బబులోనియా పతనము

యిస్రాయేలునకు దాస్యవిముక్తి

50 1. బబులోనియాను గూర్చియు, దాని ప్రజలైన కల్దీయులను గూర్చియు ప్రభువు నాకు ఈ సందేశ మును వినిపించెను:

2. ”మీరు సకలజాతులకు ఈ వార్త వినిపింపుడు.

               జెండానెత్తి ఈ సంగతి ప్రకింపుడు.

               ఈ విషయమును రహస్యముగా నుంచకుడు.

               బబులోనియా కూలినది.

               దాని దైవములైన బేలు, మర్దూకు పడిపోయెను.

               దాని విగ్రహములకు అవమానము ప్రాప్తించెను.

               అసహ్యకరమైన ప్రతిమలు నాశనమయ్యెను.’

3.           ఉత్తరమునుండి వచ్చిన జాతి బబులోనియాను

               నాశనముచేసి ఎడారి కావించును.

               నరులును, మృగములును

               అచినుండి పారిపోవుదురు.

               అటనిక ఎవడును వసింపడు.

4.           ఆ కాలమున యూదా యిస్రాయేలు ప్రజలు

               శోకించుచు తమ ప్రభుడనైన నన్ను వెదకుచు

               నా యొద్దకు తిరిగివత్తురు.

5.           వారు సియోనునకు మార్గమేది? అని అడిగి

               అటుప్రక్కకు పయనము చేయుదురు.

               వారు నాతో శాశ్వతనిబంధన చేసికొందురు.

               దానిని మరల భంగపరుపరు.

6.           నా ప్రజలు కొండలలో కాపరి తప్పిపోనిచ్చిన

               గొఱ్ఱెల వింవారు.

               వారు గొఱ్ఱెలవలె కొండనుండి కొండకు తిరుగుచు

               తమ వాసస్థలమును మరిచిపోయిరి.

7.            వారికి ఎదురుపడిన వారెల్ల వారిని మ్రింగివేసిరి.

               ”మా నేరమేమియులేదు.

               వీరు నీతికి నివాసమును,

               తమ పితరుల నిరీక్షణాధారమునైన యావేమీద తిరుగబడిరి కనుక వారికిట్లు జరిగెను”

               అని వారి శత్రువులు పలుకుదురు.

8.           యిస్రాయేలీయులారా!

               మీరు బబులోనియానుండి పారిపొండు.

               అచినుండి వెడలిపొండు.

               మందలకు ముందు మేకపోతులు

               నడుచునట్లు ముందు నడువుడి.

9.           నేను ఉత్తరమునుండి

               మహాజాతుల బృందమును తోడ్కొనివత్తును.

               వారు బబులోనియా మీదికి దాడిచేయుదురు.

               తమ దండులను బారులుతీర్చి

               ఆ దేశమును జయింతురు.

               వారు నేర్పరులైన వేటకాండ్రవింవారు.

               వారు విసరిన బాణములు గురితప్పవు.

10. శత్రువులు బబులోనియాను కొల్లగ్టొి

               అచినుండి తమకు వలసిన

               వస్తువులనెల్ల కొనిపోవుదురు.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

11.           బబులోనీయులారా!

               మీరు నా ప్రజలను దోచుకొింరి.

               మీరు ఆనందముతో ఉప్పొంగుచు

               కళ్ళమును త్రొక్కు పెయ్యవలెను

               సకిలించు గుఱ్ఱమువలెను తిరుగాడుచున్నారు.

12.          కాని మీ మహానగరమే

               అవమానము చెంది సిగ్గుపడును.

               జాతులలో బబులోనియా

               ఎందుకు కొరగానిదగును.

               ఆ దేశము ఎండిపోయి ఎడారియగును.

13.          నా కోపమువలన

               బబులోనియా నిర్మానుష్యమగును.

               అది మరుభూమి అగును.

               అటువైపు వెళ్ళినవారెల్ల ఆ దేశమును గాంచి

               వెరగంది విస్తుపోవుదురు.

14.          ధానుష్కులారా!

               బబులోనియాచుట్టు బారులుతీరుడు.

               అది ప్రభుడనైన నాకు ద్రోహము చేసినది కనుక

               మీరు దాని మీద బాణములు రువ్వుడు.

15.          ఆ నగరముచుట్టు యుద్ధనాదము చేయుడు.

               ఇపుడు బబులోనియా లొంగినది.

               దాని ప్రాకారములు, బురుజులు కూలినవి

               నేను బబులోనీయులమీద పగ తీర్చుకొందును.

               మీరును వారికి ప్రతీకారము చేయుడు.

               వారు ఇతరులకు కీడు చేసినట్లే,

               మీరును వారికి కీడు చేయుడు.      

16.          ఆ దేశమున పైరు వేయనీయకుడు.

               కోత కోయనీయకుడు.

               అచట వసించు పరదేశులు

               శత్రువుల ముట్టడికి భయపడి

               స్వీయదేశమునకు పారిపోవుదురుగాక!

