11 1.        తప్పుడు తూనికలను

                              ప్రభువు అసహ్యించుకొనును.

                              నిండుతూనికలవలన

                              ఆయన ప్రమోదము చెందును.

2.           పొగరుబోతునకు అవమానము తప్పదు.

               వినయవంతునకు విజ్ఞానము అలవడును.

3.           సత్య సంధులను సత్యమే నడిపించును.

               మోసగాండ్రను మోసమే నాశనము చేయును.

4.           మరణము ఆసన్నమైనపుడు

               సంపదలు రక్షింపలేవు.

               కాని సత్యనిష్ఠవలన

               మృత్యువునుండి తప్పుకోవచ్చును. 

5.           సజ్జనుని ధర్మనిష్ఠ

               అతని మార్గమును సుగమము చేయును.

               కాని దుష్టుడు తన దౌష్ట్యమువలననే కూలిపోవును

6.           సత్పురుషుని సచ్ఛీలమతడిని

               ఆపదలనుండి కాపాడును.

               కాని మోసగాడు 

               తన  దుర్వాంఛలవలననే బంధితుడు అగును.

7.            దుర్మార్గుని ఆశలు

               అతని మరణముతోనే అంతరించును.

               దుష్టుని కోరికలు ఫలింపజాలవు.

8.           పుణ్యజనుడు కష్టములను తప్పించుకొనును.

               కాని యిక్కట్టులు దుష్టునిమెడకు చుట్టుకొనును.

9.           దుష్టుడు తన మాటలద్వారా

               తోడివారిని నాశనము చేయును.

               కాని సజ్జనుడు తన విజ్ఞానముద్వారా

               పొరుగువారిని రక్షించును.

10.         సత్యసంధుడు వృద్ధిలోనికి వచ్చినపుడు

               నగరము సంతసించును.

               దుర్మార్గుడు నశించినపుడు

               ప్రజలు ఆనందింతురు.   

11.           సత్పురుషుని దీవెనలుపొంది

               నగరము వృద్ధిచెందును.

               కాని దుర్మార్గుని మాటలవలన

               పట్టణము పాడగును.

12.          ఇతరులను చులకనచేయుట అవివేకి లక్షణము.

               విజ్ఞతకలవాడు మౌనము వహించును.

13.          కొండెగాడు రహస్యములను వెల్లడిచేయును.

               కాని నమ్మదగినవాడు

               రహస్యములను దాచియుంచును.

14.          హితోపదేశములేని ప్రజలు నశింతురు.

               పెక్కుమంది హితోపదేశకులున్నచో

               భద్రత కల్గును.

15.          ఇతరులకు హామీగా ఉండువాడు

               దుఃఖము పాలగును

               అన్యులకు పూచీపడని వానికి చీకుచింతలేదు.

16.          నెనరుగల స్త్రీ ఘనతను తెచ్చుకొనును.

               కాని బలిష్ఠుడు ఐశ్వర్యమును సంపాదించుకొనును

17.          దయాపరుడు తనకుతానే మేలు చేసికొనును.

               కాని క్రూరుడు తనకుతానే కీడు చేసికొనును.

18.          దుష్టుడు గడించు సొత్తు మోసకరము.

               ధర్మమను విత్తనసేద్యము చేయువాడు

               సత్ఫలితమును పొందును.

19. ధర్మాత్ముడు జీవమును బడయును.

               దుష్టాత్ముడు చావును కొనితెచ్చుకొనును.

20.        ప్రభువు దుష్టవర్తనులను అసహ్యించుకొనును.

               కాని ఆయన సద్వర్తనులను ప్రీతితో చూచును.

21.          దుష్టునికి శిక్ష తప్పదనుట పరమసత్యము.

               కాని సజ్జనుడు శిక్షను తప్పించుకొనును.

22.        వివేకములేని సుందరమైన స్త్రీ

               పందిముక్కుకు ఉన్న బంగారుకమ్మివింది.

23.        మంచివాని కోరికలు మంచినే చేకూర్చిపెట్టును.

               కాని దుష్టుల కార్యములు వమ్మగును.

24.         కొన్నిమారులు ఉదారముగా

               ఖర్చు చేయువాని సంపదలు పెరుగును,

               మితముగా ఖర్చు చేయువాని సంపదలు తరుగును.

25.        ఉదారముగా నిచ్చువాడు వృద్ధిచెందును,

               నీళ్ళు పోయువానికి దేవుడు నీళ్ళు పోయును.

26.        ధాన్యమును నిల్వచేయువానిని జనులు శపింతురు

               దానిని పదిమందికి అమ్మువానిని

               నరులు దీవింతురు.

27.         మంచికి పూనుకొనువానికి

               దేవుని అనుగ్రహము లభించును.

               చెడును పూనుకొనువానికి

               ఆ చెడుయే దాపురించును.

28. తమ కలిమిని నమ్ముకొనువారు

               పండుాకువలె రాలిపోవుదురు.

               కాని సజ్జనులు పచ్చని ఆకువలె పెంపుచెందుదురు

29.        దూబారా ఖర్చులతో సంసారమును

               నాశనము చేసికొనువానికి ఏమియు మిగులదు.

               అవివేకి జ్ఞానికి దాసుడు అగును.

30.        ధర్మవర్తనము అను ఫలమునుండి

               జీవవృక్షము ఎదుగును.

               కాని జ్ఞానము కలవారు ఇతరులను రక్షించుదురు.

31.          నీతిమంతులకు ఈ లోకముననే

               ప్రతిఫలము లభించును.

               దుష్టులు, పాపకర్ములు మరి నిశ్చయముగా

               ప్రతిఫలము పొందుదురుకదా?