సియోను అభ్యుదయము

60 1.     లెమ్ము, ప్రకాశింపుము.

                              నీకు వెలుగు ప్రాప్తించినది.

                              ప్రభువుతేజస్సు నీపై వెలుగొందుచున్నది.

2.           ధరణిని చీకట్లు ఆవరించియున్నను,

               జాతులను తమస్సు కప్పియున్నను,

               నీపైని ప్రభువు ఉదయించును.

               ఆయన కాంతి నీపై తేజరిల్లును.

3.           జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును.

               రాజులు కాంతిమంతమైన

               నీ అభ్యుదయమును చూడవత్తురు.

4.           కన్నులెత్తి నలువైపుల పరికించిచూడుము.

               జనులు ప్రోగై నీ చెంతకువచ్చుచున్నారు.

               నీ కుమారులు

               దూరప్రాంతములనుండి వచ్చుచున్నారు.

               నీ కుమార్తెలను

               పసికందులవలె మోసికొని వచ్చుచున్నారు.

5.           ఆ దృశ్యమును గాంచి

               నీవు సంతసముతో మెరయుదువు.

               నీ హృదయము ఆనందముతో పొంగిపోవును.

               సాగర సంపదలు నిన్ను చేరును.

               జాతుల సొత్తు నీకడకు వచ్చును.

6.           ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును.

               మిద్యాను, ఏఫాల నుండి ల్టొిపిట్టలు

               నీ వద్దకు వచ్చును.

               అవి షేబా నుండి బంగారమును,

               సాంబ్రాణిని గొనివచ్చును.

               ప్రజలు ప్రభువు స్తుతులను పాడుదురు.

7.            కేదారు గొఱ్ఱెలమందలను

               నీ వద్దకు తోలుకొని వత్తురు.

               నెబాయోతు పొట్టేళ్ళను బలికి కొనివత్తురు.

               అవి ప్రభువునకు అంగీకృతములై,

               పీఠముపై బలిగావింపబడును.

               ఆయన తన మందిరమును

               మహిమాన్వితము చేయును.

8.           మేఘములవలెను, గూళ్ళకు చేరు గువ్వల వలెను

               ఎగురుచు వచ్చెడి ఆ వస్తువులేమివి?

9.           అవి దూరప్రాంతము నుండియు,

               తర్షీషు నుండియు ప్రోగయి వచ్చు నావలు.

               అవి నీ ప్రజలను కొనివచ్చుచున్నవి.

               అవి వెండిబంగారములతో వచ్చి జాతులు

               నిన్ను గౌరవించునట్లు చేసినవాడును,

               యిస్రాయేలు పవిత్రదేవుడునైౖన

               నీ ప్రభువు నామమునకు కీర్తి దెచ్చును.

10.         ప్రభువు ఇట్లు అనుచున్నాడు:

               అన్యజాతులు నీ ప్రాకారమును పునర్నిర్మించును.

               వారి ఏలికలు నీకు సేవలు చేయుదురు.

               నేను కోపముతెచ్చుకొని నిన్ను శిక్షించితిని.

               కాని ఇప్పుడు నిన్ను కరుణించి ఆదరింతును.

11.           నీ ద్వారములు నిరంతరము

               తెరువబడి ఉండును.

               రేయింబవళ్ళును వానిని తెరచియుంతురు.

               కావున జాతులు తమ రాజులతోగూడి

               తమసంపదలను గొనివత్తురు.

12.          నీకు సేవలు చేయనొల్లని జాతులు,

               రాజ్యములు నిలువవు.

               అవి సర్వనాశనమగును.

13.          లెబానోను నుండి మేలిరకపు కొయ్యను,

               దేవదారులు, తమాలములు,

               సరళ వృక్షములను గొనివచ్చి,

               నా దేవాలయమును

               సుందరముగా తీర్చిదిద్దుదురు.

               నేను వసించు నగరము శోభాయమానమగును.

14.          నిన్ను పీడించినవారి తనయులు నీ చెంతకువచ్చి,

               నీకు వంగి నమస్కారము చేయుదురు.

               నిన్ను చిన్నచూపు చూచినవారే

               నీ పాదములపై బడుదురు.

               వారు నిన్ను ప్రభువు నగరమనియు,

               యిస్రాయేలు పవిత్రదేవుని పట్టణమైన సియోను

               అనియు పిలుతురు.

15.          నిన్నిక మీదట ప్రజలు పరిత్యజింపరు,

               ద్వేషింపరు, విసర్జింపరు. నేను నిన్ను సదా

               సర్వోత్క ృష్టమైన దానినిగా చేయుదును.   నిరతము ప్రమోదము

               చెందుదానినిగా చేయుదును.

16.          జాతులు, రాజులుకూడ

               నిన్ను దాదివలె పాలిచ్చిపెంచుదురు.

               ప్రభుడనైన నేను నిన్ను రక్షించితిననియు,

               బలాఢ్యుడను, యాకోబు దేవుడనైన నేను

               నీ బానిసత్వమును బాపితిననియు

               నీవు గుర్తింతువు.

17.          నేను నీకు ఇత్తడికి బదులుగా బంగారమును,

               ఇనుమునకు బదులుగా వెండిని,

               కొయ్యకు మారుగా ఇత్తడిని,

               రాళ్ళకు మారుగా ఇనుమును గొనివత్తును.

               నీ పాలకులు నిన్నిక పీడింపరు.

               నీ అధికారులు

               నిన్ను న్యాయముగా పరిపాలింతురు.

18.          నీ నేలపై బలాత్కారనాదములిక విన్పింపవు.

               వినాశనము నీ పొలిమేరల లోపల కన్పింపదు.

               నీ ప్రాకారములకు రక్షణమనియు

               నీ ద్వారములకు దైవస్తుతియనియు పేరిడుదువు.

19.          నీకిక పగలు సూర్యుని వెలుగును అక్కరలేదు.

               రేయి చంద్రుని వెన్నెలయు అక్కరలేదు.

               ప్రభుడనైన నేను నీకు శాశ్వతజ్యోతిని అగుదును.

               నీ దేవుడనైన నేను నీకు తేజస్సునగుదును.

20.        నీ సూర్యుడిక క్రుంగడు.

               నీ చంద్రుడిక క్షీణథనొందడు.

               ప్రభుడనైన నేను నీకు శాశ్వతజ్యోతిని అగుదును.

               నీ విచారదినములు ఇక ముగియును.

21.          నీ ప్రజలు నీతితో వర్తించుచు,

               భూమిని శాశ్వతముగా భుక్తము చేసికొందురు.

               నేను నా కీర్తిని ఎల్లరికిని వెల్లడిచేయుటకుగాను

               వారిని కొమ్మవలె నాితిని, వారిని సృజించితిని.

22.        నీ ప్రజలలో స్వల్పసంఖ్యాకులును

               పెద్దజాతి అగుదురు.

               ఊరుపేరు లేనివారును

               బలమైన జాతి అగుదురు.

               అనుకూలమైన సమయము రాగానే

               నేను ఈ కార్యమును శీఘ్రమే నెరవేర్చెదను.

               నేను ప్రభుడను.