అమస్యా పరిపాలన

25 1. అమస్యా తన యిరువది ఐదవయేట రాజై యిరువదితొమ్మిదేండ్లపాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను. అతని తల్లి యెరూషలేమునకు  చెందిన యెహోఅద్దాను.

2. అతడు ప్రభువునకు నచ్చిన రీతినే ప్రవర్తించెను కాని పూర్ణహృదయముతో మాత్రముకాదు.

3. అమస్యా తన ఆధిపత్యమును సుస్థిరము చేసికొనగనే తన తండ్రిని చంపిన ఉద్యోగు లను తెగార్చెను.

4. అయినను వారి తనయులను మాత్రము వధింపలేదు. అతడు ప్రభువు మోషే ధర్మ శాస్త్రమున విధించిన ఈ క్రింది ఆజ్ఞను పాించెను: ”కుమారుల పాపములకు తండ్రులనుగాని, తండ్రుల పాపములకు కుమారులనుగాని వధింపరాదు. ప్రతి వ్యక్తి తన పాపములకు తానే చావవలెను.”

5. అమస్యా యూదీయులను, బెన్యామీనీయు లను వారివారి తెగల ప్రకారము దళములుగా విభజించెను. వేయిమంది నూరుమందిగల దళము లకు సైన్యాధిపతులను నియమించెను. అతడు ఇరువది యేండ్లు లేక అంతకు పైబడిన వయస్సుకలవారి నెల్లరిని లెక్కించి చూడగా మూడులక్షల మంది తేలిరి. వారెల్లరును యుద్ధము చేయగలవారు. ఈటెలను డాళ్ళను ఉపయోగింపగలవారు.

6. ఇంకను అతడు రెండువందల మణుగుల వెండిని వెచ్చించి యిస్రా యేలీయుల నుండి లక్షమంది వీరులను బాడుగకు కుదుర్చుకొనెను.

7. అప్పుడు ప్రవక్త ఒకడు రాజు చెంతకు వచ్చి ”నీవు ఈ యిస్రాయేలు సైన్యమును పోరునకు కొనిపోవలదు. ప్రభువు యిస్రాయేలువారైన ఎఫ్రాయీమీయులలో ఎవరికిని తోడ్పడడు.

8. వారు నీ వెంటవత్తురేని నీవెంతబలముతో పోరాడిన ప్రభువు నిన్ను ఓడించితీరును. విజయమునకును, పరాజయ మునకును గూడ ఆయనే కర్తకదా!” అని చెప్పెను.

9. అమస్యా ”మరి నేను యిస్రాయేలు సైనికులకొరకు వెచ్చించిన రెండు వందల మణుగుల వెండిని నష్ట పోవలసినదేనా?” అని ప్రశ్నించెను. ప్రవక్త ”ప్రభువు నీకు అంతకంటె ఎక్కువ  లాభమునే చేకూర్చిపెట్టును” అనెను.

10. కనుక అమస్యా యిస్రాయేలీయుల  నుండి బాడుగకు కుదుర్చుకొనిన సైన్యములనెల్ల వెనుకకు పంపివేసెను. వారు యూదీయులమీద పండ్లు కొరుకుచు వెళ్ళిపోయిరి.

ఎదోము విజయము, అమస్యా దుష్టవర్తనము

11. అమస్యా ధైర్యము తెచ్చుకొని తన సైన్య మును ఉప్పులోయకు నడిపించుకొనిపోయెను. అచట యూదీయులు ఎదోమీయులను పదివేలమందిని మట్టుప్టిెరి.

12. మరియొక పదివేలమందిని బందీలనుగాచేసి కొండశిఖరమునకు కొనిపోయి క్రిందికి త్రోయగా ఎల్లరును తుత్తునియలైరి.

13. ఇంతలో అమస్యా తనవెంట రానీయక వెనుకకు పంపిన యిస్రాయేలుసైన్యము, సమరియా బేత్‌హోరోను నగరముల మధ్యగల యూదియా నగరములపై దాడి చేసెను. ఆ దండు యూదీయులను మూడువేల మందిని చంపి కొల్లసొమ్మును విస్తారముగా ప్రోగుజేసి కొని పోయెను.

14. అమస్యా ఎదోమీయులను జయించి తిరిగి వచ్చునప్పుడు వారి విగ్రహములను కొని వచ్చెను. ఆ బొమ్మలను తనకు దేవతలగా చేసికొని ఆరాధన చెల్లించెను. వానిముందట సాంబ్రాణి పొగ వేసెను.

