యిస్రాయేలు రాజును, లోకనాయకుడునైన ప్రభువు
ప్రధానగాయకునికి కోరపుత్రులు రచించిన గీతము
47 1. నిఖిల జాతులారా! చప్పట్లు కొట్టుడు.
జయజయ నాదములతో
ప్రభువును కీర్తింపుడు.
2. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు.
అతడు విశ్వధాత్రిని పాలించుమహారాజు.
3. అతడు అన్యజాతులు మనకు
లొంగిపోవునట్లు చేయును.
వారిని మనకు పాదాక్రాంతులను చేయును.
4. మనకు భుక్తమైయున్న ఈ దేశమును
అతడు మనకొరకు ఎన్నుకొనెను.
ప్రభువునకు ప్రీతిపాత్రులైన
యిస్రాయేలు ప్రజలు ఈ గడ్డనుచూచి
గర్వపడుదురు.
5. జనులు జేకొట్టుచు బూరలు ఊదుచుండగా
ప్రభువు తన సింహాసనమును అధిరోహించును.
6. ప్రభువును కీర్తించి స్తుతింపుడు.
మన రాజును కీర్తించి స్తుతింపుడు.
7. అతడు విశ్వధాత్రికిని రాజు.
రమ్యముగా కీర్తనలుపాడి
అతనిని వినుతింపుడు.
8. ప్రభువు తన పవిత్రసింహాసనమును
అధిరోహించి అన్యజాతులను పరిపాలించును.
9. అన్యజాతుల నాయకులువచ్చి
అబ్రహాము దేవుని కొలుచు ప్రజలతో
కలసిపోవుచున్నారు.
భూమి మీద రాజులెల్లరు
ప్రభువునకు చెందినవారే.
ఆయన మహోన్నతముగా ప్రస్తుతింపబడును.