ఉపోద్ఘాతము:

పేరు: మొది మక్కబీయుల వివరణ చూడుము.

కాలము: క్రీ.పూ. 129-104 లేదా క్రీ.పూ. 63కు ముందే వ్రాసివుండవచ్చునని అభిప్రాయము.ఈ గ్రంథములో క్రీ.పూ 180-161 మధ్యకాలపు వృత్తాంతములున్నాయి.

రచయిత: దీని రచయిత మొది గ్రంథమునకు భిన్నమైన వాడుగా కనబడతాడు (2:19-32; 15:37-39).  ఇందు మక్కబీయుని గూర్చి, అతని సోదరుల గూర్చి, యెరుషలేము దేవాలయమును శుద్ధిచేసి దాని పీఠమును ప్రతిష్టించిన వృత్తాంతాలను  గూర్చి ఐదు గ్రంథములలోని అంశములను క్లుప్తీకరించెను. గ్రీకు భాషలో వ్రాసెను. దీనిని మక్కబీయులు మొది గ్రంథానికి కొనసాగింపుగ భావింపరాదు.

చారిత్రక నేపథ్యము: మొది మక్కబీయుల గ్రంథము యూదులు ప్రవాస కాలము అనంతరము ఎదుర్కొన్న వ్యతిరేకతలు, బాధల గూర్చి వివరించగా, ఈ గ్రంథము వారిమధ్య జరిగిన కొన్ని సంఘటనలు, విశేషాల గూర్చి వివరించును. యూదుల చరిత్రలోని ముఖ్య నాయకులను గూర్చి ప్రస్తావించి ప్రస్తుత ప్రజలలో నమ్మకము, ఆశ నెలకొల్పి వారిని ఉత్తేజితులను చేయ ప్రయత్నించును. అందువలన ఈ గ్రంథములో చారిత్రక సంఘటనలకు బదులు ఉపదేశాలు ఎక్కువగా కనపడతాయి (2:25; 15:39; 4:38; 5:17-20; 6:12-17; 9:28; 13:8). ఈ ఉపదేశాల రచనలు ప్రజలలో సానుభూతి విం స్పందనలు కలిగించాయి. విశ్వాసము కొరకు ప్రాణాలర్పించిన వీర గాథలున్నాయి (6:10-7:42; 14:37-4). మూర్ఖుడైన రాజు మరణము గూర్చి కూడా తెలుసుకొనగలము (9:5-28) .         

ముఖ్యాంశములు: పై సంఘటనలతో పాటు ఈ గ్రంథము ముఖ్యముగా దేవాలయ పవిత్రత గూర్చి ఎక్కువగా వివరించుతుంది. దేవుడు తన ఆలయాన్ని యూదా నాయకత్వములో కాపాడుకున్నారు. ఏడుగురు సోదరుల ప్రాణత్యాగము ఇతివృత్తాంతములో దేవుని విశ్వసించువారు మరణానంతరము ఉత్థాన జీవితము కలదనియు (7:1-38), మృతులకొరకు ప్రార్ధించుట అనునది భక్తివంతమును, పవిత్రమునైన విషయము అని తెలుపును (12:43-45).

క్రీస్తుకు అన్వయము: దేవుని ఆలయాన్ని అగౌరవపరచిన వారందరు శిక్షకు గురైరి. క్రీస్తు దేవుని ఆలయము (యోహాను 2:13-25). విశ్వాసము నిమిత్తము ప్రాణత్యాగము చేసిన వారి రక్తము సంఘ అంకుర్పారణమునకు దోహదపడుతుంది. క్రీస్తు తన్నుతాను సంపూర్ణముగా అర్పించుకొనెను.  దేవుని ఆజ్ఞను ఆచరించు వారు దీవెనలు పొందుదురు (2 మక్కబీ. 8:27;15:1-4).  కాని  దేవుని  ధిక్కరించి,  అగౌరవపరచువారు  శిక్షకు గురవుదురు (12:6).