ప్రజలు యిర్మీయాను ప్రార్థింపుమని కోరుట
42 1. అంతట కారెయా కుమారుడైన యోహానాను, హోషియా కుమారుడైన అజర్యా, సైన్యాధిపతులును, మొదలైన అధికులును, అల్పులునైన ప్రజలందరును యిర్మీయా చెంతకువచ్చి, 2. ”అయ్యా! నీవు మా మొర విని ప్రాణములతో బ్రతికియున్న మా కొరకు నీ దేవునికి విన్నపములు చేయుము. మేము పూర్వము చాలమందిమైనను, ఇప్పుడు కొద్దిమందిమి మాత్రమే మిగిలియున్నాము. ఈ సంగతి నీకును తెలియును.
3. నీ వేడుకోలువలన నీ దేవుడైన ప్రభువు మేము పోవలసిన మార్గమును, చేయవలసిన కార్యములను మాకు తెలియజేయుగాక!” అనిరి.
4. యిర్మీయా ప్రవక్త వారితో, ”మంచిది, మీరు కోరినట్లే నేను మీ దేవుడైన ప్రభువునకు మనవి చేయుదును. ఆయన చెప్పిన సంగతులను వేనిని దాచక మీకు తెలియ చేయుదును” అని చెప్పితిని.
5. వారు ”నీ దేవుడైన ప్రభువు నీద్వారా మాకు తెలియజేసిన నియమములకు మేము కట్టువడిఉండనిచో, ఆయన నమ్మకమైన సాక్షిగా మా మీద నేరము మోపునుగాక!
6. మాకు నచ్చినను, నచ్చకున్నను మన దేవుని ప్రార్థన చేయు మని నిన్ను పంపితిమిగాన మేము ఆయన ఆజ్ఞలను పాింతుము. ఆయనకు విధేయులమైనచో మాకు మేలు కలుగును” అని పలికిరి.
ప్రభువు సమాధానము
7. పదిదినముల తరువాత ప్రభువు యిర్మీయాతో మాటలాడెను.
8. కనుక అతడు కారెయా కుమారుడైన యోహానాను, అతనితోనున్న సైన్యాధిపతులను, ప్రజలందరిని పిలిపించి వారితో ఇట్లనెను: 9. ”మీరు యిస్రాయేలు దేవుడైన ప్రభువునెదుట మనవి చేయు టకు నన్ను పంపితిరికదా! ఆయనిట్లు సెలవిచ్చెను.
10. మీరీ నేలమీదనే వసింతురేని నేను మిమ్ము నిర్మింతునుగాని ధ్వంసముచేయను. మిమ్ము నాటు దునుగాని పెల్లగింపను. నేను మీకు హాని చేసినందు లకు మిగుల చింతించుచున్నాను.
11. మీరు బబులోనియా రాజునకు వెరవనక్కరలేదు. నేను మీకు అండగానుండి అతని బారినుండి మిమ్ము కాపాడు దును.
12. నేను మీమీద కరుణజూపి అతడు మీపై దయజూపునట్లు చేయుదును. మీరు మీ దేశమునకు తిరిగిపోవచ్చును.
13. కాని మీరు మేమీ దేశమున ఉండము. నీ దేవుడైన ప్రభువు మాటవినము.
14. మేము ఐగుప్తునకు వెళ్ళెదము. అచట యుద్ధ ముండదు. యుద్ధనాదము విన్పింపదు. ఆకలి ఉండదు. మేము అక్కడనే వసింతుము అని అందురేని, 15. యూదాలో మిగిలియున్నవారలారా! సైన్యము లకు అధిపతియు యిస్రాయేలు దేవుడునైన ప్రభువు మీతో చెప్పు పలుకులను ఆలింపుడు. మీరు ఐగుప్తునకు వెళ్ళి అచట వసింపగోరెదరేని, 16. మీరు భయపడు యుద్ధము మిమ్ము ఆ దేశమున వెన్నాడును. మీరు వెరచు కరువు అచట మిమ్ము అనుసరించును. మీరు ఆ నేలమీదనే చత్తురు.
17. ఐగుప్తునకుపోయి అచట వసింపగోరు వారందరును పోరు, ఆకలి, అంటురోగములవలన చత్తురు. వారిలో ఒక్కడును నేను పంపబోవు వినాశ నమునుండి తప్పించుకొని బ్రతకజాలడు.
18. యిస్రాయేలు దేవుడును, సైన్యములకు అధిపతియు యైన ప్రభువిట్లు నుడువుచున్నాడు: నేను నా ఆగ్రహ మును, రౌద్రమును యెరూషలేము పౌరులమీద కుమ్మరించినట్లే, ఐగుప్తునకు వెళ్ళు మీ మీదను నా కోపమును కుమ్మరింతును. ప్రజలు మీ దురవస్థ చూచి భీతిల్లుదురు. మిమ్ము గేలిచేయుదురు. మీ పేరును శాపముగా వాడుకొందురు. మీరీ తావును మరల కింతో చూడజాలరు.
19.యూదావాసులలో మిగిలి యున్నవారలారా! ప్రభువు ‘మీరు ఐగుప్తునకు వెళ్ళ కూడదు’ అని చెప్పెను. కనుక నేను మిమ్మిపుడు నిశితముగా హెచ్చరించుచున్నాను.
20. మీరు అతి ప్రమాదకరమైన పొరపాటు చేయుచున్నారు సుమా! ‘మీరు నన్ను మీ దేవుడైన ప్రభువునకు మనవి చేయుమని కోరితిరి. ఆయన ఆజ్ఞాపించినదెల్ల చేయుదుము’ అని మాటయిచ్చి మిమ్మును మీరే మోస పుచ్చుకొనుచున్నారు.
21. నేను మీకిప్పుడు మీ దేవుడనైన ప్రభువు సందేశమును తెలియజేసితిని. ఆయన నన్ను మీతో చెప్పుమనిన సందేశమును మీరు పూర్తిగా మీరుచున్నారు.
22. కనుక మీరు పోయి స్థిరపడగోరిన ఆ నేలమీద పోరు, ఆకలి, అంటు రోగములవలన చచ్చుట నిక్కమని తెలిసికొనుడు.”