52 1. సియోనూ! మేలుకొనుము,

                              బలము తెచ్చుకొనుము.

                              పరిశుద్ధనగరమైన యెరూషలేమూ!

                              సుందరములైన వస్త్రములను ధరింపుము.

                              సున్నతి పొందని అపవిత్రజనులు

                              నీ ద్వారములలో మరల అడుగిడరు.          

2.           బందీవిగానున్న యెరూషలేమూ!

               పైకిలేచి నిలుచుండుము.

               నీ మీది దుమ్ము దులుపు కొనుము.

               బందీవిగా నున్న సియోను కుమారీ!

               నీ మెడకు చుట్టుకొనియున్న

               బంధములను వదలించుకొనుము.

ప్రవాసమున యూదజాతి

3. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: ”శత్రువులు మిమ్ము ఊరకనే బందీలుగా చేసిరి. మీకు సొమ్ము చెల్లింపలేదు. ఆ రీతిగనే ఇపుడు నేను మిమ్ము వారి నుండి ఊరకనే విముక్తుల చేయుదును. వారికి సొమ్ముచెల్లింపనక్కరలేదు. 4. మీరు ఐగుప్తునకు వలస వెళ్ళి అచట పరదేశులుగా జీవించితిరి. అస్సిరియా మిమ్ము బందీలనుజేసి కఠినముగా పీడించెను.

5. కాని ఇప్పుడు జరిగినదేమి? శత్రువులు మిమ్ము బబులోనియాకు బందీలనుగా కొనివచ్చిరి. మీ యజ మానులు ప్రగల్భములు పలికి నిరంతరము నన్ను అవమానించుచున్నారు.

6. ఆ రోజున నా జనులు నా నామమును తెలుసుకొందురు. ‘ఉన్నవాడను’ అను నేనే వారితో మ్లాడుచున్నానని వారు ఆ రోజున తెలుసుకొందురు.”

ప్రభువు యెరూషలేమును రక్షించును

7.            శుభవార్తతో పర్వతములమీదుగా నడచివచ్చు

               వార్తావహుని పాదములెంత మనోజ్ఞముగానున్నవి

               అతడు చల్లని కబురును, శాంతిని,

               రక్షణమును తెలియజేయుచున్నాడు. 

               సియోనుతో ”నీ దేవుడు రాజు”

               అని చెప్పుచున్నాడు.

8.           నగరమునకు గస్తీ కాయువారు కేకలిడుచున్నారు.

               వారు ఏకకంఠముతో

               సంతోషముగా అరచుచున్నారు.

               ప్రభువు సియోనునకు

               తిరిగివచ్చుటను కన్నులార గాంచుచున్నారు.

9.           యెరూషలేములోని శిథిలగృహములారా!

               మీరు ఏకకంఠముతో సంతోషముగా అరువుడు.

               ప్రభువు తన నగరమును కాపాడును.

               తన జనులను ఓదార్చును.

10.         ఎల్లజాతులును చూచుచుండగా

               ప్రభువు తన దివ్యశక్తిని ప్రదర్శించును.

               భూధిగంతవాసులెల్లరును 

               మన దేవుని రక్షణమును కాంచుదురు.

11.           ప్రభువు దేవాలయపాత్రములు

               కొనిపోవువారలారా!

               మీరు బబులోనియానుండి వెడలిపొండు.

               అపవిత్ర వస్తువులను ముట్టకుడు.

               పవిత్రులుగా ఇచటనుండి వెడలిపొండు.

12.          కాని మీరు వేగిరముగా వెళ్ళిపోనక్కరలేదు,

               ఇచటనుండి పారిపోనక్కరలేదు.

               ప్రభువు మీకు ముందుగా నడచును.

               యిస్రాయేలు దేవుడు

               మీ వెనువెంట వచ్చుచు, మిమ్ము కాపాడును.

ప్రభువు సేవకుని గూర్చిన

నాలుగవ గీతము

13.          ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు:

               ఇదిగో, నా సేవకుడు వివేకముబడయును.  

               అతడు ఘనుడై ప్రశంసలందుకొనును.

14.          జనసమూహములు 

               అతనిని చూచి విభ్రాంతి చెందెను.

               ఏ నరుని రూపము కంటెను చాల వికృతమని

               అతనిని చూచి అనేకులు విస్మయమొందిరో

               ఆ విధముగనే అతని ముఖమును,

               ఆకృతియును వికారముగానుండెను

15.          కనుకనే ఇప్పుడు బహుజాతులు

               అతనిని గాంచి విస్మయమొందును.

               రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు.

               వారు పూర్వము కనివిని ఎరుగని

               సంగతులను తెలిసికొందురు.