అన్యజాతులకు ప్రతికూలముగా ప్రవచనములు

46 1. అన్యజాతులకు ప్రతికూలముగా ప్రభువు యిర్మీయాకు వినిపించిన దైవోక్తులు.

ఐగుప్తునకు ప్రతికూలముగా

కర్కెమీషు వద్ద ఐగుప్తు ఓటమి

2. ఐగుప్తును గూర్చి యెహోయాకీము యూదాను పరిపాలించిన నాలుగవయేట బబులోనియా రాజైన నెబుకద్నెసరు యూఫ్రీసు నదీతీరమునందలి కర్కెమీషు నగరమున ఐగుప్తురాజైన నెకో సైన్యమును ఓడించెను. ఈ సైన్యమును గూర్చి ప్రభువిట్లు నుడివెను:

3.           ”ఐగుప్తు సైన్యాధిపతులు తమ సైనికులతో

               ‘మీరు మీ డాళ్ళను కవచములను

               సిద్ధము చేసికొని యుద్ధమునకు బయలుదేరుడు.

4.           గుఱ్ఱములకు జీను వేసి వానిపై ఎక్కుడు.

               బారులుతీరి శిరస్త్రాణములు ధరింపుడు.

               మీ బల్లెములకు పదును పెట్టుడు.

               కవచములు ధరింపుడు’ అని చెప్పుచున్నారు.  

5.           కాని ప్రభువిట్లు ప్రశ్నించుచున్నాడు:

               నాకేమి కన్పించుచున్నది?

               ఐగుప్తీయులు  భయముతో  వెనుదిరుగుచున్నారు.

               వారి సైనికులు వెన్నిచ్చి పారిపోవుచున్నారు.

               వెనుదిరిగి చూచుటకుకూడ సాహసింపక,

               భయకంపితులై పరుగెత్తుచున్నారు.

               ఎటుచూచినను భయమే కన్పించుచున్నది.

6.           వేగముగా పరుగెత్తువారు తప్పించుకోలేరు.

               శూరులు తమ ప్రాణములు కాపాడుకోలేరు.

               ఉత్తర దిక్కున, యూఫ్రీసు నదిఒడ్డున

               వారు కాలుజారిపడుదురు.     

7.            నైలునదివలె పొంగిపారు ఈ దేశమెద్ది?       అంచులదాక ప్రవహించు నదివలె

               చూపట్టు దేశమెద్ది?

8.           ఈ దేశము ఐగుప్తు.

               దాని దండు నైలునదివలె పొంగిపారుచున్నది.

               అంచులదాక పారు నదివలె చూపట్టుచున్నది.

               ఐగుప్తు

               ‘నేను పొంగి ప్రపంచమును ముంచివేసెదను.

               పురములను, వాని పౌరులను నాశనము చేసెదను.

9.           నా గుఱ్ఱములను స్వారి చేయించెదను.

               నా రథములను వేగముగా పరుగెత్తించెదను.

               నా సైనికులను పోరునకు పంపెదను.

               కూషు, పూటు వీరులు డాళ్ళతో పోవుదురు.

               లూదు వీరులు ధనస్సులతో పోవుదురు’

               అని తలంచెను.

10.         ఇది సైన్యములకధిపతియైన ప్రభువు దినము.

               ఈ దినము ఆయన విరోధులకు 

               ప్రతీకారము చేయును.

               శత్రువులను శిక్షించును.

               ఆయన ఖడ్గము వారిని భుజించి తృప్తిచెందును.

               వారి నెత్తురు త్రాగి తన కోర్కె తీర్చుకొనును.

               ఈ దినము సైన్యములకధిపతి

               ఉత్తరదిక్కు యూఫ్రీసు నదిచెంత

               బలిపశువులను అర్పించును.

11. ఐగుప్తు జనులారా!

               మీరు ఔషధముకొరకు గిలాదునకు పొండు.

               మీరెన్ని ఔషధములు వాడినను లాభములేదు.

               ఏ ఔషధమును మీ వ్యాధి కుదర్చలేదు.

12.          జాతులు మీ అవమానముగూర్చి వినెను. ఎల్లరును మీ ఆర్తనాదమును ఆలించిరి.

               మీ సైనికులు ఒకరిమీదొకరుపడి

               ఎల్లరును నేలకొరుగుచున్నారు.”

నెబుకద్నెసరు ఐగుప్తును

ముట్టడించుటను గూర్చి

13. బబులోనియా రాజగు నెబుకద్నెసరు

               ఐగుప్తును ముట్టడించుటకురాగా

               ప్రభువు నాతో ఇట్లు చెప్పెను:

14. ”మీరు ఐగుప్తు నగరములలోను, మిగ్దోలు, నోపు, తహపనేసు పట్టణములలోను

               ఇట్లు ప్రకింపుడు

               ‘మీరు ఆత్మరక్షణకు సిద్ధముకండు.