17. యిస్రాయేలీయులు సింహములు తరిమిన గొఱ్ఱెలవిం వారు. మొదట అస్సిరియా రాజు వారిని కబళించెను. అటుతరువాత బబులోనియా రాజు నెబుకద్నెసరు వారి ఎముకలను విరుగగొట్టెను.

18. కావున సైన్యములకధిపతియు యిస్రాయేలు దేవుడనైన నేను అస్సిరియా రాజును వలె నెబుకద్నెసరును, అతని రాజ్యమును దండింతును.

19.          నేను యిస్రాయేలీయులనెడు గొఱ్ఱెలను

               వారి పచ్చికపట్టులకు కొనివత్తును.

               వారు కర్మెలు కొండ మీదను

               బాషాను మండలమునను మేయుదురు

               ఎఫ్రాయీము కొండలలోను, గిలాదు సీమలలోను

               సంతుష్టిగా భుజింతురు.

20.        ఆ దినములు వచ్చినపుడు

               యిస్రాయేలీయులలో తప్పులు చూపట్టవు.

               యూదా ప్రజలలో వెదకినను

               దోషములు కన్పింపవు.

               నేను ప్రాణములతో బ్రతుకనిచ్చిన ప్రజల

               దోషములెల్ల నేనే మన్నింతును.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

బబులోనియా పతనము

21.          ప్రభువిట్లనుచున్నాడు:

               మెరతాయిము, పెకోదు ప్రజలను

               ముట్టడించి వధింపుడు.

               నేను ఆజ్ఞాపించిన కార్యములెల్ల చేయుడు.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

22.         దేశమున యుద్ధనాదము వినిపించుచున్నది.

               ప్రజలను ఊచకోత కోయుచున్నారు.

23.        బబులోనియా తన సుత్తెతో

               ప్రపంచమును చావమోదెను.

               కాని యిప్పుడు ఆ సుత్తె ముక్కలుముక్కలయ్యెను.

               ఆ దేశమునకు ప్టిన దుర్గతినిచూచి

               జాతులెల్ల కంపించెను.

24.         బబులోనియా! నీవు నన్నెదిరించితివి

               కాని నీకు తెలియకుండనే

               నేను పన్నిన ఉచ్చులలో చిక్కుకొింవి.

25.         నేను నా ఆయుధాగారము తెరచి

               రౌద్రముతో నా శస్త్రములు చేతబ్టితిని.

               సైన్యములకు అధిపతియు ప్రభుడనైన నేను

               బబులోనియాలో చేయవలసిన పనియున్నది.

26.        నలువైపులనుండి బబులోనియాను ముట్టడింపుడు

               దాని ధాన్యాగారములను తెరువుడు.

               కొల్లసొమ్మును ధాన్యరాసులవలె ప్రోగుజేయుడు.

               ఆ దేశమును శాపముపాలుచేసి

               సర్వనాశనము చేయుడు.

               అచట దేనిని వదలిపెట్టవలదు.

27.         దాని ఎడ్లనన్నిని వధింపుడు.

               అవి వధకు పోవలెను. అయ్యో! వారికి శ్రమ.

               అయ్యో! వారి దినము దగ్గరపడెను.

28.        బబులోనియానుండి

               పారిపోయి వచ్చిన  కాందిశీకులు

               యెరూషలేమున ప్రవేశించి

               మన దేవుడైన ప్రభువు తన

               దేవాలయమును నాశనము చేసినందులకు

               బబులోనీయుల మీద పగతీర్చుకొనెనని చెప్పిరి.

గర్వము

29.        ఆ దేశమును ముట్టడింపుడని

               విలుకాండ్రతో చెప్పుడు.

               విల్లమ్ములను వాడగలిగిన

               వారినందరిని దానిమీదికి పంపుడు.

               నగరమును చుట్టుముట్టుడు.

               ఎవరిని తప్పించుకొని పోనీయకుడు.

               ఆ నగరపు దుష్కార్యములకు తగినట్లే

               దానిని దండింపుడు.       

               అది ఇతరులకు కీడుచేసినట్లే,

               మీరు దానికిని కీడు చేయుడు.

               అది పొగరుతో కన్నుమిన్ను కానక

               పవిత్రుడును యిస్రాయేలు దేవుడనైన

               నామీద తిరుగబడినది.

30.        కావున దాని యువకులను వీధులలో చంపుదురు.

               ఆ దినమున దాని సైనికులనెల్ల

               నాశనము చేయుదురు.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.    

31.          బబులోనియా! నీ కన్నులకు కావరమెక్కినది.

               కావున సైన్యములకు అధిపతియు

               ప్రభుడనైన నేను నిన్నెదిరింతును.

               నిన్ను దండించుకాలము వచ్చినది.

32.        పొగరుబోతులైన నీ జనులు

               కాలు జారిపడిపోవుదురు.

               ఎవరును వారిని పైకి లేపరు.

