ఉపోద్ఘాతము:
పేరు: కొన్ని గ్రంథములకు ఆయా గ్రంథాలలోని కేంద్ర వ్యక్తుల పేర్లు పెట్టడము పరిపాి. ఎజ్రా గ్రంథ నామకరణములో జరిగినది కూడా అదియే. ఎజ్రా అనగా ”సహాయము”. ఎజ్రా యాజకుడు, గొప్ప నాయకుడు.
కాలము: క్రీ.పూ. 4వ శతాబ్దములో వ్రాయబడినది. ఈ గ్రంథములో క్రీ.పూ. 538-450 మధ్యకాలపు బబులోను ప్రవాసానంతర వృత్తాంతాలున్నాయి.
రచయిత: రాజుల దినచర్యలు రెండుగ్రంథములు వ్రాసిన లేవీయ యాజకుడే ఎజ్రా, నెహమ్యా గ్రంథాలను గూడ వ్రాసియుండునని పవిత్రగ్రంథ పండితుల అభిప్రాయము.
చారిత్రక నేపథ్యము: రాజుల దినచర్య రెండవగ్రంథము పర్షియా రాజు కోరేషు స్వచ్ఛంద సేవకులను యెరూషలేమునకు తిరిగి వెళ్ళవలసినదిగా కోరడంతో ముగియును. కొన్ని వేలమంది దైవప్రజలు యెరూషలేమునకు తిరిగివచ్చిరి. అయితే వారికి దేవాలయ పునర్నిర్మాణ విషయములో స్థానికులనుండి వ్యతిరేకత ఎదురైనది. అంతేకాదు వలసనుండి వెనుదిరిగి వచ్చిన వారిపై ఆరోపణలు, పుకార్లు లేవనెత్తారు. ఈ తరుణములో హగ్గయి, జెకర్యా ప్రవక్తలు వారిని ప్రోత్సహించిరి. చివరకు దర్యావేషు శాసనము ద్వారా వారికి సానుకూలత లభించెను.
ముఖ్యాంశములు: యూదులు యెరుషలేమునకు తిరిగిరావడము, దేవాలయాన్ని పునర్నిర్మించడము, యూదులకు వ్యతిరేకతలు, వాిని అధిగమించి విజయము సాధించడము, సెరూబ్బాబెలు, ఎజ్రాల నాయకత్వ వృత్తాంతాలు ఈ గ్రంథములోని అంశములు. యిస్రాయేలీయుల పునరాగమనము దేవుని కార్యము. యావే దేవుడు, ఐగుప్తు దేశమునందు వలె పర్షియా రాజుల చెరనుండి యూదులను స్వదేశానికి తిరిగి రప్పించెను. ఈ పనిని దేవుడు తన ప్రవక్తల ద్వారా నిర్వహించారు. దేవుని ప్రజలు స్వదేశం తిరిగిరావడంతో నిబంధన పునరుద్ధరించబడినది.
క్రీస్తుకు అన్వయము: దేవుని వాగ్ధానము నెరవేరడము ప్రధాన ఆధారము. యిస్రాయేలీయులు, యూదులు ప్రవాసము నుండి తిరిగి రావడము నూతన శకమునకు నాంది అయినది. అది రాబోయే క్రీస్తు యుగాన్ని సూచించును.