మంచిరోజులను గూర్చిన
మరొక ప్రమాణము
33 1. నేనింకను ప్రాసాదావరణమునందలి చెరయందే యుండగా, ప్రభువు మరల నాకు తన వాక్కునిట్లు వినిపించెను: 2. ”భూమిని సృజించిన వాడు, దానిని రూపొందించి స్థిరముగా నెలకొల్పిన వాడు, ప్రభువు అను నామమున నొప్పువాడు ఇట్లు అనుచున్నాడు: 3. నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును. నీ వెరుగని మహాసత్యములను, అద్భుత విషయములను నీకు తెలియచేయుదును.
4. కొందరు కల్దీయులతో పోరాడుదురు. కాని శత్రువులు గృహములను శవములతో నింపుదురు. ఆ చచ్చిన వారు నేను ఆగ్రహముతో సంహరించినవారే. ఈ నగరవాసులు చేసిన దుష్కార్యములకుగాను నేను ఈ పట్టణము నుండి నా మొగమును ప్రక్కకు త్రిప్పు కొింని.
5. ముట్టడిదిబ్బలచేతను మరియు ఖడ్గముల చేతను యెరూషలేములో నేలమట్టము కావించబడిన గృహములను, రాజనగరులను గురించి యిస్రాయేలు దేవుడను, ప్రభుడనైన నేను చెప్పునదేమనగా,
6. నేను ఈ నగరమునకును దాని పౌరులకును మరల స్వస్థత చేకూర్చుదును. వారికి ఆరోగ్యమును, శాంతిభద్రతలను సమృద్ధిగా దయచేయుదును.
7. యూదా, యెరూషలేములకు అభ్యుదయము దయచేసి వారిని పూర్వస్థాయికి గొనివత్తును.
8. వారు నాకు ద్రోహముగా చేసిన పాపములనుండి వారిని శుద్ధి చేయుదును. వారు నామీద తిరుగుబాటు చేసినందున కట్టుకొనిన అపరాధములనెల్ల మన్నింతును.
9. యోరూషలేము నాకు ఆనందమును, గౌరవమును, మహిమను కలిగించును. నేను యెరూషలేమునకు చేసిన ఉపకారములను, దానికి దయచేసిన అభ్యుదయ ములనుగూర్చి విని లోకములోని జాతులెల్ల వెరగొంది గడగడవణకును.
10. ప్రభువు ఇట్లనుచున్నాడు: ‘ఈ తావు నరులుకాని, జంతువులుకాని వసింపని ఎడారివలె నైనది’ అని ప్రజలు చెప్పుకొనుచున్నారు. నిజమే. యూదానగరములును, యెరూషలేము వీధులును శూన్యముగానున్నవి. నరులుగాని, జంతువులుగాని అచట వసించుటలేదు. కాని ఈ తావులలో మీరు మరల 11. ఆనందనాదములను విందురు. వివాహోత్సవములలో వధూవరులు చేయు సంతోష ధ్వానములను ఆలింతురు. అపుడు కృతజ్ఞతాబలులు అర్పించుటకు దేవాలయమునకు వచ్చువారు ఈ క్రింది పాటపాడుటను మీరు విందురు:
‘సైన్యములకు అధిపతియైన ప్రభువును కృతజ్ఞతతో స్తుతింపుడు.
ఆయన మంచివాడు.
ఆయన ప్రేమ శాశ్వతమైనది.’
నేను ఈ దేశమునకు అభ్యుదయమునొసగి, దానిని పూర్వపుౌన్నత్యమునకు గొనివత్తును. ఇది ప్రభుడనైన నా వాక్కు.
12. సైన్యములకు అధిపతియైన ప్రభువు ఇట్లను చున్నాడు. నరులుగాని, పశువులుగాని వసింపక ఎడారివలెనున్న ఈ దేశమునను, దీని నగరముల లోను మరల గడ్డిమైదానములు ఏర్పడును. కాపరులు వీనిలోనికి మందలను తోడ్కొనివత్తురు.
13. పర్వత సీమలు, షెఫేల, నేగేబు ప్రాంత నగరములలోని కొండపాదులలోను, బెన్యామీను మండలమునను యెరూషలేము చుట్టుపట్లగల నగరములలోను కాప రులు మరల తమ గొఱ్ఱెలను లెక్కపెట్టుకొందురు. ఇది ప్రభుడనైన నా వాక్కు.’
భవిష్యత్తులో రానున్న రాజు, యాజకులు
14. ప్రభువు ఇట్లనుచున్నాడు: ”నేను యిస్రా యేలు, యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిల బెట్టుకొను రోజులు వచ్చుచున్నవి.
15. ఆ రోజులలో ఆ కాలమున
ధర్మశీలుడైన దావీదు వంశజుని ఒకనిని
నేను రాజుగా1 ఎన్నుకొందును.
అతడు దేశమందంతటను
నీతిని, ధర్మమును పాించును.
16. ఆ కాలమున యూదా రక్షణమును బడయును.
యెరూషలేము భద్రముగా నుండును.
”ప్రభువు మనకు రక్షణము”
అని ఆ నగరమునకు పేరిడుదురు.
17. ప్రభువు ఇట్లనుచున్నాడు: దావీదు వంశజు డొకడు యిస్రాయేలును సదా పరిపాలించును. 18. నాకు సేవలుచేయుటకును, దహనబలిని, ధాన్యబలిని, సమాధానబలిని అర్పించుటకును లేవీ తెగనుండి యాజకులు సదా లభింతురు.”
19. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు విని పించెను: 20. ”నేను రేయింబవళ్ళకు నిబంధనము చేసితిని. అవి నిరంతరము తమ కాలమున తాము వచ్చుచుండును. ఆ నిబంధనమును మీరు భంగము చేయగలిగిన యెడల 21. నేను నా సేవకుడైన దావీదుతో అతని కుమారుడు ఒకడు సదా రాజ్యము చేయునను నిబంధనము కూడ భంగమగును. లేవీవంశజులైన యాజకులతో నేను చేసిన నిబంధనమును భంగ మగును.
22. నేను నా సేవకుడైన దావీదు వంశజు లను, నాకు ఊడిగముచేయు లేవీయులను విస్త రింపజేయుదును. ఆకాశములోని చుక్కలను, కడలి ఒడ్డునందలి ఇసుకరేణువులను లెక్కింప సాధ్యము కానట్లే, వారిని కూడ లెక్కింపసాధ్యముకాదు.”
23. ప్రభువు నాకు తన వాక్కునిట్లు విన్పించెను: 24. ”నేనెన్నుకొనిన రెండు కుటుంబములను యిస్రాయేలు, యూదా ప్రజలను నేను విసర్జించితిని అని ప్రజలు చెప్పుకొనుచున్నారు. ఈ సంగతి నీవు గమనింపలేదా? కనుక ఆ ప్రజలు నా జనులను చిన్న చూపు చూచుచున్నారు. వారినొకజాతిగా గుర్తించుట లేదు.
25. నేను రేయింబవళ్ళతో నిబంధనము చేసికొింని. భూమ్యాకాశములకు నియమము చేసి తిని.
26. నేను ఈ కార్యములను చేసినట్లే యాకోబు సంతతితోను, నా సేవకుడైన దావీదుతోను నేను చేసిన నిబంధనను నిలబెట్టుకొందును. అబ్రహాము, ఈసాకు, యాకోబు వంశజులను పాలించుటకు దావీదు కుమా రుని ఒకనిని ఎన్నుకొందును. నేను నా ప్రజలకు చెర విముక్తిని దయచేసి వారిపై కరుణచూపెదను.”