ధనము, ప్రగల్భములు
5 1. నీవు ధనము మీద ఆధారపడకుము.
డబ్బుతో ”నాకు అన్ని కలవని”
తలపకుము.
2. నీవు కోరుకొనినదెల్ల సంపాదించు
యత్నము చేయకుము.
నీ హృదయ వాంఛల ప్రకారము ప్రవర్తింపకుము
3. నీ మీద ఎవరికిని అధికారము లేదని ఎంచకుము.
అట్లు ఎంచెదవేని ప్రభువు నిన్ను శిక్షించును.
4. నేను పాపము చేసినా శిక్ష పడలేదుకదా
అనుకొనకుము.
ప్రభువు దీర్ఘకాలము సహించి ఊరకుండును.
5. దేవుడు క్షమింపకపోడులే అని ఎంచి పాపము మీద పాపము మూటగట్టుకోవలదు.
6. ”ప్రభువు మహాకృప గలవాడు కనుక
నేనెన్ని పాపములు చేసినను క్షమించునులే”
అని తలపకుము.
ఆయన కృపను, కోపమునుగూడ ప్రదర్శించును.
పాపులను కఠినముగా దండించును.
7. కనుక నీవు రోజుల తరబడి జాప్యము చేయక శీఘ్రమే దేవునియొద్దకు మరలిరమ్ము.
ప్రభువు కోపాగ్ని నీ మీద దిడీలున
రగుల్కొనవచ్చును.
అప్పుడు ఆయన శిక్షవలన
నీవు సర్వనాశనమయ్యెదవు.
8. అన్యాయార్జితమైన ధనమును నమ్మకుము.
నాశనము సంభవించినపుడు
అది నిన్ను కాపాడలేదు.
ఋజువర్తనము, సంయమనము
9. ప్రతిగాలికి తూర్పార పట్టవద్దు.
ప్రతి త్రోవ త్రొక్కవద్దు.
చిత్తశుద్ధిలేని పాపులకు అది చెల్లును.
10. నీవు నమ్మినదానికి కట్టువడి ఉండుము.
నీ పలుకులలో నిజాయితి చూపెట్టుము.
11. ఇతరులు మాటలాడినపుడు జాగ్రత్తగా వినుము. కాని నిదానముగా ఆలోచించి
జవాబు చెప్పుము.
12. నీకు తెలిసినేని బదులు చెప్పుము.
లేదేని మౌనము వహింపుము.
13. నీ మాటల వలననే నీకు ఖ్యాతియు,
అపఖ్యాతియు కలుగును.
నీ నాలుక వలననే నీవు నాశనము తెచ్చుకొందువు
14. నీవు చాడీలు చెప్పుటలో దిట్టవనిపించుకోవలదు.
నీ నాలుకతో ఉచ్చులు పన్నవద్దు.
దొంగలు అవమానమునకు గురియైనట్లే,
అసత్యవాదులు తీవ్రనిందకు పాత్రులగుదురు.
15. పెద్దతప్పులను, చిన్నతప్పులనుకూడ
మానుకొనుము.