53 1. ప్రజలిట్లు బదులు చెప్పుదురు:
మేమిపుడు విన్నవించు సంగతులను
ఎవరు నమ్మిరి?
ఇది ప్రభువువలన జరిగెనని
ఎవరు గ్రహించిరి?
2. దైవచిత్తము వలన అతడు ఎండిననేలలో
వేరుపాతుకొని లేతమొక్కవలె పెరిగెను.
అతనికి సౌందర్యముగాని,
చక్కదనముగాని లేదయ్యెను.
మనలను ఆకర్షించు సొగసు
ఏమియు అతనిలో కన్పింపదయ్యెను.
3. ప్రజలతనిని చిన్నచూపు చూచి తృణీకరించిరి.
అతడు విచారగ్రస్తుడును,
బాధామయుడును అయినవాడు.
నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు.
జనులతనిని తిరస్కరించుటచే
మనమతనిని లెక్కచేయలేదు.
4. అయినను అతడు మన రోగములను భరించెను.
మన దుఃఖములను వహించెను.
ప్రభువు అతనిని మోది శిక్షించి
దుఃఖపెట్టెనని మనము భావించితిమి.
5. కాని అతడు
మన తప్పిదములకొరకు గాయపడెను.
మన పాపములకొరకు నలిగిపోయెను.
అతడు అనుభవించిన శిక్షద్వారా
మనకు సమాధానము కలిగెను.
అతడు పొందిన దెబ్బలద్వారా
మనకు స్వస్థత చేకూరెను.
6. మనమందరము గొఱ్ఱెలవలె దారితప్పితిమి.
ప్రతివాడును తనకిష్టమైన
త్రోవన తొలగిపోయెను.
కాని ప్రభువు
మన అందరి దోషమును అతనిమీద మోపెను.
7. దౌర్జన్యమునకు గురియైనను
అతడు వినయముతో సహించెను.
పల్లెత్తుమాట అనడయ్యెను.
అతడు వధకు గొనిపోబడు గొఱ్ఱెపిల్లవలెను,
ఉన్ని కత్తిరింపబడు గొఱ్ఱెవలెను
మౌనముగానుండెనే కాని నోరుతెరవలేదు.
8. అతనిని దౌర్జన్యముగను,
అన్యాయముగను కొనిపోయిరి.
అతడి గతిని ప్టించుకొన్నవారే లేరాయెను.
అతనిని నరికి
సజీవుల లోకమునుండి తొలగించిరి.
మన ప్రజల పాపములకొరకు అతనిని వధించిరి.
9. అతడు హింసాపూరితమైనదేదియు చేయకున్నను
అతనిలో ఏ కపటము లేకున్నను
అతనిని దుష్టులప్రక్కన పాతిప్టిెరి.
తన మరణములో
ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను.
10. ప్రభువు ఇట్లు అనుచున్నాడు:
అయినను అతనిని బాధాభరితుని
చేయవలెననియే నా సంకల్పము.
అతడు తననుతానే పాపపరిహారబలిచేయగా
అతడు దీర్ఘాయువును బడసి,
పుత్రపౌత్రులను జూచును.
అతని ద్వారా నా సంకల్పము నెరవేరును.
11. బాధలు ముగియగా అతడు మరల
ఆనందము చెందును.
నీతిమంతుడైన నా సేవకుడు
పెక్కుమంది దోషములను భరించును.
అతనిని చూచి
నేను వారి తప్పిదములను మన్నింతును.
12. అతడు తన ప్రాణములను అర్పించెను.
దుష్టుడుగా ఎంచబడెను.
పెక్కుమంది దోషములను భరించి,
వారి పాపముల పరిహారముకొరకు
విజ్ఞాపనము చేసెను.
కనుక నేను అతనిని గొప్పవానిని చేయుదును. అతడు ఘనులలో నొకడుగా గణింపబడును.