               మీరు పోరున చత్తురు.’

15.          మీలో యోధులైనవారు

               ఏల తుడుచుపెట్టుకొనిపోయిరి?

               వారు నిలువలేకున్నారు.

               ఎందుకన ప్రభువు వారిని అణగద్రొక్కెను.

16.          మీ సైనికులు కాలుజారిపడిపోయిరి.

               వారు లెండు, మనము మన దేశమునకును,

               మన జనులయొద్దకును పారిపోవుదము.

               శత్రువుల కత్తిబారినుండి తప్పించుకొందము

               అని ఒకరితోనొకరు చెప్పుకొనుచున్నారు.

17. మీరు ఐగుప్తురాజునకు క్రొత్తపేరు పెట్టుడు.

               తన అవకాశమును జారవిడుచుకొనిన

               మాటలకోరు అని అతనిని పిలువుడు.

18. నేను సైన్యములకు అధిపతియైన ప్రభువును,

               రాజును, సజీవుడైన దేవుడను.

               కొండలన్నింకంటె తాబోరు కొండ ఎత్తు.

               కర్మెలుకొండ కడలికి పైన నిలిచియుండును.

               ఆ రీతినే మీమీదికి దండెత్తి వచ్చువాడు

               మీకంటెను బలాఢ్యుడు.

19. ఐగుప్తీయులారా!

               మీరు బందీలగుటకు సిద్ధముకండు.

               నోపు ఎడారియగును, అచటెవరును వసింపరు.

20. ఐగుప్తు మెరుగైన ఆవు వింది.

               కాని ఉత్తరమునుండి వచ్చిన జోరీగ

               దానిని కుట్టుచున్నది.

21. ఐగుప్తు అరువుతెచ్చుకొన్న సైనికులుకూడ

               పెయ్యలవలె చేతకానివారు.

               వారు పోరున నిలువజాలరైరి.

               ఎల్లరును వెన్నిచ్చి పారిపోయిరి.

               వారికి వినాశకాలము ప్రాప్తించినది.

               మరణదినము ఆసన్నమైనది.

22. శత్రుసైన్యము ఐగుప్తును సమీపించుచున్నారు

               ఆ సైన్యము చెట్లను నరుకు వారివలె

               గొడ్డళ్ళతో వచ్చి దానిమీద పడుచున్నారు.   

               వినుడి! ఐగుప్తీయుల పలాయనము పాము

               ప్రాకిపోవునపుడు చేయు శబ్ధమువలెనున్నది.

23. వారు ఐగుప్తును

               దట్టమైన అడవినివలె నరకుచున్నారు.

               ఆ శత్రుసైన్యము

               మిడుతలదండువలె లెక్కలకందనిది.

24. ఐగుప్తుకుమారి అవమానపరుపబడును.

               ఉత్తరదిక్కునుండి వచ్చువారు

               ఆమెను జయింతురు.

               ఇదే ప్రభుడనైన నా వాక్కు.”

25.        సైన్యములకు అధిపతియు యిస్రాయేలు

               దేవుడునైన ప్రభువు ఇట్లనుచున్నాడు:

               ”నేను నోపు నగరపు దైవమగు ఆమోనును,

               ఐగుప్తును, దాని దైవములను,

               రాజులను శిక్షింతును. ఐగుప్తు రాజును

               అతని మీద ఆధారపడినవారినిగూడ శిక్షింతును.

26. ఆ రాజును అతనిని చంపగోరు

               బబులోనియా రాజు నెబుకద్నెసరునకును,

               అతని సైనికులకులకును ఒప్పగింతును.

               కానీ కాలము కడచినపిదప ప్రజలు

               పూర్వ కాలమువలె మరల ఐగుప్తున వసింతురు.

               ఇది ప్రభుడనైన నా వాక్కు,

ప్రభువు తన ప్రజలను కాపాడును

27. నా సేవకుడైన యాకోబూ!

               నీవు భయపడకుడు.

               యిస్రాయేలీయులారా! మీరు భయపడకుడు.

               దూరముననున్న దేశమునుండియు

               మీరు బానిసలుగానున్న దేశమునుండియు

               నేను మిమ్ము రక్షింతును.

               మీరు తిరిగివచ్చి క్షేమముగా జీవింతురు.

               భద్రముగా మనుదురు.

               ఎవరును మిమ్ము మరల భయపెట్టజాలరు.

28. నేను మీతో నుండి మిమ్ము రక్షింతును.

               నేను మిమ్ము ఏ జాతుల మధ్య

               చెల్లాచెదరు చేసితినో, వారినెల్ల శిక్షింతును,

               మిమ్ము మాత్రము కాపాడుదును.

               నేను మిమ్ము శిక్షింపకమానను.

               కాని మిమ్ము స్వల్పముగా దండించి

               వదలివేయుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు.