ఉపోద్ఘాతము:

పేరు, రచయిత మరియు కాలము: రాజులు మొది గ్రంథ వివరణ చూడుము.

చారిత్రక నేపథ్యము: యిస్రాయేలు యూదా రాజుల ఏలుబడిలో రాచరికాలు అంతకంతకు పతనావస్థకు చేరుకున్నాయి. అహాసు, మనష్యే రాజుల పాలనలో ఇది పరాకాష్టకు చేరినది. అసమర్థులు, అయోగ్యులైన పాలకులు, పాపభీతిలేని ప్రజలు తమకు తాము బానిసత్వాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ గ్రంథములో రాజులచరిత్ర కంటె ప్రవక్తల జీవిత విశేషాలు పాఠకులకు ప్రేరణగా వుండును.

ముఖ్యాంశములు: పూర్వనిబంధనలోని దైవిక అంశములు – మానవతప్పిదాలు, శిక్ష మరియు ఆశాభావము అనే భావాలు ఈ గ్రంథములో పుష్కలముగా కనబడును. పవిత్రత, దాని చుట్టు అల్లుకున్న ఆచార సాంప్రదాయాలు అనేకము ప్రస్ఫుటమగును. యెరూషలేము పట్టణప్రాముఖ్యత, దేవాలయస్థావరముగా యెరూషలేము అన్న అంశములను కూడా చూచెదము. మందసపెట్టెను పదిలపరచి, సుస్థిరము చేయడానికి దేవాలయనిర్మాణ బాధ్యత సొలోమోను రాజు చేపట్టగా,  యావే యెడల యిస్రాయేలు, యూదా రాజుల విశ్వాసరాహిత్యము, తత్ఫలితముగా వారి పతనాంశములు కూడా చోటు చేసుకున్నాయి. దేవుని ఓపిక, తీర్పులను చూచెదము.

క్రీస్తుకు అన్వయము: దేవుడు దావీదు రాజుతో చేసిన నిబంధన నెరవేరినది. యూద రాజ్యాన్ని దావీదు వంశీయులే పాలించిరి. దావీదు కుమారుడైన క్రీస్తు నిత్యరాజు. ఏలియా, ఎలీషా ప్రవక్తలు క్రీస్తు మెస్సయ ప్రేషిత కార్యాన్ని ప్రతిబింబిచెదరు.  ఏలీయా శుద్ధీకరణము బప్తిస్త యోహాను జ్ఞానస్నానాన్ని తలపిస్తుంది.