               నేను నీ నగరములకు నిప్పు పెట్టుదును.

               నీ చుట్టుపట్లగల పురములును కాలిపోవును.

ప్రభువు యిస్రాయేలును రక్షించును

33.        సైన్యములకధిపతియైన

               ప్రభువిట్లు పలుకుచున్నాడు.

               శత్రువులు యిస్రాయేలీయులను పీడించిరి.

               వారిని చెరప్టిన వారు వారిని తమ గుప్పిట

               పట్టుకొని అటునిటు కదలనీయరైరి.

34.         కాని వారిని చెరనుండి

               విడిపించువాడు బలాఢ్యుడు. 

               సైన్యములకు అధిపతియైన ప్రభువు

               అని ఆయనకు పేరు. 

               ఆయన యిస్రాయేలీయుల కోపు తీసికొనెను.

               ఆ ప్రభువు లోకమునకు శాంతిని దయచేయును.

               బబులోనియాను మాత్రము కలవరపెట్టును.

35.        ప్రభువు ఇట్లనుచున్నాడు:

               బబులోనియా చచ్చును. దాని ప్రజలు నశింతురు.

               దాని నాయకులును జ్ఞానులును హతులగుదురు.

36.        కల్లలాడు దాని ప్రవక్తలు

               ఖడ్గమువశులై, పిచ్చివాండ్రగుదురు.

               వారి బలాఢ్యులు ఖడ్గముచే హతులగుదురు.

37.         దాని అశ్వములు, రథములు

               ఖడ్గముచే నశించును.

               దానిమధ్యనుండు పరదేశ సైనికులు

               ఖడ్గముచే చత్తురు.

               వారు స్త్రీలవలె బలహీనులగుదురు.

               దాని సంపదలను నాశనము చేయుడు.

               కొల్లగొట్టుకొని ఎత్తుకొనిపొండు.

38.        ఆ దేశమున వానలు కురియవు.

               దాని నదులు ఎండిపోవును.

               బబులోనియా భయంకర

               విగ్రహములకు ఆలవాలము.

               అవి ఆ దేశప్రజలను మూర్ఖులను చేసెను.

39.        బబులోనియా అడవి పిల్లులకును,

               నక్కలకును ఆటపట్టగును.

               గుడ్లగూబలచట వసించును.

               నరులచట మరల కాపురముండరు.

               అది కలకాలము ఎడారిగా ఉండిపోవును

40.        నేను సొదొమ గొమొఱ్ఱాలవలెను

               వాని పరిసర నగరములవలెను బబులోనియాను గూడ కూలద్రోయుదును.

               అచట ఇక ఎవడును వసింపడు.

               ఇది ప్రభుడనైన నా వాక్కు.

ఉత్తరము నుండి వచ్చు శత్రువు

41.          ఉత్తరమునుండి ఒక మహాజాతి

               కదలివచ్చుచున్నది.

               దూరప్రాంతములనుండి పెక్కుమంది రాజులు

               యుద్ధమునకు సన్నద్ధులు అగుచున్నారు.

42.         వారు తమ విండ్లను, కత్తులను చేతబ్టిరి.

               వారు నిర్దయులు, క్రూరులు.

               వారు గుఱ్ఱములనెక్కి స్వారిచేయుచుండగా 

               సాగరము ఘోషించినట్లుగా ఉండును.

               ఆ వీరులు బబులోనియామీద

               పోరు సల్పుటకు సిద్ధముగా నున్నారు.

43.         ఈ వార్త వినగానే

               బబులోనియా రాజు హస్తములు చచ్చుపడినవి.

               అతని హృదయము వ్యధతో నిండినది.

               అతడు ప్రసవించు స్త్రీవలె బాధకు గురియయ్యెను.

44. సింహము యోర్దాను తీరమునందలి

               దట్టమైన అడవులనుండి బలమైన

               నివాసములలోనికి వచ్చినట్లే

               ప్రభుడనైన నేనును

               బబులోనియా మీదికెత్తివత్తును. 

               నన్ను చూచి బబులోనియులు

               దిఢీలున పారిపోవుదురు.

               అపుడు నేనెన్నుకొనిన నాయకుడు

               ఆ జాతిని పాలించును.

               నన్ను పోలినవాడెవడు?

               నన్ను సవాలు  చేయగలవాడెవడు?

               నన్ను ఎదిరింపగలవాడెవడు?

45. నేను బబులోనియాకు ఏమి తలప్టిెతినో,

               దాని ప్రజలకేమి చేయుదునో వినుడు.

               శత్రువులు వారి పిల్లలనుగూడ

               ఈడ్చుకొనిపోవుదురు.

               ఎల్లరును వారిని చూచి వెరగందుదురు.

46.        బబులోనియా కూలినపుడు

               భీకరనాదము ఉప్పతిల్లగా భూమి కంపించును.

               ఇతరజాతులు ఆ దేశముయొక్క ఆర్తనాదమును ఆలించును.”