లోకమునకు న్యాయాధిపతి

కీర్తన – గీతము

98 1.     ప్రభువునకు కొత్తపాట పాడుడు.  ఆయన అద్భుతకార్యములు చేసెను.

                              ఆయన తన దక్ష్షిణహస్తమువలనను, పవిత్రమైన తన బాహువువలనను,

                              విజయమును సాధించెను.

2.           ప్రభువు తన విజయమును ఎరిగించెను.

               తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను.

3.           యిస్రాయేలీయులపట్ల కృపను,

               విశ్వసనీయతను చూపుదునన్న

               తన ప్రమాణమును నిలబెట్టుకొనెను.

               నేల అంచులవరకుగల జనులెల్లరును

               మన ప్రభువు విజయమును గాంచిరి.

4.           విశ్వధాత్రీ! ప్రభువునకు జేకొట్టుము.

               ఆనందనాదము చేయుచు,

               అతనికి కీర్తనలు పాడుము.

5.           కీర్తనలతో ప్రభువును వినుతింపుడు.

               సితార వాద్యములతో సంగీతము విన్పింపుడు.

6.           బూరలను, కొమ్ములను ఊది

               మన రాజైన ప్రభువునకు జేకొట్టుడు.

7.            సముద్రము, దానిలోని జీవులు,

               హోరుమని గర్జించునుగాక !

               లోకము, దానిలోని జీవులు కేరింతలిడునుగాక!

8.           నదులు చప్పట్లు కొట్టునుగాక !

               పర్వతములు ఏకమై సంతోషనాదము చేయునుగాక!

9.           ప్రభువు లోకమునకు తీర్పుతీర్చుటకు వేంచేయును

               అతడు న్యాయముగ, నిష్పక్షపాతముగ

               లోకములోని జాతులకు తీర్పుతీర్చును.

పాత నిబంధనము                                             Home                                           నూతన నిబంధనము