పాపమును ఒప్పుకొని
మన్నింపును బడయుట
దావీదు కీర్తన-దైవధ్యానము
32 1. ప్రభువు ఎవరి పాపములను మన్నించునో,
ఎవరి తప్పిదములను తుడిచివేయునో
ఆ నరుడు ధన్యుడు.
2. ప్రభువు ఎవరిని దోషిగా గణింపడో,
ఎవడు కపాత్ముడు కాడో,
ఆ జనుడు భాగ్యవంతుడు.
3. నేను నా తప్పును ఒప్పుకొనక
మౌనముగా ఉన్నపుడు,
దినమంతయు నిట్టూర్పులు విడచుచు
క్రుంగికృశించితిని.
4. ప్రభూ! రేయింబవళ్ళు నీవు నన్ను
కఠినముగా దండించితివి.
వేసవి వేడిమికి చెమ్మవలె
నా సత్తువ ఎండిపోయెను.
5. అప్పుడు నేను నా పాపమును ఒప్పుకొింని.
నా అపరాధమును దాచనైతిని.
”నేను ప్రభువునెదుట
నా తప్పిదమును ఒప్పుకొందును” అనుకొనగా
నా దోషమును మన్నించితివి.
6. కనుక నీ భక్తులెల్లరు ఆపదలలో
నీకు ప్రార్థన చేయవలయును.
అప్పుడు జలప్రవాహములు
పొంగివచ్చినను వారిని తాకజాలవు.
7. నేను తలదాచుకొనుచోటు నీవే.
నన్నాపదనుండి కాపాడువాడవు నీవే.
నీవు నన్ను రక్షింతువు కనుక
నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును.
8. నేను నీకు ఉపదేశము చేయుదును.
నీవు నడువవలసిన మార్గమును చూపింతును.
నీ మీద దృష్టినిలిపి నీకు సలహానిత్తును.
9. నీవు జ్ఞానములేని గుఱ్ఱమువలెను,
గాడిదవలెను ప్రవర్తింపవలదు.
అవి పగ్గమును, కళ్ళెమును
వేసిననేగాని అదుపులోనికి రావు.
10. దుష్టులు పెక్కు వేదనలను అనుభవింతురు.
కాని ప్రభువును నమ్మినవారిని
అతని కృప ఆవరించియుండును.
11. పుణ్యపురుషులు ప్రభువునందు ఆనందించి,
సంతసిల్లుదురుగాక!
నీతిమంతులు సంతోషనాదము
చేయుదురుగాక!