15. ప్రభువు అమస్యా మీద మండిపడి అతని యొద్దకు ఒక ప్రవక్తను పంపెను. ఆ ప్రవక్త ”ఈ దేవతలు తమను కొలుచు ప్రజలనే నీ బారినుండి కాపాడలేరైరి. అి్ట వారిని నీవు కొలువవచ్చునా?” అని అడిగెను.

16. అమస్యా అతని మాటలకు అడ్డువచ్చి ”ఓయి! నిన్ను రాజునకు సలహాదారునిగా నియమించితిమా యేమి? ఇంతితో నోరు మూసి కొనుము. లేదేని నీకు చావు మూడినట్లే” అనెను.

ఆ ప్రవక్త కొంచెమాగి ”నీవ్టి పనులకు పాల్పడి తివి. ఇప్పుడు నా హెచ్చరికనుగూడ పెడచెవిని ప్టిెతివి. కనుక ప్రభువు నిన్ను నాశనము చేయ నెంచెనని నేను గ్రహించితిని” అని పలికెను.

బేత్షేమేషు వద్ద ఓటమి

17. అమస్యా తన సలహాదారులతో సంప్రదించి యిస్రాయేలు రాజైన యెహూ మనుమడును, యెహోవాహాసు కుమారుడైన యోవాషును యుద్ధము నకు సవాలుచేయుచు వార్తపంపెను.

18. కాని యోవాషు అమస్యాకు ఈ క్రింది వార్తపంపెను. ”లెబానోను కొండలలోని ముండ్లపొద ఒకి నీ కుమార్తెను నా కుమారునకిచ్చి పెండ్లిచేయుమని అచి దేవదారునకు కబురు పంపెను. కాని ఆ కొండలలోని వన్యమృగము ఒకి అటుపోవుచు  ఆ  ముండ్లపొదను తన కాళ్ళతో అణగత్రొక్కెను.

19. నీవు ఎదోమీయు లను ఓడించితిని గదాయని విఱ్ఱవీగుచున్నావు. నీవు నీ ఇంిపట్టుననే పడియుండుటమేలు. నాతో చెలగాట మాడితివా నీకును, నీ ప్రజలకును ముప్పుతప్పదు.”

20. అయినను అమస్యా యోవాషు మాట వినడయ్యెను. అతడు ఎదోము దేవత నారాధించెను కనుక ప్రభువు అతనిని శత్రువుల వశము చేయించెను.

21. కనుక యూదారాజైన అమస్యా, యిస్రాయేలు రాజైన యోవాషు యూదాలోని బేత్‌షేమేషు వద్ద పోరునకు తలపడిరి.

22. ఆ పోరాటమున యిస్రాయేలీ యులు యూదీయులనోడింపగా వారు తమ నివాసము లకు పారిపోయిరి. 23. యోవాషు అమస్యాను బంధించి యెరూషలేమునకు కొనిపోయెను. అతడు నగరప్రాకారమును ఎఫ్రాయీము ద్వారము నుండి మూలద్వారమువరకు రెండు వందల గజములవరకు పడగ్టొించెను.

24. దేవళమునుండి వెండి బంగార ములను గైకొనెను. ఓబేదెదోము మరియు ప్రాసాద కోశాధికారుల అధీనముననున్న దేవాలయసామగ్రిని తీసికొనెను. వానినెల్ల కొల్లసొమ్ముగా సమరియాకు కొనిపోయెను. పైపెచ్చు యూదీయులను కొందరిని బందీలనుగాగూడ కొనిపోయెను.

అమస్యా పరిపాలనాంతము

25. అమస్యా, యిస్రాయేలు రాజైన యోవాషు గతించిన పిమ్మట పదునైదేండ్లు జీవించెను.

26. అతడు తన పరిపాలన కాలము మొదినుండి తుది వరకును చేసిన ఇతర కార్యములెల్ల యూదా, యిస్రా యేలు రాజులచరితమున లిఖింపబడియేయున్నవి.

27. ఆ రాజు ప్రభువును విడనాడిన తరువాత కొంత కాలమునకు యెరూషలేమున కొందరు అతనిమీద కుట్రపన్నిరి. అమస్యా లాకీషు నగరమునకు పారి పోయెను. కాని శత్రువులు అతనిని వెన్నాడిరి. ఆ నగరముననే అతనిని పట్టుకొని చంపివేసిరి.

28. అతని శవమును గుఱ్ఱముపై యెరూషలేమునకు కొనివచ్చి దావీదునగరమున రాజసమాధులలో పాతిప్టిెరి.