ప్రభువే నాకు వారసభూమి
దావీదునకు అంకితమైన కీర్తన
16 1. ప్రభూ! నన్ను కాపాడుము.
నేను నిన్ను శరణువేడుచున్నాను.
2. నేను ప్రభువుతో ”నీవే నాకు దేవుడవు,
నాకబ్బెడు భాగ్యములన్నియు
నీ నుండియే లభించుచున్నవి” అని చెప్పెదను.
3. ఈ లోకమున జీవించు ప్రభువుభక్తులు
మహోత్తములు వారనిన నాకు పరమప్రమోదము.
4. అన్యదైవములను ఆశ్రయించువారు
పెక్కు శ్రమలకు గురియగుదురు.
నేను వారి రక్తబలులలో పాల్గొనను.
వారుకొలుచు దైవముల పేరైన నేను ఎత్తను.
5. ప్రభువే నాకు వారసత్వభూమి,
నాకు పానపాత్రము,
నా ప్రాణము ఆయన అధీనమున ఉన్నది.
6. మంచిభూమిలోనే నాకు భాగము లభించినది. నాకు లభించిన వారసత్వభూమి
కడు శ్రేష్ఠమైనది.
7. ప్రభువు నాకు హితోపదేశము చేయును గనుక
నేను ఆయనను స్తుతింతును.
రాత్రులందు నా అంతరాత్మ
నన్ను హెచ్చరించుచుండును.
8. నేను ప్రభుని నిత్యము
నా కనుల ఎదుట నిలుపుకొందును.
అతడు నా కుడిప్రక్కన ఉన్నాడు
కనుక నేను తొణకను.
9. అందువలన నా హృదయము
సంతోషించుచున్నది.
నా ఆత్మ ఆనందించుచున్నది.
నా దేహము భద్రతగొనియున్నది.
10. నీవు నన్ను పాతాళమునకు పంపవు.
నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవు.
11. జీవమునకు చేర్చు మార్గమును
నీవు నాకు చూపింతువు.
నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును.
నీ కుడిచేతిలో శాశ్వతసుఖములు కలవు.