న్యాయముచేయు దేవునికి కృతజ్ఞతలు
ప్రధానగాయకునికి మూత్లాబెన్ అను రాగముమీద పాడదగిన దావీదు కీర్తన
9 1. ప్రభూ! నేను నిన్ను పూర్ణహృదయముతో
కృతజ్ఞతతో స్తుతింతును.
నీ అద్భుతకార్యములనెల్ల
ప్రకటనము చేయుదును.
2. నేను నిన్ను తలంచుకొని
పరమానందము చెందుదును.
మహోన్నతుడవైన నిన్ను
కీర్తనలతో కొనియాడెదను.
3. నిన్ను చూచి
నా శత్రువులు భయముతో వెనుదిరుగుదురు.
నేలమీద కూలిపడి అసువులు బాయుదురు.
4. నీవు న్యాయముగల న్యాయాధిపతివిగా
సింహాసనముపై కూర్చుండి
నాకు అనుకూలముగా తీర్పుతీర్చితివి.
5. నీవు అన్యజాతులను అణచివేసి,
దుష్టులను నాశనము చేసితివి.
వారి పేరు శాశ్వతముగా
మాసిపోవునట్లు చేసితివి.
6. మా శత్రువులు శాశ్వతముగా అణగారిపోయిరి.
నీవు వారి పట్టణములను నాశనము చేసి,
వారి పేరు మరల విన్పింపకుండునట్లు చేసితివి.
7. ప్రభువు కలకాలము రాజుగా నుండును.
ఆయన సింహాసనమునెక్కి తీర్పుతీర్చును.
8. ఆయన న్యాయముతో
లోకమును పరిపాలించును.
ధర్మముతో జనులకు తీర్పుచెప్పును.
9. ప్రభువు పీడితులకు దుర్గము,
ఆపదలో ఉన్నవారికి ఆశ్రయస్థానము.
10. ప్రభూ! నిన్ను గూర్చి తెలిసినవారు
నిన్ను నమ్ముదురు.
నిన్ను వెదుకువారిని నీవు చేయివిడువవు.
11. సియోను నుండి
పరిపాలనముచేయు ప్రభువును కీర్తింపుడు.
ఆయన చేసిన మహాకార్యములను
జాతులకు విన్పింపుడు.
12. ఆయన బాధార్తులను జ్ఞప్తికితెచ్చుకొనును.
బాధపడువారి మొరను తప్పకవినును.
13. ప్రభూ! నా బాధలనుచూచి నన్ను కరుణింపుము.
మృత్యుద్వారమునుండి నన్ను వెనుకకు కొనిరమ్ము.
14. అప్పుడు నేను సియోను
నగరద్వారములచెంత నిలుచుండి,
ప్రజల ఎదుట నీ స్తుతులను పాడెదను.
నీవు నన్ను రక్షించినందుకుగాను
పరమానందము చెందెదను.
15. అన్యజాతులు
తాము త్రవ్వినగోతిలో తామేకూలిరి.
తాము పన్నిన ఉరులలో తామే చిక్కుకొనిరి.
16. ధర్మయుక్తమైన తీర్పుద్వారా
ప్రభువు తననుతాను ఎరుకపరచుకొనెను. దుష్టులు తాము పన్నిన వలలలో
తామే చిక్కుకొనిరి.
17. దుష్టులు, దేవుని విస్మరించు జాతులు
మృత్యువువాత పడుదురుగాక!
18. అక్కరలో ఉన్నవారిని
ప్రభువెన్నడును మరచిపోడు.
ఆయన పీడితుల ఆశలనేనాడును వమ్ముచేయడు.
19. ప్రభూ! లెమ్ము!
నరులను నీ మీద సవాలు చేయనీయకుము.
జాతులను ప్రోగుచేసి వారికి తీర్పుచెప్పుము.
20. వారు భయముతో కంపించిపోవునట్లు చేయుము
తాము నరమాత్రులమని
గ్రహించునట్లు చేయుము.