రానున్న రాజుకొరకు ప్రార్థన
సొలోమోను కీర్తన
72 1. దేవా!
రాజునకు నీ న్యాయమును ప్రసాదింపుము.
రాకుమారునికి నీ నీతిని దయచేయుము.
2. అప్పుడతడు నీ ప్రజలను
నీతియుక్తముగా పాలించును.
పేదలను న్యాయసమ్మతముగా ఏలును.
3. పర్వతములు సమృద్ధిని కొండలు నీతిని
ప్రజలకు కలుగజేయునుగాక!
4. రాజు పేదలను కాపాడునుగాక!
అక్కరలోనున్నవారిని ఆదుకొనునుగాక!
పీడకులను నాశనము చేయునుగాక!
5. ఆకసమున సూర్యచంద్రులు ఉన్నంతకాలము
అతను భయభక్తులు కలిగిఉండునుగాక!
6. గడ్డిబీడులపై వాన కురిసినట్లుగాను,
పొలముపై జల్లు పడినట్లుగాను
రాజు తేజరిల్లునుగాక!
7. అతని జీవితకాలమున న్యాయము వర్ధిల్లునుగాక!
చంద్రుడు వెలుగొందినవరకు
దేశమున సమృద్ధినెలకొనునుగాక!
8. సముద్రమునుండి సముద్రమువరకును,
యూఫ్రీసు నదినుండి నేల అంచులవరకును
అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక!
9. ఎడారివాసులు అతనికి తలవంచుదురు.
అతని విరోధులు మన్నుగరతురు.
10. తర్షీషు రాజులు, ద్వీపముల నృపులు
కప్పము కట్టుదురు.
షేబా, సెబా పాలకులు కానుకలు కొనివత్తురు.
11. రాజులెల్లరు అతనికి శిరమువంతురు.
జాతులెల్ల అతనికి ఊడిగము చేయును.
12. అతడు తనకు మొరపెట్టుకొనిన
పేదలను రక్షించును.
దిక్కుమొక్కులేని దీనులను కాపాడును.
13. దరిద్రులను, నిస్సహాయులను దయతో చూచును.
అక్కరలోనున్న వారిని ఆదుకొనును.
14. పీడకులనుండి, హింసాపరులనుండి
ఆ ఆర్తులను కాపాడును.
అతని దృష్టిలో వారి ప్రాణములు అమూల్యమైనవి.
15. రాజునకు దీర్ఘాయువు కలుగునుగాక!
షేబానుండి అతనికి బంగారమును
కొనివత్తురు గాక!
ప్రజలు అతనికొరకు నిరంతరము
ప్రార్థనలు అర్పింతురుగాక!
ఎల్లవేళల దేవుడు అతనిని దీవించునుగాక!
16. దేశమున ధాన్యము సమృద్ధిగా పండునుగాక!
లెబానోను మండలమునవలె కొండలమీదకూడ
పంటలు పుష్కలముగా పండునుగాక!
పొలమున గడ్డి ఎదిగినట్లుగా పట్టణములు
ప్రజలతో నిండియుండునుగాక!
17. రాజు పేరు కలకాలము నిలుచునుగాక!
సూర్యుడున్నంతకాలము
అతని కీర్తి నిలిచియుండునుగాక!
అతనిద్వారా ఎల్ల ప్రజలకును
దీవెనలు లభించునుగాక!
ఎల్ల జాతులతనిని ధన్యుడని కొనియాడునుగాక!
18. యిస్రాయేలు దేవుడైన ప్రభువునకు
నుతులు కలుగునుగాక!
ఆయన మాత్రమే
ఇి్ట అద్భుతకార్యములు చేయగలవాడు.
19. ఆయన దివ్యనామమునకు
సదా మహిమ కలుగునుగాక!
ఈ ధాత్రి అంతయు ఆయన
తేజస్సుతో నిండియుండునుగాక!
ఆమెన్! ఆమెన్! యిషాయి కుమారుడైన
దావీదు ప్రార్థనలు ముగిసినవి.