దేవునియందు నమ్మకము
ప్రధానగాయకునికి దావీదు కీర్తన
11 1. నేను ప్రభువు శరణుజొచ్చియున్నాను.
”నీవు పక్షివలె కొండలకు పారిపొమ్మని
మీరు నాతో చెప్పుటెందుకు?
2. దుష్టులు విల్లువంచి, బాణములెక్కుప్టిె,
దొంగచాటుగా సజ్జనులపై సంధించుటకై
సిద్ధముగా ఉన్నారు.
3. పునాదులే కూలిపోవునపుడు
సజ్జనులు ఏమి చేయగలరు?”
అని మీరు నాతో నుడువనేల?
4. ప్రభువు తన పవిత్రమందిరమున ఉన్నాడు.
ఆయన సింహాసనము ఆకాశమున ఉన్నది.
ఆయన భూలోకముమీదికి
దృష్టి ప్రసరించియున్నాడు.
ఆయన కళ్ళు నరులనందరిని
పరీశీలించి చూచును.
5. ప్రభువు మంచివారిని చెడ్డవారినికూడ
పరీక్షించి చూచును. హింసకు ఒడిగట్టువారిని
ఆయన అసహ్యించుకొనును.
6. ఆయన దుష్టులమీద నిప్పుకణికలు,
అగ్ని, గంధకము కురియించును.
వేడిగాడ్పులతో వారిని శిక్షించును.
7. ప్రభువు నీతిమంతుడు,
నీతికార్యములనే ప్రేమించును.
నీతిని కాంక్షించువారు యదార్ధవంతులును
ఆయన దివ్యముఖమును దర్శింతురు.