4. లోకాంతము, కడగతులు

దైవశిక్ష

24 1.      ప్రభువు భూమిని శూన్యముచేసి

                              నాశనము చేయును.

                              నేల ఉపరిభాగమును వంచి,

                              దానిమీది  ప్రజలను చెల్లాచెదరుచేయును.

2.           ప్రజలకు కలిగినట్లు యాజకులకు,

               దాసులకు కలిగినట్లు యజమానులకు,

               దాసీలకు కలిగినట్లు యజమానురాండ్లకు,

               కొనువారికి కలిగినట్లు అమ్మువారలకు,

               అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పుపుచ్చుకొనువారికి

               వడ్డీకి ఇచ్చువారికి కలిగినట్లు

               వడ్డీకి తీసుకొనువారికి

               అందరికిని ఒకేగతి పట్టును.

3.           భూమిశూన్యమై నాశనమగును.

               అది కేవలము కొల్లసొమ్ము అగును.

               ఇది ప్రభువువాక్కు.

4.           భూమి శుష్కించి వాడిపోవును.

               లోకమంతయు ఎండి క్షీణించిపోవును.

               భూమ్యాకాశములు అవిసిపోవును.

5.           లోకము నరులవలన కలుషితమైనది.

               వారు శాసనములను పాింపరైరి.

               శాశ్వతమైననిబంధనమును మీరిరి.

6.           కావున శాపము భూమిని చుట్టుకొనినది.

               భూమిమీద ప్రజలు

               తమ పాపఫలమును అనుభవించుచున్నారు.

               వారిలో చాలమంది భస్మమైరి.

               ఇక కొద్దిమంది మాత్రమే మిగిలియుందురు.

నగరము శిథిలమగును

7.            ద్రాక్షతీగలు వాడిపోవుచున్నవి,

               ద్రాక్ష రసము కొరతపడుచున్నది.

               పూర్వము సుఖించినవారిపుడు

               దుఃఖించుచున్నారు.     

8.           సంతోషప్రదమైన

               తంత్రీవాద్యము పాట ఆగిపోయినది.

               ప్రజల సంతోషనాదములు అంతరించినవి.

               ఇంపైన సితారపాట సమసిపోయినది.

9.           ప్రజలు మద్యము సేవించుచు,

               పాటలుపాడుట మానివేసిరి.

               త్రాగువారికి మద్యము చేదుగానున్నది.

10.         నాశనమునకు గురికానున్న

               నగరము ధ్వంసమైనది.

               అందలి ఇండ్లను మూసివేసిరి.

               వానిలో ఎవరును ప్రవేశించుటలేదు.

11.           ప్రజలు వీధులలో

               ద్రాక్షారసము కొరకు అరచుచున్నారు,

               సంతోషము మరుగైపోయినది.

               ఆనందము దేశమున కన్పింపకుండపోయినది.

12.          నగరము ధ్వంసమైనది

               దాని ద్వారములు పగులగొట్టబడినవి.

13.          భూమిమీది ప్రజలెల్లరును ఇట్లే నాశనమగుదురు.

               ఓలివుచెట్టునుండి పండ్లు దులిపినప్పుడును;

               ద్రాక్షలకోతకాలము ముగిసిన తరువాత

               పరిగెపండ్లను ఏరుకొనునప్పుడు ఎట్లుండునో

               నరులగతియు అటులనే ఉండును.

14.          కాని నాశనమును తప్పించుకొనువారు

               సంతసముతో పాటలు పాడుదురు.

               సముద్రతీరముననున్నవారు

               ప్రభువుమాహాత్మ్యమును ఉగ్గడింతురు.

15.          తూర్పుననున్నవారు ఆయనను ప్రశంసింతురు. ద్వీపవాసులు యిస్రాయేలు దేవుడైన ప్రభువును 

               కొనియాడుదురు.

16.          నీతిమంతమైన యిస్రాయేలు ప్రజకు

               గౌరవము కలుగుగాకయని నేల అంచులనుండి

               ప్రజలు పాడగా మనమువిందుము.

               కాని ”అయ్యో! నేను చెడితిని,

               నాకు దుర్గతితప్పదు,

               మోసగాండ్రు మోసము చేయుచున్నారు.

               ద్రోహులు ద్రోహము చేయుచున్నారు”

               అని నేను భావించితిని.      

17.          భూలోకవాసులారా! మీకు భయమును,

               గొయ్యియు, ఉరులును తప్పవు.

18.          భయమునుండి పారిపోజూచువాడు

               గోతిలోపడును,

               గోతినుండి తప్పించుకొనువాడు

               ఉరులలో చిక్కుకొనును.

మరల దైవశిక్షను గూర్చి

               ఆకసమునుండి కుండపోతగా

               వాన కురియును.

               నేలపునాదులు కంపించును.  

19.          భూమి బ్రద్దలగును,

               దద్దరిల్లి  బీటలువారును, గడగడవణకును.

20.        అది త్రాగినవానివలె ఇటునటుతూలును.

               గాలికి గుడిసెవలె ఊగిసలాడును.

               భూమికి పాపభారమెక్కువైనది.

               కనుక అది కూలిపడును, మరల లేవలేదు.

21.          ఆ దినమున ప్రభువు

               ఆకాశమునందలి శక్తులను,

               భూమిమీది రాజులను శిక్షించును.

22.        బందీలను గోతిలో పడవేసినట్లుగా

               రాజులను ప్రోగుజేసి చెరలోపడవేయును

               దీర్ఘకాలానంతరము వారిని దండించును.

23.        అపుడు చంద్రుడు ప్రకాశింపడు,

               సూర్యుడు కాంతినీయడు.

               సైన్యములకధిపతియగు ప్రభువేరాజై

               యెరూషలేమున సియోనుకొండపై

               పరిపాలనము చేయును.

               ప్రజానాయకులు ఆయన తేజస్సును దర్శింతురు.