1. బలులు సంపూర్ణ దహనబలి
1. ప్రభువు మోషేను పిలిచి సమావేశపు గుడారమునుండి అతనితో ఇట్లు సంభాషించెను.
2. ”నీవు యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుము: మీలో ఎవడైనను ప్రభువునకు బలి సమర్పింపగోరినచో మీ మందలనుండి ఎడ్లనుగాని, పొట్టేళ్ళనుగాని, మేకపోతు లనుగాని అర్పింపవలయును.
3. ఎవడైనను మందనుండి ఎద్దును సంపూర్ణ దహనబలిగా అర్పింపగోరినయెడల అవలక్షణములు లేని దానిని కొనిరావలయును. అతడు ఎద్దును సమావేశపుగుడారపు ద్వారమువద్దకు కొనిరావల యును. ప్రభువు దానిని అంగీకరించును.
4. అతడు పశువు తలమీద చేతులు చాపవలయును. అప్పుడది అతని పాపములకు ప్రాయశ్చిత్తముచేయు బలిగా గణింపబడును.
5. అటుపిమ్మట అతడు ప్రభువు సమక్షమున ఎద్దును వధింపవలయును. అహరోను కుమారులైన యాజకులు దాని రక్తమును దేవునికి అర్పించి, సమావేశపుగుడారము ప్రవేశద్వారము చెంతనున్న బలిపీఠముచుట్టు దాని రక్తమును చిలు కరింతురు.
6. పిమ్మట అతడు ఎద్దుచర్మమును ఒలిచి దాని మాంసమును ముక్కలుగా కోయవలయును.
7. అహరోను కుమారులైన యాజకులు బలిపీఠము మీద అగ్నిని రగిల్చి వంటచెరకును పేర్చుదురు.
8. వారు ఎద్దుమాంసపు ముక్కలను, తలను, క్రొవ్వును బలిపీఠముపైనున్న నిప్పుమీద పెట్టుదురు.
9. బలిని అర్పించువాడు ఎద్దుప్రేవులను, కాళ్ళను నీిలో కడుగవలయును. యాజకులు దానిని సంపూర్ణముగా బలిపీఠముమీద కాల్చివేయుదురు. ఆ దహనబలి సువాసనవలన ప్రభువు సంతృప్తి చెందును.
10. కాని ఎవడైనను పొట్టేలునుగాని మేక పోతునుగాని, సంపూర్ణదహనబలిగా అర్పింపగోరి నపుడు అది అవలక్షణములు లేనిదై ఉండవలయును.
11. అతడు దానిని బలిపీఠమునకు ఉత్తరదిక్కున యావే సాన్నిధ్యమున దానిని వధింపవలయును. అహరోను కుమారులైన యాజకులు దాని రక్తమును బలిపీఠముచుట్టు చల్లుదురు.
12. తరువాత అతడు దానిని ముక్కలుగా కోయవలయును. యాజకుడు దాని మాంసపుముక్కలను, తలను, క్రొవ్వును బలి పీఠముపైనున్న అగ్నిమీద పెట్టును.
13. బలినర్పించు వాడు దాని ప్రేవులను కాళ్ళను నీిలో కడుగవల యును. యాజకుడు ఆ పశువును సంపూర్ణముగా బలిపీఠముమీద కాల్చివేయును. ఈ సంపూర్ణ దహన బలి సువాసనవలన ప్రభువు సంతుష్టిచెందును.
14. కాని ఎవడైనను పశువునకు బదులుగా పక్షిని సంపూర్ణదహనబలిగా అర్పింపగోరెనేని, తెల్ల గువ్వనుగాని, యువపావురమునుగాని సమర్పింప వలయును.
15. యాజకుడు దానిని బలిపీఠము చెంతకుకొనివచ్చి దాని తలనువిరిచి బలిపీఠముమీద దహింపవలయును. దాని నెత్తురును బలిపీఠముమీద పిండవలయును.
16. మరియు అతడు దాని ఈక లను, కడుపులోని మలమును1 తీసివేసి బలిపీఠము నకు తూర్పువైపున బూడిదను కుమ్మరించు తావున పారవేయవలయును.
17. యాజకుడు దాని రెక్కలను రెండుభాగములుగా చీల్చవలయును. కాని దానిని వేరుచేయరాదు. ఆ పిమ్మట దానిని బలిపీఠము పైనున్న అగ్నిమీద కాల్చివేయవలయును. ఈ సంపూర్ణ దహనబలి సువాసనవలన ప్రభువు సంతుష్టిచెందును.