యూదులు రాజు మన్నన పొందుట
14(8) 1. ఆ దినమే రాజు యూదుల హింస కుడు హామాను ఆస్తిపాస్తులను ఎస్తేరు వశము చేసెను. ఎస్తేరు మొర్దెకయి తనకు దగ్గరిచుట్టమని తెలుపగా అతడు రాజు సమ్ముఖమునకు రాగలిగెను.
2. రాజు తాను హామానునుండి గైకొనిన ముద్రాంగుళీయ కమును తీసి మొర్దెకయికి ఇచ్చెను. హామాను ఆస్తి పాస్తులకు ఎస్తేరు మొర్దెకయిని అధికారిగా నియ మించెను.
3. అంతట ఎస్తేరు రాజు పాదములపై వ్రాలి కన్నీరుకార్చుచు అతనికి మరల విన్నపము చేసెను. అగాగు వంశజుడు హామాను యూదులను నాశనము చేయుటకుగాను పన్నినపన్నాగమును తొలగింపుమని వేడుకొనెను.
4. రాజు తన బంగారుదండము నెత్తి ఎస్తేరు వైపు చూపగా ఆమె లేచి అతని ఎదుట నిలు చుండి, 5. ”నేను ప్రభువులవారి అనుగ్రహమునకు నోచుకొింనేని, నేను తమకు ప్రీతికలిగింతునేని, నా మనవి తమకు ఉచితముగా తోచెనేని ఏలినవారు హామాను పంపించిన తాకీదులను రద్దు చేయింపుడు. హమ్మెదాతా కుమారుడు అగాగు వంశజుడు హామాను మన సామ్రాజ్యమున వసించు యూదులందరిని వధింపవలెనని లేఖలు పంపెను గదా!
6. మా ప్రజలు ఈ శిక్షకు గురియైనచో నేనెట్లు భరింపగలను? మా బంధువులు నాశనమైనచో నేనెట్లు సహింప గలను?” అని మనవి చేసెను.
7. అహష్వేరోషు ఎస్తేరు రాణితోను, మొర్దెకయి తోను, ”యూదులమీద కుట్రపన్నినందులకుగాను హామానును ఉరితీయించితిని. ఎస్తేరూ! అతని ఆస్తి పాస్తులను నీ స్వాధీనము చేసితిని.
8. రాజుపేరు తోను, రాజముద్రతోను అమలుపరచిన శాసనములను రద్దుచేయుట ఎవరికిని సాధ్యముకాదు. అయినను మీరు మీకు ఉచితములని తోచిన సంగతులను యూదులకు వ్రాయవచ్చును. ఆ లేఖను నా పేర వ్రాసి నా ముద్రతో ముద్రింపవచ్చును” అని చెప్పెను.
9. సివాను అను మూడవనెలలో ఇరువదిమూడవ దినమున ఈ సంగతి జరిగెను. మొర్దెకయి రాజ లేఖకులను పిలిపించి వారిచేత హిందూదేశమునుండి కూషు వరకు వ్యాపించియున్న నూటఇరువది యేడు సంస్ధానముల అధిపతులకును, అధికారులకును ఉద్యో గులకును లేఖలు వ్రాయించెను. ఒక్కొక్క రాష్ట్రమునకు దానిభాషలోను, లిపిలోను వ్రాయించెను. అటులనే యూదులకు వ్రాసిన లేఖలను వారి భాషలోను లిపి లోను లిఖించిరి.
10. లేఖలనెల్ల రాజుపేర వ్రాయించి అతని ముద్రతో ముద్రించిరి. వార్తావహులు రాజు అశ్వశాలనుండి కొనివచ్చిన బీజాశ్వములపై నెక్కి ఆ జాబులను వివిధ రాష్ట్రములకు కొనిపోయిరి.
11. ఆ లేఖలలో రాజు యూదులకిచ్చిన అనుమతులివి: ఏ పట్టణమున వసించు యూదులైనను ఆత్మ సంరక్ష ణార్ధము తమలో తాము ఏకముకావచ్చును. ఏ సంస్థా నముననైనను, ఏ జాతివారైనను సాయుధులై వచ్చి యూదులమీద పడుదురేని, యూదులు వారితో పోరాడి వారిని సర్వనాశనము చేయవచ్చును. వారి భార్యలను, పిల్లలను గూడ మట్టుప్టిె వారి ఆస్తిపాస్తులను స్వాధీ నము చేసికోవచ్చును.
12. యూదులకు మరణశిక్ష ప్రాప్తింపబోవు దినముననే, అనగా అదారు అను పండ్రెండవ నెల పదుమూడవ దినముననే, ఈ శాసన ముకూడ అహష్వేరోషు రాజు రాజ్యము నలుమూలల అమలులోనికి వచ్చునని తెలియజేయబడెను.