యోహాను బోధ

(మార్కు 1:2-8; లూకా 3:1-20; యోహాను 1:19-28)

3 1. ఆ రోజులలో స్నాపకుడగు యోహాను యూదయా దేశపు ఎడారిలో బోధించుచు, 2. ”పరలోకరాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు” అని పలికెను.

3. ” ‘ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు’ అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను” అని ఈ యోహానును గూర్చియే యెషయా ప్రవక్త పలికెను.

4. అతడు ఒంటె రోమముల కంబళిధరించి, నడుమునకు  తోలుపట్టెనుకట్టి,  మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను.

5. యెరూషలేమునుండియు, యూదయా అంతట నుండియు, యోర్దాను నదీపరిసరప్రదేశముల నుండియు ప్రజలు  అతనిని దర్శింపవచ్చిరి.

6. వారు తమతమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మము పొందుచుండిరి.

7. తనవద్ద బప్తిస్మము పొందుటకు పరిసయ్యులు,1 సద్దూకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో ”ఓ సర్పసంతానమా! రానున్న కోపాగ్నినుండి పారిపొమ్మని మిమ్ము హెచ్చరించినదెవరు?

8. మీరిక హృదయపరివర్తనమునకు తగిన పనులుచేయుడు.

9. ‘అబ్రహాము మా తండ్రి’ అని మీరు గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ళనుండి సైతము అబ్రహామునకు సంతానమును కలుగజేయగలడు.

10. వృక్షములను వేళ్ళతోసహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా నున్నది. కనుక మంచి పండ్లనీయని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును.

11. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో స్నానము చేయించుచున్నాను. కాని, నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోను, అగ్నితోను స్నానము చేయించును. ఆయన నా కంటె శక్తిమంతుడు. నేను ఆయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడను కాను.

12. తూర్పారబట్టుటకు ఆయన చేతియందు చేట సిద్ధముగానున్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను  గిడ్డంగులయందు  భద్రపరచి, పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును” అనెను.

యోర్దాను నదిలో యేసు బప్తిస్మము పొందుట

(మార్కు 1:9-11; లూకా 3:21-22; యోహాను:1:29-34)

13. అపుడు యేసు గలిలీయసీమనుండి యోర్దాను తీరముననున్న యోహానువద్ద బప్తిస్మము పొందుటకై వచ్చెను.

14. యోహాను యేసును వారించుచు, ”నేనే నీచేత బప్తిస్మము పొందవలసినవాడను. అట్టినా యొద్దకు నీవు వచ్చుటయా?” అనెను.

15. అందుకు యేసు ”ఇపుడిట్లే జరుగనిమ్ము. దేవుని సంకల్పమును అంతటినిమనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము” అని  సమాధానమీయగా  యోహాను అంగీకరించెను.

16. యేసు బప్తిస్మముపొంది నీటినుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో! ఆకాశము తెరువ బడగా దేవునిఆత్మ పావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుటను చూచెను.

17. అప్పుడు ఆకాశమునుండి ఒక దివ్యవాణి ”ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను” అని వినిపించెను.