అబ్రహాము సుతులకు ఉద్భోద
51 1. ”నీతిని అనుసరించువారును, నన్ను
వెదకువారును నా పలుకులు ఆలింపుడు.
మీరు ఏ రాతినుండి చెక్కబడితిరో,
ఏ గవిరినుండి తొలువబడితిరో ఊహింపుడు.
2. మీ తండ్రియైన అబ్రహామును,
మీకు జన్మనిచ్చిన సారాను తలంపుడు.
నేను అతనిని పిలిచినపుడు
అతడు ఒంటరియైయున్నాడు,
కాని నేను అతనిని దీవించి,
అతనిని పెక్కుమంది అగునట్లు చేసితిని.
3. ప్రభువు సియోనును కరుణించును.
శిథిలములైన దాని గృహములను
నెనరుతో జూచును.
అది అరణ్యమువలె నున్నను,
దానిని ఏదెనుతోటనుగా మార్చును.
అది ఎడారివలె నున్నను
దానిని ప్రభువు వనముగా మార్చును.
ఆ నగరమున సంతోషానందములు నెలకొనును,
స్తుతిగీతములు విన్పించును.
ప్రభువు లోకమునకు తీర్పు చెప్పును
4. ప్రజలారా! నా మాటవినుడు.
జాతులారా! నా పలుకులు ఆలింపుడు.
ఉపదేశమును ఒసగువాడను నేనే.
నా ఆజ్ఞలు జాతులకు వెలుగు నొసగును.
5. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా నున్నది
నేను శీఘ్రమేవచ్చి ప్రజలను రక్షింతును.
నేనే జాతులను పాలింతును.
ద్వీపనివాసులు నా రాక కొరకు
ఎదురుచూచుదురు.
నేను వచ్చి తమను రక్షింతునని
కాచుకొనియుండుదురు.
6. కన్నులెత్తి ఆకసమును పరీక్షింపుడు.
భూమిని పరిశీలింపుడు.
ఆకసముపొగవలె అదృశ్యమగును.
భూమి జీర్ణవస్త్రమువలె పాతబడిపోవును.
దానిమీది నరులెల్లరును దోమలవలె చత్తురు. కాని నా రక్షణము కలకాలము నిలుచును,
నా నీతికి అంతముండదు.
7. న్యాయమునెరిగినవారలారా!
నా ఉపదేశమును హృదయమున
నిలుపుకొనినవారలారా! వినుడు.
జనులు మిమ్ము నిందించి అవమానించినను,
మీరు భయపడనక్కరలేదు.
8. వారు చిమటలుక్టొిన వస్త్రములవలెను,
పురుగులు తినివేసిన ఉన్నివలెను
అదృశ్యము అగుదురు.
కాని నా రక్షణము కలకాలము నిలుచును,
నా నీతికి అంతముండదు.”
ప్రభువును మేలుకొలుపుట
9. ప్రభూ! మేలుకొనుము, మేలుకొనుము.
నీ బలముతో మమ్ము కాపాడుము.
పూర్వమువలె నేడును మేలుకొని
నీ బలమును ప్రదర్శింపుము.
నీవు జలభూతమైన రహాబును
రెండు ముక్కలుగా చీల్చితివి.
10. అగాధ సముద్రము ఎండిపోవునట్లు చేసితివి.
దాని గర్భముగుండ మార్గము కల్పించితివి.
ఆ మార్గముగుండ
నీవు రక్షించిన వారిని నడిపించితివి.
11. నీవు రక్షించినవారు ఆనందనాదముతో
సియోనునకు తిరిగివత్తురు.
సంతసముతో పాడుచువత్తురు.
వారు సదాసంతోషచిత్తులు అగుదురు.
దుఃఖ విచారములు ఇక అంతరించును.
ప్రభువు తన ప్రజలను ఓదార్చును
12. ”మిమ్మును ఓదార్చుటకు నేను ఉన్నాను.
గడ్డివలె క్షణమాత్ర జీవియైన
నరమాత్రునికి మీరు భయపడవలెనా?”
13. మీరు మిమ్ము సృజించిన ప్రభువును మరచితిరా?
ఆకాశమును విశాలముగా విప్పి,
నేలకు పునాదులు ఎత్తినవానిని విస్మరించితిరా?
మిమ్ము పీడించువారిని జూచి,
మిమ్ము నాశనము చేయువారిని గాంచి
మీరు నిరంతరము భీతితో కంపింపనేల?
వారి కోపము మిమ్ము ఏమియు చేయజాలదు.
రక్షణము
14. బందీలు శీఘ్రమే విమోచనము పొందుదురు.
వారు చెరలో మరణింపరు.
వారికి భోజనము సమృద్ధిగా లభించును.
15. ”నేను మీ ప్రభుడనైన దేవుడను.
నేను సాగరమును పొంగింతును.
దాని తరంగములు
ఘోషించునట్లు చేయుదును.”
సైన్యములకధిపతియైన ప్రభుడని ఆయనకు పేరు.
16. ”నేను ఆకాశమును విశాలముగా విప్పితిని,
భూమికి పునాదులెత్తితిని.
సియోనుపౌరులతో, మీరు నా ప్రజలు,
నేను మీకు నా ఉపదేశము నొసగితిని.
నా హస్తములతో నేను మిమ్ము కాపాడుదునని చెప్పితిని.”
యెరూషలేమును మేలుకొలుపుట
17. యెరూషలేమూ! మేలుకొనుము, మేలుకొనుము.
లేచి నిలుచుండుము.
నీవు ప్రభువు కోపము అను పాత్రనుండి
పానీయమును త్రాగితివి.
దానిలోని పానీయమును
పూర్తిగాత్రాగి తూలిపడిపోతివి.
18. నిన్ను నడిపించు వారెవరును లేరు.
నీవు కనిపెంచిన ప్రజలలో ఎవరును
నీ చేతినిపట్టుకొని నిన్ను తోడుకొనిపోరు.
19. నీకు రెండు ఇక్కట్టులు ప్రాప్తించెను.
నీ దేశము యుద్ధమువలన నాశనమయ్యెను.
నీ ప్రజలు ఆకలికి చిక్కిరి.
నీ కొరకు విలపించువారెవరును లేరు.
నిన్ను ఓదార్చువారెవరును లేరు.
20. నీ ప్రజలు సత్తువనుకోల్పోయి
వీధులఅంచులలో కూలిరి.
వారు వలలో చిక్కుకొనిన దుప్పివలె ఉన్నారు.
వారు ప్రభువు బెదరింపులకును,
కోపమునకును గురియైరి.
21. బాధలవలన క్రుంగియున్న యెరూషలేము!
మద్యము సేవింపకున్నను త్రాగినదానివలె
తూలి పడిపోవుదానా!
22. నిన్ను సమర్థించు నీ దేవుడైన ప్రభువు
నీతో ఏమి చెప్పుచున్నాడో వినుము.
”నేను కోపముతో నీకందించిన పానపాత్రమును
నీ చేతిలోనుండి తీసివేయుదును.
నీవు తూలి పడిపోవునట్లు చేయు పానీయమును
ఇక మీదట నీవు సేవింపనక్కరలేదు.
23. నేను ఆ పాత్రమును
నిన్ను పీడించువారికి త్రాగనిత్తును.
మేము దాిపోవునట్లు
క్రిందకు వంగి సాగిలపడుము
అని వారు నీతో చెప్పగా,
నీవు నీ వీపును, దాటువారికి దారినిగా చేసి,
నేలకు దానిని ఒంచితివికదా!
వారి చేతులలో ఆ పాత్రను పెట్టెదను.”