియు, మిషాయేలునకు మేషకు అనియు, అజరయాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను.
8. దానియేలు రాజభవనమునుండి వచ్చిన ఆహారపానీయములను స్వీకరించి తాను అపవిత్రుడు కారాదనియెంచెను.
9. కనుక అతడు తన్ను అపవిత్రత నుండి కాపాడుమని ఆష్పెనసును వేడుకొనెను. ప్రభువు ఆష్పెనసునకు అతనిపై దయసానుభూతి కలుగునట్లు చేసెను.
10. కాని ఆ అధికారి రాజునకు వెరచెను. కనుక అతడు దానియేలుతో ”మీరేమి భుజింపవలెనో ఏమి త్రాగవలెనో రాజే నిర్ణయించెను. మీరు ఇతర యువకులవలె పుష్టిగానుండనిచో అతడు నా తల తీయించును” అని చెప్పెను. 11. కనుక దానియేలు, ప్రధానాధికారి తనకును, తన ముగ్గురు మిత్రులకును సంరక్షకునిగా నియమించిన వాని యొద్దకుపోయి, 12. ”అయ్యా! నీవు మమ్ము పదిరోజులపాటు పరీ క్షించిచూడుము. మాకు భుజించుటకు శాకా హారము, త్రాగుటకు నీళ్ళు మాత్రమిమ్ము.
13. అటుపిమ్మట మమ్ము రాజభవనమునుండి వచ్చిన భోజనమును ఆరగించిన యువకులతో పోల్చి చూడుము. అప్పుడు నీవే నిర్ణయము చేసి మాపట్ల తగినట్లుగా వ్యవహ రింపుము” అనెను.
14. అతడు వారి పలుకులను అంగీకరించి పదిరోజులపాటు వారిని పరీక్షించి చూచెను.
15. ఆ గడువు కడచిన పిదప వారు రాజభో జనము ఆరగించిన యువకుల కంటె ఆరోగ్యముగను, బలముగను కనిపించిరి.
16. కనుక అప్పినుండి ఆ సంరక్షకుడు వారిని రాజభోజనమునకు బదులుగా శాకాహారమునే తినని చ్చెను.
17. దేవుడు ఆ నలుగురు యువకులకు భాష యందును, విజ్ఞానమందును తెలివిని, నైపుణ్యమును దయచేసెను. పైగా దానియేలునకు దర్శనములకును, స్వప్నములకును అర్థమును చెప్పు నేర్పునుగూడ ప్రసాదించెను.
18. రాజుప్టిెన గడువుముగిసిన తరువాత ఆష్పెనసు యువకులనందరిని నెబుకద్నెసరు సమక్ష మునకు కొనిపోయెను.
19. రాజు వారందరితో సంభాషించెను. కాని ఎల్లరిలోను దానియేలు, హనన్యా, మిషాయేలు, అజరియా మిన్నగానుండిరి. కనుక వారు రాజునకు సేవలు చేయనారంభించిరి.
20. రాజు ఏ విజ్ఞానవిషయమునడిగినను, ఏ సమస్య గూర్చి ప్రశ్నించి నను ఈ నలుగురు యువకులకు అతని రాజ్యము మొత్తములోని జ్యోతిష్కులకంటెను, మాంత్రికుల కంటెను పదిరెట్లు అదనముగా తెలిసియుండెను.
21. కోరెషు చక్రవర్తి బబులోనియాను పరిపాలించిన తొలి యేివరకు రాజు ఆస్థానముననే దానియేలు ఉండెను.