అన్యజాతులకు ప్రతికూలముగా ప్రవచనములు
అమ్మోనీయులు
25 1. ప్రభువు వాణి నాతో ఇట్లనెను: 2. ”నర పుత్రుడా! నీవు అమ్మోనీయులను ఖండింపుము. వారితో ఇట్లు చెప్పుము.
3. మీరు యావే ప్రభువు పలుకులాలింపుడు. ఆయన ఇట్లు నుడువుచున్నాడు. ‘ఆహా’ మీరు నా మందిరము అపవిత్రమగుట జూచి సంతోషించితిరి.
4. యిస్రాయేలు దేశము నాశన మగుటను జూచి ఆనందించితిరి. యూదా ప్రజలు ప్రవాసమునకు బోవుటను జూచి సంతసించితిరి. ఇందుకుగాను నేను మిమ్ము తూర్పు ఎడారినుండి వచ్చిన జాతులకు అప్పగింతును. వారు మీ దేశమున గుడారములు పన్నుకొని స్థిరపడుదురు. మీ దేశమున పండిన పండ్లను భుజించి మీ పాలను త్రాగుదురు.
5. నేను రబ్బా నగరమును ఒంటెలదొడ్డిని చేయుదును. అమ్మోను దేశమంతిని గొఱ్ఱెలదొడ్డిని చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గుర్తింతురు.
6. యావే ప్రభువిట్లు నుడువుచున్నాడు: మీరు చేతులుత్టి ఆనందముతో ఎగిరి గంతులువేసితిరి. యిస్రాయేలు దేశమును చిన్నచూపు చూచితిరి.
7. కావున నేను మిమ్ము అన్యజాతుల కప్పగింతును. వారు మీ సొత్తును దోచుకొందురు. మీరిక ఒక జాతిగా మన జాలరు. నేను మీ దేశమును నాశనము చేసి మిమ్ము అడపొడ కానరాకుండ చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గుర్తింతురు.
మోవాబు
8. యావే ప్రభువు ఇట్లనెను: యూదాకూడ ఇతర జాతులవిందేనని మోవాబు పలికెను.
9. కనుక నేను మోవాబు సరిహద్దులను కాపాడు నగరములను శత్రువులముట్టడికి గురిచేయుదును. సుప్రసిద్ధ పట్టణ ములగు బెత్యేషిమోతు, బాల్మెయోను, కిర్యతాయిము ముట్టడికి లొంగును.
10. నేను తూర్పు ఎడారినుండి వచ్చిన జాతులు మోవాబును, అమ్మోనును జయించు నట్లు చేయుదును. ఆ మీదట మోవాబు ఒక జాతిగా మనజాలదు.
11. నేను దానిని శిక్షింతును. అప్పుడు మోవాబీయులు నేను ప్రభుడనని గుర్తింతురు.
ఎదోము
12. యావే ప్రభువు ఇట్లనెను: ఎదోము యూదా మీద పగతీర్చుకొని ఘోరమైన అపరాధము చేసెను.
13. కావున నేను ఎదోమును దండింతును. ఆ దేశమునందలి నరులను, పశువులను చంపుదును. తేమా నుండి దెదాము వరకు ఆ దేశమును ఎడారి కావింతును. అందలి జనులు పోరున చత్తురు.
14. నేను నా ప్రజలైన యిస్రాయేలీయుల ద్వారా వారిపై పగతీర్చుకొందును. ఎదోమీయులు నా కోపమును చవిజూచునట్లు చేయుదురు. అప్పుడు వారు నా ప్రతీకారమును అర్థము చేసికొందురు. ఇది యావే ప్రభువు వాక్కు.
ఫిలిస్తీయా
15. యావే ప్రభువిట్లనెను: ఫిలిస్తీయులు తమ చిరకాలవిరోధులపై క్రూరముగా పగ తీర్చుకొనిరి. ద్వేషభావముతో వారిని నాశనము చేసిరి.
16. కావున నేను ఫిలిస్తీయా మీదికిపోయి వారిని రూపుమాపు దునని ప్రకించుచున్నాను. ఆ దేశమున మిగిలియున్న వారినిగూడ తుదమ్టుింతును.
17. ఘోరదండన ముతో వారికెల్లరికిని ప్రతీకారము చేయుదును. వారు నా ఆగ్రహమును చవిజూతురు. అప్పుడు వారు నేను ప్రభుడనని గ్రహింతురు.”